Telugu Global
NEWS

సవాల్ విసిరితే దత్తపుత్రుడు పారిపోయాడు

సీఎం జగన్ మరోసారి చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు. మోసం చేయడంలో బాబు, ఆయన దత్త పుత్రుడు ఇద్దరూ తోడుదొంగలంటూ మండిపడ్డారు. అసలు వారిద్దరూ రాజకీయాల్లో ఉండేందుకు అర్హులేనా అని ప్రశ్నించారు. పట్టాదారు పాసు పుస్తకం ఉన్న రైతు ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబానికి రూ.7 లక్షల పరిహారం ఇచ్చామని చెప్పారు. పరిహారం అందని ఒక్క కుటుంబాన్నయినా చూపాలంటూ దత్త పుత్రుడికి సవాల్ విసిరితే పారిపోయారని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకూ పరిహారం అందని […]

Jagan-challenge-pawan
X

సీఎం జగన్ మరోసారి చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు. మోసం చేయడంలో బాబు, ఆయన దత్త పుత్రుడు ఇద్దరూ తోడుదొంగలంటూ మండిపడ్డారు. అసలు వారిద్దరూ రాజకీయాల్లో ఉండేందుకు అర్హులేనా అని ప్రశ్నించారు. పట్టాదారు పాసు పుస్తకం ఉన్న రైతు ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబానికి రూ.7 లక్షల పరిహారం ఇచ్చామని చెప్పారు. పరిహారం అందని ఒక్క కుటుంబాన్నయినా చూపాలంటూ దత్త పుత్రుడికి సవాల్ విసిరితే పారిపోయారని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకూ పరిహారం అందని ఒక్క రైతు కుటుంబాన్ని కూడా చూపలేకపోయారని అన్నారు జగన్.

శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో రైతులకు పంటల బీమా పరిహారం నిధులను విడుదల చేసిన జగన్.. గతంలో ఎన్నడూ లేని విధంగా పరిహారం అందిస్తున్నట్టు చెప్పారు. 15.61 లక్షల మంది రైతులకు రూ.2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని వారి ఖాతాల్లో నేరుగా జమ చేశామన్నారు. రాష్ట్రంలో లంచాలు, వివక్ష లేకుండా అర్హులకు పారదర్శకంగా పథకాలు చేరుతున్నాయని అన్నారు జగన్. చంద్రబాబు ఐదేళ్లలో పంటల బీమా కింద 30.85 లక్షల మంది రైతులకు రూ.3,411 కోట్లు ఇస్తే తాము మూడేళ్లలోనే 44.28 లక్షల మంది రైతులకు రూ.6,685 కోట్లు ఇచ్చామని పేర్కొన్నారు. తాము మంచి పని చేస్తుంటే పచ్చమీడియా అంతా ఏకమై ఉన్నది లేనట్టుగా ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. గతంలో చంద్రబాబు హయాంలో బాధితులకు నష్టపరిహారం అందకపోతే పవన్ ఎక్కడున్నారని నిలదీశారు. చంద్రబాబుకు మంచి చేయడమే దత్తపుత్రుడి ఆలోచన అని విమర్శించారు.

క్రాప్ హాలిడే పేరుతో మరో రాద్ధాంతం..
కోనసీమలో క్రాప్‌ హాలిడే అని రైతులను రెచ్చగొడుతున్నారని చంద్రబాబు, పవన్ పై మండిపడ్డారు జగన్. చంద్రబాబు ఎగ్గొట్టిన ధాన్యం బకాయిలను జగన్‌ అనే నేను తీర్చినందుకు ఇలా చేస్తున్నారా అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి సకాలంలో నిధులు రాకపోయినా 21 రోజుల్లోనే రైతులకు ధాన్యం డబ్బులు ఇవ్వడంకోసం కిందా మీదా పడుతున్నామని చెప్పారు.

టెన్త్ పరీక్షల ఫలితాలపై కూడా రాజకీయాలా..?
ఏపీ టెన్త్ ఫలితాల్లో 67 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని, కొవిడ్ తర్వాత ఈ ఏడాది జరిగిన పరీక్షల్లో గుజరాత్ లో కేవలం 65 శాతం మంది మాత్రమే పదో తరగతి పాసయ్యారని, ఏపీ ఫలితాల్లో ఎక్కడా పిల్లలకు అన్యాయం జరగలేదని చెప్పారు జగన్. ప్రపంచంతో పోటీపడేటప్పుడు పిల్లల చదువుల్లో క్వాలిటీ ఉండాలని గుర్తు చేశారు. విద్యారంగంలో తీసుకు వస్తున్న మార్పులను తట్టుకోలేక దాన్ని కూడా రాజకీయంచేస్తున్నారని అన్నారు. రెండేళ్ల తర్వాత పరీక్షలు రాసిన పిల్లలకు ఆత్మస్థైర్యం కల్పించాలని, కానీ జూమ్ మీటింగ్ లతో వారిని రెచ్చగొట్టడానికి, చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు జగన్.

కోనసీమ అల్లర్లపై..
కోనసీమ జిల్లాకు అంబేద్కర్‌ అనే మహానుభావుడి పేరును పెడితే జీర్ణించుకోలేకపోతున్నారని, అలాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండేందుకు అర్హులేనా? అని ప్రశ్నించారు జగన్. తమ మంత్రివర్గంలో 70శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మంత్రులుగా ఉన్నారని, సామాజిక న్యాయానికి నిజమైన అర్థం చెప్తున్నామని చెప్పారు. ఉద్యోగుల విషయంలో కూడా వారికి నచ్చజెప్పి కలుపుకొనిపోతుంటే.. వారిని కూడా ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని అన్నారు జగన్. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో అన్నిటినీ ఎదుర్కొంటానని చెప్పారు.

First Published:  14 Jun 2022 5:50 AM GMT
Next Story