Telugu Global
National

రూటు మార్చిన ఎన్ఐఏ.. మావోయిస్టు అగ్రనేతల ఆచూకీ చెప్తే రూ. కోట్లలో నజరానా

కేంద్రంలో ఎన్టీయే ప్రభుత్వం వచ్చిన తర్వాత మావోయిస్టుల అణచివేతను కఠినంగా అమలు చేస్తోంది. ఇప్పటికే చత్తీస్‌గడ్ వంటి ప్రాంతాల్లోని యువత మావోయిస్టు ఉద్యమం వైపు మొగ్గు చూపకుండా చేయడానికి పలు పథకాలు అమలు చేస్తున్నారు. 10వ తరగతి కూడా పాస్ కాని వారిని ఏకంగా సీఆర్‌పీఎఫ్, ఆర్మీలో చేర్చేలా నిబంధనలు సడలిస్తున్నారు. మరోవైపు కొంత మందిని ఇన్‌ఫార్మర్లుగా పెట్టుకొని కీలక నేతల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇన్ని చేసినా అగ్రనేతల జాడ మాత్రం కనిపెట్టలేకపోతోంది. మావోయిస్టుల యాక్టివిటీస్ […]

NIA-announces-reward-Information-Maoist
X

కేంద్రంలో ఎన్టీయే ప్రభుత్వం వచ్చిన తర్వాత మావోయిస్టుల అణచివేతను కఠినంగా అమలు చేస్తోంది. ఇప్పటికే చత్తీస్‌గడ్ వంటి ప్రాంతాల్లోని యువత మావోయిస్టు ఉద్యమం వైపు మొగ్గు చూపకుండా చేయడానికి పలు పథకాలు అమలు చేస్తున్నారు. 10వ తరగతి కూడా పాస్ కాని వారిని ఏకంగా సీఆర్‌పీఎఫ్, ఆర్మీలో చేర్చేలా నిబంధనలు సడలిస్తున్నారు. మరోవైపు కొంత మందిని ఇన్‌ఫార్మర్లుగా పెట్టుకొని కీలక నేతల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇన్ని చేసినా అగ్రనేతల జాడ మాత్రం కనిపెట్టలేకపోతోంది.

మావోయిస్టుల యాక్టివిటీస్ మీద తీవ్రంగా దృష్టి పెట్టిన ఎన్ఐఏ ఇప్పుడు తమ రూట్ మార్చింది. తెలంగాణ, చత్తీస్‌గడ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, అస్సాం రాష్ట్రాల్లో పని చేస్తున్న మావోయిస్టు నేతలను వాంటెడ్ జాబితాలో చేర్చింది. ప్రస్తుతం ఎన్ఐఏ జాబితాలో 106 మంది మావోయిస్టు నేతల పేర్లు ఉన్నాయి. 2013లో చత్తీస్‌గడ్‌లో సల్వాజుడుం అధినేత మహేంద్ర కర్మ సహా 27 మందిపై దాడి చేసి చంపేసిన సంఘటనలో 156 మందిని నిందితులుగా ఎన్ఐఏ పేర్కొన్నది. అయితే వీరిలో కేవలం 21 మందిని మాత్రమే మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది.

ఎన్ఐఏ ఈ మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేతలను పట్టుకోవడానికి ప్రత్యేక వ్యూహం రూపొందించింది. ఆ నేతల ఆచూకీ చెప్పినా, పట్టిచ్చినా, వాళ్లకు సంబంధించిన సమాచారం ఇచ్చినా కోట్లాది రూపాయలు నజరానగా ఇస్తామని ప్రకటించింది. ఎన్ఐఏ చెప్తున్న 21 మంది మోస్ట్ వాంటెడ్ నేతల్లో 14 మంది తెలంగాణకు చెందిన వాళ్లే ఉండటం గమనార్హం. దేశవ్యాస్తంగా 11 రాష్ట్రాల్లోని 73 జిల్లాల్లో మావోయిస్టు కార్యాకలాపాలు చురుగ్గా ఉన్నాయని.. అగ్రనేతలను పట్టుకుంటే తప్ప వీరి ఉద్యమానికి బ్రేక్ పడదని ఎన్ఐఏ భావిస్తోంది. అందుకే ఇప్పుడు అగ్రనేతలపై రివార్డును భారీగా పెంచింది.

మావోయిస్టు పార్టీ మాజీ కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతిపై రూ. 2.52 కోట్ల రివార్డు ఉండగా.. దాన్ని రూ. 3 కోట్లకు పెంచింది. ప్రస్తుత కేంద్ర కమిటీ కార్యదర్శి నంబళ్ల కేశవరావు అలియాస్ బస్వరాజ్‌పై రూ. 50 లక్షలు ఉన్న రివార్డును రూ. 1 కోటికి పెంచింది. అలాగే కేంద్ర కమిటీ సభ్యులైన మల్లోజుల వేణుగోపాల్, కటకం సుదర్శన్, కిషన్ దా, సత్తన్న, కోసా, చేతన్, గాజర్ల రవి, ఊకే గణేష్ తదితరులపై ఉన్న రివార్డులు రూ. 7 లక్షల నుంచి రూ. 1 కోటి వరకు చేరింది.

First Published:  15 Jun 2022 9:45 AM GMT
Next Story