Telugu Global
NEWS

పాలేరు వద్దమ్మా.. గ్రేటరే బెటర్.. షర్మిలకు సొంత పార్టీ నేతల సూచన

వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఎక్కడ నుంచి పోటీ చేయాలనే విషయంపై సొంత పార్టీలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీకి దిగాలని ఆమె భావించారు. స్థానిక నేతలు కూడా ఆమె పాలేరు నుంచే బరిలోకి దిగుతారని చెప్తున్నారు. కానీ సీనియర్ నేతలు మాత్రం పాలేరు నుంచి వద్దని గ్రేటర్ పరిధిలోని ఏదో ఒక నియోజకవర్గాన్ని ఎంచుకోవాలని సూచిస్తున్నారు. పాలేరు రాజకీయం చాలా వైవిధ్యంగా ఉంటుందని.. అక్కడి నుంచి పార్టీ అధ్యక్షురాలిగా […]

YSRTP-Sharmila-contest-place
X

వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఎక్కడ నుంచి పోటీ చేయాలనే విషయంపై సొంత పార్టీలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీకి దిగాలని ఆమె భావించారు. స్థానిక నేతలు కూడా ఆమె పాలేరు నుంచే బరిలోకి దిగుతారని చెప్తున్నారు. కానీ సీనియర్ నేతలు మాత్రం పాలేరు నుంచి వద్దని గ్రేటర్ పరిధిలోని ఏదో ఒక నియోజకవర్గాన్ని ఎంచుకోవాలని సూచిస్తున్నారు. పాలేరు రాజకీయం చాలా వైవిధ్యంగా ఉంటుందని.. అక్కడి నుంచి పార్టీ అధ్యక్షురాలిగా పోటీ చేసి ఓడిపోతే పార్టీ శ్రేణులకు నెగెటివ్ మెసేజ్ వెళ్తుందని అంటున్నారు.

పాలేరు నియోజకవర్గానికి రాజకీయాల్లో ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. 2004 వరకు ఇది ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం. 1999లో టీడీపీ నుంచి సండ్ర వెంకటవీరయ్య గెలుపొందారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 2004 ప్రభంజనంలోనూ అక్కడ టీడీపీ గెలుపొందింది. అయితే 2009లో పాలేరు జనరల్ సీటుగా మారడంతో సండ్ర పోటీ చేయడానికి వీల్లేకుండా పోయింది. ఆయన సత్తుపల్లి ఎస్సీ నియోజకవర్గానికి మారిపోవడంతో పాలేరు నుంచి రాంరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేసి గెలుపొందారు.

2009తో పాటు 2014లో కూడా రాంరెడ్డే గెలిచారు. అయితే ఆ తర్వాత ఏడాదే ఆయన చనిపోవడంతో 2016లో ఉప ఎన్నిక వచ్చింది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నుంచి పోటీ చేసి గెలిచారు. ఇక 2018 ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ టికెట్ తుమ్మలకే వరించింది. తెలుగుదేశంలోని పరిచయాలు, అప్పటికే మంత్రిగా చేసిన అభివృద్ది, అధికార టీఆర్ఎస్ టికెట్ తనను గెలిపిస్తాయని నమ్మకం పెట్టుకున్నారు. అయితే పాలేరులో బలంగా ఉన్న కాంగ్రెస్, వామపక్షాలకు తోడు టీఆర్ఎస్‌లోని అసమ్మతి వర్గం మహాకూటమి అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డిని గెలిపించాయి.

పాలేరులో మొదటి నుంచి టీడీపీ, కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్నది. ఇక ఖమ్మం నగరానికి ఆనుకొని ఉన్న మండలాలు ఈ నియోజకవర్గంలో భాగం కావడంతో వామపక్షాలకు కూడా మంచి పట్టు ఉన్నది. చాలా గ్రామాల్లో ఇప్పటికీ సీపీఎం సర్పంచులే ఉన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ మధ్య పోటీ తప్పదు. ఇలాంటి సమయంలో షర్మిల ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం మంచిది కాదని పార్టీ నేతలు అంటున్నారు.

అదే సమయంలో గ్రేటర్ పరిధిలోని ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే గెలుపొందే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఆంధ్రా, రాయలసీమ ఓటర్లు ఉన్న నియోజకవర్గాలను ఎంచుకోవడం ద్వారా ఆమె గెలుపును అందుకోవచ్చని సూచిస్తున్నారు. గ్రేటర్‌లో ఇటీవల బీజేపీ కూడా బలపడింది. కాబట్టి షర్మిల పార్టీకి కూడా స్పేస్ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలో ఒకటికి రెండు సార్లు సర్వే చేయించుకొని గ్రేటర్ ‌లోని ఒక నియోజకవర్గం నుంచి బరిలోకి దిగితే షర్మిల గెలుపు సాధ్యమేనని సొంత పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు.

First Published:  15 Jun 2022 2:15 AM GMT
Next Story