Telugu Global
NEWS

తెలంగాణలో మానవత్వం లేని, చట్టవ్యతిరేక, డబల్ ఇంజన్ బుల్డోజర్ రాజ్యం కావాల్నా ?

ఈ మధ్య బుల్డోజర్ల గురించి దేశవ్యాప్తంగా చర్చజరుగుతోంది. భారతీయ జనతా పార్టీ అనగానే బుల్డోజర్ గుర్తొచ్చే పరిస్థితి వచ్చింది. ఈ మధ్య తెలంగాణలో కూడా ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజా సింగ్ లు కూడా డబల్ ఇంజన్ల గురించి, బుల్డోజర్ల గురించి మాట్లాడుతున్నారు. నిజంగానే గతంలో ఢిల్లీలో, కొంత కాలంగా ఉత్తరప్రదేశ్ లో నడుస్తున్న బుల్డోజర్ రాజ్యం ప్రజలకు ఏమైనా మేలు చేసిందా ? అసలు ఆ బుల్డోజర్ కు మానవత్వం ఉందా […]

up
X

ఈ మధ్య బుల్డోజర్ల గురించి దేశవ్యాప్తంగా చర్చజరుగుతోంది. భారతీయ జనతా పార్టీ అనగానే బుల్డోజర్ గుర్తొచ్చే పరిస్థితి వచ్చింది. ఈ మధ్య తెలంగాణలో కూడా ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజా సింగ్ లు కూడా డబల్ ఇంజన్ల గురించి, బుల్డోజర్ల గురించి మాట్లాడుతున్నారు. నిజంగానే గతంలో ఢిల్లీలో, కొంత కాలంగా ఉత్తరప్రదేశ్ లో నడుస్తున్న బుల్డోజర్ రాజ్యం ప్రజలకు ఏమైనా మేలు చేసిందా ? అసలు ఆ బుల్డోజర్ కు మానవత్వం ఉందా ? కూల్చివేతలకు చట్టబద్దత ఉందా ? మైనార్టీల ఇళ్ళను బుల్డోజర్లు కూల్చి పడేస్తుంటే ఇక్కడ సోషల్ మీడియాలో కొందరు పండుగ చేసుకుంటున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో కూడా బుల్డోజర్లు నడిపించాలని కలలు కంటున్నారు. సోషల్ మీడియాలో విద్వేషం బుల్డోజరై పారుతోంది. ఇదంతా బాగానే ఉంది కానీ కాల్చడం, కూల్చడమే నినాదంగా కొనసాగుతున్న ఉత్తరప్రదేశ్ లో ఏం జరుగుతోంది? ప్రభుత్వం చేపట్టిన కూల్చి వేతలు చట్టబద్దంగా సాగుతున్నాయా ? ప్రభుత్వ ఇలా ప్రజల ఆస్తులు ధ్వంసం చేయడం చట్ట విరుద్దమంటూ సుప్రీం కోర్టు చెప్పినా యూపీలో వినే నాథుడే లేకుండా ఎందుకు పోయాడు ? అసలీ కూల్చి వేతలు చట్టాన్ని రక్షించడానికా లేక విద్వేషాలు రెచ్చగొట్టడానికా ?

నాలుగు రోజుల క్రితం జరిగిన కూల్చివేతల పర్వపు చట్టబద్దతను ఒకసారి చూద్దాం …

మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకురాలు నూపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత దేశవ్యాప్తంగా అనేక చోట్ల నిరసన ప్రదర్శన‌లు జరిగాయి. కొన్ని చోట్ల ఆ ప్రదర్శనలు హింసాయుతంగా మారాయి. పోలీసు కాల్పులు, మరణాలు, లాఠీచార్జ్ లు, టియర్ గ్యాస్ లతో అనేక పట్టణాలు అల్లకల్లోలం అయ్యాయి. ఈ అల్లర్ల తర్వాత కాన్పూర్, సహారన్ పూర్, ప్రయాగరాజ్ లలో బుల్డోజర్ న్యాయం అమలయ్యింది.

ప్రయాగ్ రాజ్ లోని పాత బస్తీలో జె కె ఆషియానా కాలనీలో బుల్డోజర్లు ప్రవేశించి కూల్చి వేతలు ప్రారంభించాయి. వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు జావేద్ మహమ్మద్ ఇంటిని బుల్డోజర్లు నేలమట్టం చేశాయి. ఈయన గతంలో సిఎఎ వ్యతిరేక ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఇతన్ని, ఇతని భార్యను, చిన్న కూతురిని జూన్ 10న పోలీసులు అదుపులోకి తీసుకొని జూన్ 11 న అరెస్టు చేసినట్టు ప్రకటించారు. అది కూడా ఎలాంటి వారెంట్ లేకుండానే.

