Telugu Global
National

రాష్ట్రపతి ఎన్నిక బరిలో విపక్ష అభ్యర్థిగా శరద్ పవార్..? కాంగ్రెస్ మద్దతు..?

రాష్ట్రపతి ఎన్నిక జరగడానికి ముందు అప్పుడే విపక్షాలు వరుసగా సమావేశాల్లో బిజీ అవుతున్నాయి. ఏకాభిప్రాయ సాధనకు కసరత్తు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఎన్సీపీ అధినేత, మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్ పేరు చక్కర్లు కొడుతోంది. జూలైలో జరగనున్న ఈ ఎన్నికకు ప్రతిపక్షాల అభ్యర్థిగా ఆయన ఖరారు కావచ్చునన్న ఊహాగానాలు తలెత్తాయి. ఇందుకు మొదట కాంగ్రెస్ పార్టీ ఆయనకు మద్దతు పలుకుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నుంచి ఓ సందేశంతో పార్టీ సీనియర్ నేత […]

రాష్ట్రపతి ఎన్నిక బరిలో విపక్ష అభ్యర్థిగా శరద్ పవార్..? కాంగ్రెస్ మద్దతు..?
X

రాష్ట్రపతి ఎన్నిక జరగడానికి ముందు అప్పుడే విపక్షాలు వరుసగా సమావేశాల్లో బిజీ అవుతున్నాయి. ఏకాభిప్రాయ సాధనకు కసరత్తు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఎన్సీపీ అధినేత, మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్ పేరు చక్కర్లు కొడుతోంది. జూలైలో జరగనున్న ఈ ఎన్నికకు ప్రతిపక్షాల అభ్యర్థిగా ఆయన ఖరారు కావచ్చునన్న ఊహాగానాలు తలెత్తాయి. ఇందుకు మొదట కాంగ్రెస్ పార్టీ ఆయనకు మద్దతు పలుకుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నుంచి ఓ సందేశంతో పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గే ఈ నెల 10న ముంబైకి వెళ్లి పవార్ తో భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య దాదాపు 2 గంటలపాటు చర్చలు జరిగినట్టు సమాచారం.

అయితే ఈ ప్రతిపాదనపై పవార్ తన అభిప్రాయాన్ని వెల్లడించకుండా మౌనం వహించినట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. (నిజానికి దేశ రాష్ట్రపతి కావాలన్న కోరిక‌ ఆయన మనసులో ఉందని గతంలోనే వార్తలు వచ్చాయి). ఖర్గే .. మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రేతోను, తమిళనాడు సీఎం స్టాలిన్‌తో పాటు బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో కూడా మాట్లాడారు. తాజాగా నిన్న ఆప్ నేత సంజయ్ సింగ్ కూడా ఆయనకు ఫోన్ చేసి ఈ ప్రతిపాదన గురించి చర్చించినట్టు తెలిసింది.

ఖర్గే రాయబారం ఇలా ఉండగా .. రాష్ట్రపతి ఎన్నిక, సంబంధిత అంశాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఈ నెల 15న ఢిల్లీలో బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలతో కీలక సమావేశాన్ని నిర్వహించనున్న సంగతి తెలిసిందే. 22 మంది ముఖ్యమంత్రులకు ఆమె ఈ మేరకు లేఖలు రాశారు. మరి రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలపాలా అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నిర్ణయించే అవకాశం ఉంది. అయితే శరద్ పవార్ ని ఉమ్మడి అభ్యర్థి చేయవచ్చని, ఇందుకు కాంగ్రెస్ మద్దతు ఉందని తాజాగా వచ్చిన వార్తల నేపథ్యంలో ఈ జూన్ 15 భేటీ ఎలా మలుపు తిరుగుతుందన్నది తెలియాల్సి ఉంది.

బీజేపీ ఏం చేయనుంది ?
రాష్ట్రపతి ఎన్నికలో ఏకాభిప్రాయ సాధనకు విపక్షాలతో సహా అన్ని ప్రధాన పార్టీలతో సంప్రదింపులు జరిపేందుకు బీజేపీ.. తమ పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లకు అధికారమిచ్చింది. ఉమ్మడి అభ్యర్థిని ఖరారు చేసేందుకు సోనియా గాంధీ, మమతా బెనర్జీ ప్రయత్నాలు మొదలు పెట్టారని వార్తలు రావడంతో .. బీజేపీ తమ వ్యూహంలో భాగంగా వీరిద్దరిని ఎంపిక చేసింది. త్వరలో వీరు విపక్షాలతో బాటు అన్ని పార్టీలతో చర్చలు జరపనున్నారు. మరి వీరి యత్నాలు ఎంతవరకు సఫలమవుతాయన్నది తేలాల్సి ఉంది.

2017లో రాష్ట్రపతి ఎన్నికప్పుడు చివరి క్షణంలో బీజేపీ తమను సంప్రదించిందన్న విషయాన్ని విపక్షాలు మరువలేదు. అప్పటికే రామ్ నాథ్ కోవింద్ ని ఆ పార్టీ ఖరారు చేసిందని అవి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ కు విపక్షాలు మద్దతునిచ్చినప్పటికీ ఆమె ఓడిపోయారు. అయితే లోక్ సభలో, తాజాగా రాజ్యసభలో కూడా బలం పెంచుకున్న బీజేపీ.. కొత్త రాష్ట్రపతి ఎన్నికలో సైతం తమ అభ్యర్థినే గెలిపించుకోవచ్చునని అంటున్నారు.

First Published:  13 Jun 2022 7:43 AM GMT
Next Story