Telugu Global
National

‘శుక్రవారం రాళ్లు విసిరితే శనివారం బుల్డోజర్లు వెల్లువెత్తుతాయి’..బీజేపీ ఎంపీ

బీజేపీ నేత నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల తాలూకు ‘మంటల దుమారం’ ఇంకా చల్లారక ముందే వాటికి ఆజ్యం పోస్తున్నట్టు ఈ పార్టీ ఎంపీ సాక్షి మహారాజ్ మరో ‘సమిధ’ వేశారు. శుక్రవారాలు ఎవరైనా రాళ్లు విసిరితే శనివారాలు బుల్డోజర్లు గర్జిస్తాయని ఆయన హెచ్చరించారు. అంటే శుక్రవారం మసీదుల్లో ముస్లింలు ప్రార్థనలు చేసిన వెంటనే నూపుర్ వ్యాఖ్యలకు నిరసనగా అల్లర్లకు దిగుతూ వారు రాళ్లు విసురుతున్న ఘటనలను ఆయన ప్రస్తావించారు. ఇలా అల్లర్లను రెచ్చగొట్టిన నిందితుల ఇళ్లను […]

BJP-MP-Saksh-maharaj
X

బీజేపీ నేత నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల తాలూకు ‘మంటల దుమారం’ ఇంకా చల్లారక ముందే వాటికి ఆజ్యం పోస్తున్నట్టు ఈ పార్టీ ఎంపీ సాక్షి మహారాజ్ మరో ‘సమిధ’ వేశారు. శుక్రవారాలు ఎవరైనా రాళ్లు విసిరితే శనివారాలు బుల్డోజర్లు గర్జిస్తాయని ఆయన హెచ్చరించారు. అంటే శుక్రవారం మసీదుల్లో ముస్లింలు ప్రార్థనలు చేసిన వెంటనే నూపుర్ వ్యాఖ్యలకు నిరసనగా అల్లర్లకు దిగుతూ వారు రాళ్లు విసురుతున్న ఘటనలను ఆయన ప్రస్తావించారు. ఇలా అల్లర్లను రెచ్చగొట్టిన నిందితుల ఇళ్లను ముఖ్యంగా యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం బుల్డోజర్లతో కూల్చివేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఆందోళనలకు సూత్రధారులైనవారి ఇళ్లను నిర్దాక్షిణ్యంగా బుల్డోజర్లతో కూల్చివేయాలని సాక్షాత్తూ యోగి ఆదిత్యనాథ్ .. అధికారులను ఆదేశించిన విషయం గమనార్హం. యూపీ లోని ప్రయాగ్ రాజ్ లో ఇటీవల ఈ ‘కార్యక్రమాన్ని’ పెద్దఎత్తున చేప‌ట్టారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు సాగాయి. పైగా ఆందోళ‌న‌కారులను పోలీసులు చితకబాదుతున్న దృశ్యాన్ని బీజేపీ ఎమ్మెల్యే ఒకరు వీడియో తీస్తూ.. ‘ఇది రిటర్న్ గిఫ్ట్’ అని వ్యాఖ్యానించిన నేపథ్యంలో సాక్షి మహారాజ్ కూడా చెలరేగిపోయారు. నిరసనకారులు హింసకు పాల్పడితే ఇలాంటి చర్యలు కొనసాగుతాయని ఆయన హెచ్చరించారు. యూపీలో శుక్రవారాలు రాళ్లు విసిరే సంఘటనలు జరిగిన పక్షంలో దీనికి శనివారాలు ప్రతీకారం ఉంటుందని ఆయన ట్వీట్ చేశారు. యూపీలో యోగి ఆదిత్యనాథ్.. ఇలా బుల్డోజర్లను వినియోగించకపోతే పరిస్థితి అదుపు తప్పి చాలా దారుణంగా ఉండేదని సాక్షి మహారాజ్ అన్నారు.

అయితే బీజేపీ పాటిస్తున్న ‘అక్రమ బుల్డోజర్ సంస్కృతిని’ రాజ్యాంగం లేదా కోర్టుల ద్వారానో, చట్టాల ద్వారానో ఆపివేయవచ్చని సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ అన్నారు. ప్రయాగ్ రాజ్ లో అల్లర్ల సూత్రధారి జావేద్ మహమ్మద్ ఇంటిని బుల్డోజర్లతో కూల్చివేసిన ఘటనను ప్రస్తావిస్తూ ఆయన.. బీజేపీకి చట్టాలు, కోర్టులంటే గౌరవం లేదా అని ప్రశ్నించారు. నిజానికి కూల్చివేసిన ఈ ఇంటికి ఆ కుటుంబం పన్నులు కూడా చెల్లించిందని ఆయన చెప్పారు. ఇలా ఎన్ని ఇళ్లను కూల్చివేస్తారన్నారు. ఆ ఇల్లు జావేద్ మహమ్మద్ పేరిట కాక, ఆయన భార్య పేరిట ఉందని తెలిసిందన్నారు. ప్రభుత్వ అధికారులు తమ పొరపాటు తెలుసుకుని మళ్ళీ ఆ కుటుంబానికి న్యాయం చేస్తారా అని కూడా ఆయన ప్రశ్నించారు.

First Published:  15 Jun 2022 3:18 AM GMT
Next Story