Telugu Global
NEWS

ఏ బోర్డు విద్యార్థి అయినా.. తెలంగాణ బడుల్లో తెలుగు సబ్జెక్ట్ చదవాల్సిందే

తెలంగాణలోని పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులు తప్పకుండా తెలుగు ఒక సబ్జెక్ట్‌గా చదవాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. నాలుగేళ్ల క్రితం తెలంగాణ ప్రభుత్వం కంపల్సరీ టీచింగ్ అండ్ లెర్నింగ్ తెలుగు ఇన్ స్కూల్స్ యాక్ట్‌ -2018ని తీసుకొని వచ్చింది. అయితే కోవిడ్ నేపథ్యంలో దాన్ని కేవలం 1 నుంచి 9వ తరగతి వరకు మాత్రమే అమలు చేశారు. కానీ ఈ విద్యా సంవత్సరం (2022-23) నుంచి 1 నుంచి 10వ తరగతి […]

telugu-subject-1st-10th-class-GO
X

తెలంగాణలోని పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులు తప్పకుండా తెలుగు ఒక సబ్జెక్ట్‌గా చదవాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. నాలుగేళ్ల క్రితం తెలంగాణ ప్రభుత్వం కంపల్సరీ టీచింగ్ అండ్ లెర్నింగ్ తెలుగు ఇన్ స్కూల్స్ యాక్ట్‌ -2018ని తీసుకొని వచ్చింది. అయితే కోవిడ్ నేపథ్యంలో దాన్ని కేవలం 1 నుంచి 9వ తరగతి వరకు మాత్రమే అమలు చేశారు. కానీ ఈ విద్యా సంవత్సరం (2022-23) నుంచి 1 నుంచి 10వ తరగతి వరకు పూర్తి స్థాయిలో అమలు చేయాలంటూ డైరక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ జీవో 15 విడుదల చేసింది.

రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు జీవో 15ను కఠినంగా అమలు చేయాల్సిందేనని.. ఆయా జిల్లాల విద్యాధికారులకు ఆదేశాలు అందాయి. కేవలం స్టేట్ బోర్డ్ పరీక్షలు రాసే వాళ్లే కాకుండా.. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ వంటి సెంట్రల్ బోర్డు విద్యార్థులు కూడా తెలుగు ఒక సబ్జెక్టుగా చదవాలని.. చివర్లో పరీక్ష కూడా రాయాల్సి ఉంటుందని స్పష్టంగా పేర్కొన్నది. ఈ నెల మొదట్లోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు అన్ని జిల్లాలకు పంపించినట్లు ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ వర్గాలు చెప్తున్నాయి.

కాగా, ఈ జీవోపై ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ, ఐబీ విద్యా బోధన చేస్తున్న స్కూల్ యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. సెంట్రల్ సిలబస్ బోర్డుతో తెలుగు పరీక్షలు ఎలా నిర్వహిస్తారని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (SCERT) డైరెక్టర్ రాధారెడ్డిని కలిశారు. తమ విద్యాసంస్థలకు సంబంధించిన పరీక్షలను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంట్రల్ బోర్డు నిర్వహిస్తుందని.. ఇప్పటికిప్పుడు తెలుగు సిలబస్ చేర్చి.. పరీక్ష ఎలా నిర్వహించగలమని వాళ్లు విన్నవించారు.

ఇతర తరగతులకు తెలుగు ఇంప్లిమెంట్ చేయడం కష్టం కాదని.. అయితే 10వ తరగతి పరీక్షలు సెంట్రల్ బోర్డు నిర్వహిస్తున్నందున ఎలా ముందుకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు హైదరాబాద్ సహోదయ స్కూల్స్ కాంప్లెక్స్ చైర్మన్ ఎస్. నర్సింహా రెడ్డి చెప్పారు. ఆయన హైదరాబాబాద్ పబ్లిక్ స్కూల్ రామాంతాపూర్ బ్రాంచ్ ప్రిన్సిపల్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.

కాగా, తెలుగు కంపల్సరీ సబ్జెట్ విషయంపై ఇప్పటికే SCERT అన్ని బోర్డులకు లేఖలు రాసింది. అన్ని పాఠశాలల్లో తెలుగు సబ్జెక్ట్ ఈ ఏడాది నుంచి బోధించాలని పేర్కొన్నది. ఏ పాఠశాల అయిన తెలుగు బోధించడంలో విఫలం అయితే జరిమానా విధిస్తామని సెర్ట్ ఆదేశించింది. మొదటి సారి అలా దొరికితే నోటీసులు జారీ చేస్తామని.. అప్పటికీ తెలుగు బోధించడం ప్రారంభించకుంటే రూ. 50 వేల జరిమానా విధిస్తామని చెప్పారు. ఆ తర్వాత కూడా నిర్లక్ష్యం వహిస్తే రూ. 1 లక్ష జరిమానా విధిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

First Published:  15 Jun 2022 8:31 AM GMT
Next Story