Telugu Global
NEWS

వైఎస్‌ను పొగిడిన సురేఖ.. విజయవాడలో ‘కొండా’ ప్రమోషన్

కొండా సురేఖ.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌కు అత్యంత సన్నిహితురాలు. ఆయన మరణానంతరం మంత్రి పదవినే త్యాగం చేసిన సురేఖ.. ఆ తర్వాత ఎందుకో వైసీపీ అధినేత జగన్‌తో పొసగలేకపోయారు. పలు పార్టీలు మారి.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఆమె భర్త మురళి మాజీ నక్సలైట్. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. ఇదిలా ఉంటే కొండా దంపతుల జీవితం ఆధారంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘కొండా’ […]

వైఎస్‌ను పొగిడిన సురేఖ.. విజయవాడలో ‘కొండా’ ప్రమోషన్
X

కొండా సురేఖ.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌కు అత్యంత సన్నిహితురాలు. ఆయన మరణానంతరం మంత్రి పదవినే త్యాగం చేసిన సురేఖ.. ఆ తర్వాత ఎందుకో వైసీపీ అధినేత జగన్‌తో పొసగలేకపోయారు. పలు పార్టీలు మారి.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఆమె భర్త మురళి మాజీ నక్సలైట్. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. ఇదిలా ఉంటే కొండా దంపతుల జీవితం ఆధారంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘కొండా’ అనే సినిమాను తెరకెక్కించాడు. త్వరలో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్ జోరుగా సాగుతోంది.

ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా కొండా సురేఖ.. సోమవారం విజయవాడకు వచ్చి.. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘కొండా’ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు హాట్‌హాట్‌గా మారాయి.

‘మా రాజకీయ జీవితం వైఎస్ పెట్టిన భిక్ష. ఆయనకు మేమెంతో రుణపడి ఉంటాం. కానీ ప్రస్తుతం ఆ కుటుంబంతో మాకు పెద్దగా సంబంధాలు లేవు. రాజశేఖర్ రెడ్డి లాంటి నేత రాజకీయాల్లో చాలా అరుదు. మా జీవితం ఆధారంగా వచ్చిన కొండా చిత్రాన్ని అంతా ఆదరించండి. నక్సలిజం భావజాలానికి ఆకర్షితుడై మురళి దళంలో చేరారు. ఆరోజుల్లో ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించారు.

ప్రస్తుతం నక్సలిజం ఉండి ఉంటే బీజేపీ లాంటి పార్టీలు మనుగడ సాగించలేకపోయేవి’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. అయితే సీఎం జగన్ విషయం ప్రస్తావించకుండానే ఆయనతో తమకు ప్రస్తుతం సంబంధాలు లేవంటూ పరోక్ష సంకేతాలు ఇచ్చారు.

నిజానికి కొండా సురేఖ.. రాజశేఖర్ రెడ్డి మరణాంతరం జగన్ తో కొంత కాలం కలిసి ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జోరుగా నడుస్తున్న సమయంలోనూ ఆమె జగన్ కే మద్దతు ఇచ్చారు. ఇక మానుకోట ఘటన తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలక ఘటనగా నిలిచిపోయింది. అయితే ఆ తర్వాత ఆమె రాజకీయ భవితవ్యం, ఇతర కారణాలతో జగన్ పార్టీని వదిలేశారు. అయితే తమకు ప్రస్తుతం వైఎస్ కుటుంబంతో ఏ సంబంధాలు లేవు.. అని ఆమె చెప్పడం గమనార్హం.

First Published:  13 Jun 2022 7:11 AM GMT
Next Story