Telugu Global
National

5జీ స్పెక్ట్రమ్ వేలానికి గ్రీన్ సిగ్నల్.. మరింత వేగంగా డేటా సర్వీసులు

5జీ స్పెక్ట్రమ్ వేలానికి రంగం సిద్దమైంది. రాబోయే 20 ఏళ్ల కాల పరిమితితో 5జీ స్పెక్ట్రాన్ని వేలం వేయడానికి బుధవారం కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర కేబినెట్.. డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలీ కమ్యునికేషన్ (డీవోటీ) ప్రతిపాదించిన స్పెక్ట్రమ్ వేలానికి ఆమోద ముద్ర వేసింది. ఈ సారి టెలికాం కంపెనీలు మొత్తం డబ్బులు ముందే చెల్లించాల్సిన అవసరం ఉండదు. 5జీ స్పెక్ట్రమ్ దక్కించుకున్న కంపెనీలు.. 20 […]

Union-Cabinet-gives-green-signal-auction-5G-spectrum
X

5జీ స్పెక్ట్రమ్ వేలానికి రంగం సిద్దమైంది. రాబోయే 20 ఏళ్ల కాల పరిమితితో 5జీ స్పెక్ట్రాన్ని వేలం వేయడానికి బుధవారం కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర కేబినెట్.. డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలీ కమ్యునికేషన్ (డీవోటీ) ప్రతిపాదించిన స్పెక్ట్రమ్ వేలానికి ఆమోద ముద్ర వేసింది. ఈ సారి టెలికాం కంపెనీలు మొత్తం డబ్బులు ముందే చెల్లించాల్సిన అవసరం ఉండదు. 5జీ స్పెక్ట్రమ్ దక్కించుకున్న కంపెనీలు.. 20 ఈఎంఐ రూపంలో చెల్లించే వెసులుబాటు ఇచ్చింది. ప్రతీ ఏడాది మొదట్లో దానికి సంబంధించిన ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.

అమ్మకానికి ఏ ఫ్రీక్వెన్సీలు?

5జీలో మొత్తం 72,097.85 మెగాహెడ్జ్ స్పెక్ట్రాన్ని 20 ఏళ్ల కాలపరిమితికి వేలం వేస్తారు. ఈ ఏడాది జూలై చివర్లో ఈ వేలం ఉంటుందని డీవోటీ తెలిపింది. లోఫ్రీక్వెన్సీలు అయిన 600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz, మిడ్ రేంజ్ అయిన 3300 MHz, హై రేంజ్ అయిన 26 GHz ఫ్రీక్వెన్సీలు వేలంలో అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు ‘ప్రైవేట్ క్యాప్టీవ్ నెట్‌వర్క్స్’ను కూడా అభివృద్ది చేయడానికి కేబినెట్ అంగీకరించింది. టెల్కోలు ఈ ప్రైవేట్ క్యాప్టీవ్ నెట్‌వర్క్‌ను మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. కానీ వాటి నిరసనలను పట్టించుకోకుండా పీసీఎన్‌లకు ఆమోద ముద్ర వేసింది. వీటి ద్వారా ప్రైవేట్ ఎంటర్‌ప్రైజ్‌లు తమ సొంతంగా కొంత ఏరియాలో నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకోవడానికి వీలుంటుంది. మెషిన్ టూ మెషిన్ కమ్యునికేషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, హెల్త్ కేర్, అగ్రికల్చర్, ఎనర్జీ తదితర రంగాలకు చెందిన కంపెనీలు తమ సొంత నెట్‌వర్క్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు టెల్కోలే వీటికి కావాల్సిన సర్వీసును అందిస్తూ వచ్చాయి. ఇకపై పెద్ద కంపెనీలు తమ అవసరాలకు చిన్న నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకునే వీలుంది.

టెల్కోలపై తగ్గిన భారం..