కరేలీలోని తమ ఇంటి మీద ప్రయాగ్ రాజ్ డెవలప్ మెంట్ అథారిటీ (పిడిఎ) వారు జూన్ 11 రాత్రి ఒక నోటీసు అతికించారనీ, ఇల్లు తక్షణమే ఖాళీ చేయాలనీ, ఆ ఇంటిని కూల్చబోతున్నామనీ ఆ నోటీసులో రాశారని జావేద్ మహమ్మద్ పెద్ద కూతురు, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి, అఫ్రీన్ ఫాతిమా తెలిపారు.

జూన్ 10 అని తేదీ వేసి ఉన్న ఆ నోటీసు మీద ప్రయాగ్ రాజ్ డెవలప్ మెంట్ అథారటీ (పిడిఎ) జాయింట్ సెక్రటరీ/ జోనల్ ఆఫీసర్ సంతకం ఉంది. ఆ ఇల్లు ఉత్తరప్రదేశ్ అర్బన్ ప్లానింగ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్డినెన్స్ 1973 విధించిన నిబంధనలను ఉల్లంఘిస్తూ, పిడిఎ అనుమతి లేకుండా కట్టారని రాశారు.

ఆ ఇల్లు అక్రమ నిర్మాణం అని పేర్కొంటూ, ఇంటి యజమానికి మే 10న సంజాయిషీ నోటీసు ఇచ్చామనీ, మే 24న తమ వాదనలు చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చామనీ, కాని యజమాని కానీ అతని ప్రతినిధిగా న్యాయవాది కానీ ఆ సమావేశానికి హాజరు కాలేదనీ ఆ నోటీసులో రాశారు. నిజానికి తమకు మే 10న నోటీసు ఇచ్చారన్నది అబద్దమని అఫ్రీన్ ఫాతిమా చెప్పారు. పాత డేట్లు వేసి ఇప్పుడు కొత్తగా నోటీసులు ఇచ్చారని ఆమె ఆరోపించారు.

ఇదంతా ఎంత చట్టవ్యతిరేకంగా జరిగిందంటే…నిజానికి నోటీసు జారీ చేసిన జావేద్ మహమ్మద్ పేరు మీద ఆ ఇల్లు లేదు. ఆ ఇల్లు ఆయన భార్య పేరు మీద ఉంది. అంతే కాదు, ఆ ఇల్లు కట్టిన స్థలం ఆమె పూర్వీకుల ఆస్తిగా ఆమెకు వచ్చినది. ఆ స్థలం మీద గాని, ఇంటి మీద గాని జావేద్ కు ఏ చట్టబద్ధమైన హక్కూ లేదు.

పైగా అధికారులు ఇచ్చిన నోటీసులో మే 10న నోటీసు ఇచ్చామని చెప్పారు. మే24న వాదనలు వినిపించమని అడిగామని చెప్పారు. మే25న కూల్చివేత ఉత్తర్వులు జారీచేశామన్నారు. అయితే ఆ మూడు నోటీసులకు సంబంధించి సర్క్యులర్ నంబర్ ఎంత, ఉత్తర్వు నంబర్ ఎంత తదితర వివరాలేవీ లేవు.

“ఆ నోటీసును హడావిడిగా తయారు చేసి, వారాంతపు సెలవులు మొదలయిన రాత్రి అక్కడ అతికించారు. అంటే మాకు న్యాయస్థానానికి వెళ్లే అవకాశం లేకుండా చేశారు. మేం కోర్టుకు వెళ్లి ఉంటే నోటీసులో ఉన్న ఈ సమాచారపు తప్పులను, అసంగతాలను న్యాయస్థానం పట్టుకుని ఉండేదే. ఈ చర్య ఒక ప్రశ్నించే గొంతు మీద కక్ష సాధింపు మాత్రమేనని గుర్తించి ఉండేదే” అని అఫ్రీన్ ఫాతిమా న్యూస్ క్లిక్ అనే వెబ్ సైట్ తో అన్నారు.

ఇదే విషయాన్ని న్యూస్ క్లిక్ ఒక పిడిఎ అధికారిని ప్రశ్నించినప్పుడు ”ఈ చర్యంతా చట్ట ప్రకారంగానే జరిగింది. ఆస్తి యజమానికి మే 10న నోటీసు ఇచ్చాం. మే 24న విచారణకు హాజరు కమ్మన్నాం. కాని వారు ఆ నోటీసును ఖాతరు చేయలేదు. దాని ఫలితంగా, కూల్చివేత ఉత్తర్వు జారీ అయింది. ఇవాళ ఆ ఉత్తర్వులను అమలు చేశాం” అని ఆయన అన్నారు.

కాని పిడిఎ నోటీసు జావేద్ పేరు మీద ఉందనీ, ఆ ఆస్తికి చట్టబద్ధమైన యజమాని ఆయన భార్య అని, మునిసిపల్ రసీదులన్నీ కూడా ఆమె పేరు మీదనే ఉన్నాయని చెప్పినప్పుడు, ఆయన జవాబు ఇవ్వకుండా ఫోన్ పెట్టేశారు.

