Telugu Global
National

సైనికుల జీతం, జీవితం ఖజానాకు భారమా..? అగ్నిపథ్ పై అసంతృప్తి..

భారత సైన్యంలో కాంట్రాక్ట్‌ బేస్ ఉద్యోగాల కోసం అగ్నిపథ్ అనే పథకాన్ని అమలు చేయాలని చూస్తోంది కేంద్రం. దీనికి సంబంధించిన విధి విధానాలను ప్రకటించింది. అయితే దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం ప్రతిపక్షాలే కాదు, ప్రజల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. సైనిక ఉద్యోగాలకోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండేళ్లుగా తాము సైనిక ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నామని, ఉద్యోగం నాలుగేళ్లే అనడం అన్యాయమని అంటున్నారు. తమను పిచ్చివాళ్లను చేసేలా […]

dissatisfied-Agneepath-scheme
X

భారత సైన్యంలో కాంట్రాక్ట్‌ బేస్ ఉద్యోగాల కోసం అగ్నిపథ్ అనే పథకాన్ని అమలు చేయాలని చూస్తోంది కేంద్రం. దీనికి సంబంధించిన విధి విధానాలను ప్రకటించింది. అయితే దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం ప్రతిపక్షాలే కాదు, ప్రజల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. సైనిక ఉద్యోగాలకోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండేళ్లుగా తాము సైనిక ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నామని, ఉద్యోగం నాలుగేళ్లే అనడం అన్యాయమని అంటున్నారు. తమను పిచ్చివాళ్లను చేసేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రతిపక్షాల విమర్శలు..

సాయుధ బలగాల శౌర్యపరాక్రమాల విషయంలో కేంద్రం రాజీపడొద్దని రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేశారు. భారత్‌ కు రెండు వైపుల నుంచి శత్రువుల ముప్పు పొంచి ఉందని, ఇప్పుడీ అగ్నిపథ్‌ పథకం సాయుధ బలగాల నిర్వహణ సామర్థ్యాన్ని బలహీనపరుస్తుందని చెప్పారు. సైనికుల సుదీర్ఘకాల సేవలను భారత ప్రభుత్వం భారంగా భావిస్తోందా? అని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్‌ పథకంతో దేశానికి గానీ, యువతకు గానీ లాభం లేదని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత భూపేందర్‌ సింగ్‌ హుడా. రిటైర్డ్ మేజర్‌ జనరల్‌ బీఎస్‌ ధనోవా కూడా అగ్నిపథ్ కి మార్పులు చేర్పులు సూచించారు. కొత్తగా నియమించుకొనే వారికి కనీసం ఏడేళ్ల పాటు సర్వీసు ఉండేలా చూడాలని, వారిలో 50 శాతం మందిని శాశ్వత సర్వీసుల్లోకి తీసుకోవాలన్నారు. సైనిక బలగాల రిక్రూట్‌మెంట్‌ను కేవలం ఆర్థికపరమైన కోణంలోనే చూడటం సరికాదని సీనియర్ ఆర్మీ అధికారి మేజర్ జనరల్ యష్ మోర్ అన్నారు. సైనికుల జీవితం, కెరీర్‌ అంశాలను ఖజానాకు డబ్బు ఆదా చేసే కోణంలో చూడొద్దని సూచించారు.

నాలుగేళ్ల తర్వాత ఏం చేయాలి..?

కేవలం నాలుగేళ్ల పాటే సైన్యంలో పనిచేస్తే.. ఆ తర్వాత మా పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు యువకులు. అగ్నిపథ్‌ పథకంపై బీహార్ యువకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేవలం నాలుగేళ్లు మాత్రమే సర్వీసు అంటే ఆ తర్వాత ఇతర ఉద్యోగాల కోసం మళ్లీ చదువుకొని ఇతరులతో పోటీపడాల్సి ఉంటుందని అంటున్నారు. నాలుగేళ్లు మాత్రమే సర్వీసులోకి తీసుకోవడంతో యువతలో పోరాట స్ఫూర్తి దెబ్బ తింటుందని చెబుతున్నారు. రిస్క్‌ తీసుకోవడంలోనూ అంత చొరవ ప్రదర్శించరని అంటున్నారు. మొత్తమ్మీద.. సైనిక ఉద్యోగాల నియామకాల్లో ప్రభుత్వం తీసుకు రావాలనుకుంటున్న సంస్కరణలకు ప్రజామోదం లభించేలా లేదు.

First Published:  15 Jun 2022 10:36 PM GMT
Next Story