గతంలో 2జీ, 3జీ, 4జీ స్పెక్ట్రమ్ వేలం వేసినప్పుడు పూర్తికాలానికి సంబంధించిన చెల్లింపులు ముందు చెల్లించాల్సి వచ్చేది. ఏదైనా కంపెనీ నష్టాల బారిన పడి మనుగడ సాగించలేక, స్పెక్ట్రమ్ చెల్లింపులు చేయకపోతే భారీ జరిమానాలు కట్టాల్సి వచ్చేది. ఈ క్రమంలోనే ఎన్నో టెలికాం కంపెనీలు మూతపడి కేవలం పెద్ద ఆపరేటర్లే మార్కెట్లో నిలిచారు. అయితే ఇకపై 5జీ వేలంలో ఇలాంటి ఇబ్బందులు ఉండవు. 20 ఏళ్ల కాల పరిమితికి స్పెక్ట్రమ్ దక్కించుకున్నా.. ముందుగా ఒక ఏడాది చెల్లింపులు చేస్తే సరిపోతుంది. మరోవైపు 10 ఏళ్ల తర్వాత టెలికాం కంపెనీ తమకు 5జీ స్పెక్ట్రమ్ వద్దనుకుంటే తిరిగి కేంద్రానికి ఇచ్చేసే వెసులుబాటు ఉంది. మిగిలిన 10 ఏళ్లకు ఈఎంఐలు కూడా వసూలు చేయదు. స్పెక్ట్రమ్ దక్కించుకునే ఆపరేటర్లు ఏయేటి కాయేడు చెల్లింపులు చెల్లించాల్సి రావడంతో వారిపై ఆర్థిక భారం కూడా తగ్గిపోనుంది. దీంతో వినియోగదారులకు తక్కువ ధరకే 5జీ సేవలు అందించే అవకాశం ఉంది.

4జీ కంటే 10 రెట్ల వేగంగా..

4జీ స్పెక్ట్రమ్ వేలం ద్వారా కేంద్రానికి రూ. 77,814 కోట్ల ఆదాయం సమకూరింది. 5జీ స్పెక్ట్రమ్ వేలం ద్వారా అంతకు ఎక్కువ ఆదాయమే వచ్చే అవకాశం ఉన్నట్లు టెలికాం వర్గాలు అంటున్నాయి. 4జీ, 5జీ మధ్య తేడా లేటెన్సీ మాత్రమే. 4జీలో ఇది 60 మిల్లీ సెకన్ల నుంచి, 98 మిల్లీ సెకన్ల వరకు ఉంటుండగా.. 5జీలో లేటెన్సీ (అచేతన స్థితి) 5 మిల్లీ సెకన్ల కంటే తక్కువే ఉంటుంది. అంతే కాకుండా 4జీ డౌన్ లోడ్ స్పీడ్ అత్యధికంగా 1 జీబీపీఎస్‌గా నమోదైంది. అయితే 5జీలో డౌన్‌లోన్ స్పీడ్ 10 జీబీపీఎస్ వరకు ఉండనున్నది. 4జీ సిగ్నల్స్ ప్రసారానికి టెలికాం టవర్ల వంటివి అవసరం అవుతాయి. కానీ 5జీ సిగ్నల్స్ కోసం ప్రత్యేకంగా టవర్స్ కట్టనవసరం లేదు. పిజ్జా బాక్స్ అంత సైజ్ ఉండే 5జీ పరికరాలను ఏ ప్రదేశంలో అయిన ఉంచి నెట్‌వర్క్ ఏర్పాటు చేయవచ్చు. కాబట్టి, టెలికాం ఆపరేటర్లు వీటికోసం పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. దీంతో ఏ మారుమూల ప్రాంతంలో అయినా 5జీ సేవలు అందుబాటులోకి తీసుకొని రావొచ్చు.

జియో, ఎయిర్‌టెల్, వీఐ మధ్యే పోటీ..

ఇప్పటికే 4జీ సేవలను విజయవంతంగా అందిస్తున్న జియో, ఎయిర్‌టెల్, వీఐ (వోడాఫోన్ ఐడియా) మధ్యే 5జీ పోటీ నెలకొనే అవకాశం ఉంది. 4జీ సేవలతో భారత మార్కెట్లోకి అడుగు పెట్టిన ముఖేష్ అంబానీ ఇప్పుడు దేశంలోనే నెంబర్ 1 నెట్ వర్క్ అధినేత. ఆయన లాగనే మరెవరైనా 5జీ స్పెక్ట్రమ్ కోసం పోటీ పడితే తప్ప.. ఇప్పుడున్న పెద్ద ఆపరేటర్లే 5జీ స్పెక్ట్రమ్ కోసం పోటీ పడే అవకాశం ఉంది. ఇక రాబోయేది అంతా డిజిటల్ మయమే కాబట్టి 5జీ కోసం భారీ పోటీ తప్పదు. మరి ఏయే సంస్థలు ఈ స్పెక్ట్రమ్ దక్కించుకుంటాయో ఓ రెండు నెలలు ఆగితే కాని తెలియదు.

Next Story