ప్రైవేట్ ఆస్తుల నష్ట పరిహార చట్టం, 2020 ని సిఎఎ వ్యతిరేక నిరసనకారుల మీద ప్రయోగించినప్పుడు సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తానే ఫిర్యాదీ, తానే న్యాయమూర్తి, తానే అమలు అధికారి లాగా ప్రవర్తిస్తున్నదని వ్యాఖ్యానించింది. చట్టం నిర్దేశించిన విధులకు భిన్నంగా ప్రవర్తిస్తున్నదని అంది. అందువల్ల ఆ కేసులు ముందుకు నడవలేదు.

సుప్రీం కోర్టు ఆదేశాలపై ఉత్తరప్రదేశ్ పోలీసు అదనపు డైరెక్టర్ జనరల్ (శాంతి భద్రతలు) ప్రశాంత్ కుమార్ ను ఎన్ డి టి వి ప్రశ్నించినప్పుడు “మేం గౌరవనీయ సుప్రీం కోర్టు ఆదేశాలను పాటిస్తున్నాం. ప్రభుత్వం ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేసింది. అక్కడ ఈ కేసులను న్యాయాధికారులే విచారిస్తారు. చట్టం నిర్దేశించిన పద్ధతిని పాటిస్తూ మేం ముందుకు వెళ్తాం” అని ప్రశాంత్ కుమార్ అన్నారు.

అంటే సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ బుల్డోజర్ న్యాయం సాగుతుందక్కడ. దీనిపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, ”చట్టం నిర్దేశించిన పద్ధతి అనేది ప్రజాస్వామ్యానికి మౌలిక సూత్రం. ఏ చట్టం కింద, ఏ పద్ధతి ప్రకారం ఈ పని జరిగింది? ఉత్తరప్రదేశ్ భారత రాజ్యాంగం నుంచి తనను తాను మినహాయించుకుంటున్నదా?” అని ప్రశ్నించారు.

జావేద్ మహమ్మద్ ఇల్లు కూల్చివేతను ఇక్కడ ఒక ఉదహరణగానే చూడాలి. ఇలాంటి సంఘటనలు ఉత్తరప్రదేశ్ లో కోకొల్లలు. తమకిష్టం లేని, తమ భావజాలాన్ని వ్యతిరేకించేవాళ్ళపై దాడులు, అరెస్టులు, చిత్రహింసలు, బుల్డోజర్లతో ఆస్తుల ధ్వంసం…ఇదే ఉత్తరప్రదేశ్ లో అమలవుతున్న బుల్డోజర్ చట్టం.
ఉత్తర ప్రదేశ్ లో 10వ తేదీన జరిగిన నిరసనల తర్వాత 13 ఎఫ్ ఐ ఆర్ లు నమోదయ్యాయి. 306 మంది అరెస్టయ్యారు.

ఈ కూల్చివేతలపై అలహాబాద్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గోవింద్ మాథుర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రయాగ్‌రాజ్‌లోని ముస్లిం కార్యకర్త జావేద్ మహ్మద్ ఇంటిని కూల్చివేయడానికి సంబంధించి ఆయన మాట్లాడుతూ

“ఇది పూర్తిగా చట్టవిరుద్ధం. ఆ నిర్మాణం చట్టవిరుద్ధమని ఒకవేళ అనుకున్నా ఆదివారంనాడు కూల్చివేయడం, అందులోనూ ఇంటి యజమానులు పోలీసు నిర్బంధంలో ఉన్నప్పుడు కూల్చి వేయడం అనుమతించకూడదు. ఇది సాంకేతిక సమస్య కాదు. చట్టబద్ద పాలనకు సంబంధించిన ప్రశ్న ఇది. అని మాథుర్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో అన్నారు.

ప్రతి సారీ అల్లర్లు జరగగానే ప్రభుత్వం ముందే టార్గెట్ చేసిన వాళ్ళ అరెస్టులు జరుగుతాయి. వాళ్ళ ఇళ్ళు, ఆస్తులు ధ్వంస చేస్తారు. నిజంగా అల్లర్లు సృష్టించిందెవరు అనేది ఎప్పటికీ తేలదు. ఇదంతా అనుమానాస్పదంగా లేదూ?

ఇంత దుర్మార్గంగా సాగుతున్న బుల్డోజర్ రాజ్యం…అందులోనూ డబుల్ ఇంజన్ ఉన్న బుల్డోజర్ రాజ్యం తెలంగాణలో తేవాలని కోరుకుంటున్న బీజేపీ నాయకులకు మానవత్వం సరే, కనీసం చట్టం పట్ల, రాజ్యాంగం పట్లయినా గౌరవం ఉందా ?

First Published:  14 Jun 2022 2:01 AM GMT
Next Story