Telugu Global
NEWS

కేసీఆర్ చర్చల సారాంశం ఇదీ.. ఉండవల్లి ఏం చెప్పారంటే..?

తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ భేటీ పెద్ద చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ సీఎం, ఏపీకి చెందిన కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎందుకు భేటీ అయ్యారు. అసలు వీరిద్దరి మధ్య చర్చకు వచ్చిన అంశాలేంటి అనే విషయంలో చాలా ఊహాగానాలు వినిపించాయి. భారత్ రాష్ట్రీయ సమితి గురించి చర్చలు జరిగి ఉంటాయని, ఏపీకి ఉండవల్లిని ఇన్ చార్జిగా ప్రకటించే అవకాశముందని కూడా వార్తలు వినిపించాయి. అయితే కేసీఆర్ తో జరిగిన చర్చల్లో అసలు […]

former-mp-undavalli-arun-kumar-said-that-kcr-is-a-leader-with-courage
X

తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ భేటీ పెద్ద చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ సీఎం, ఏపీకి చెందిన కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎందుకు భేటీ అయ్యారు. అసలు వీరిద్దరి మధ్య చర్చకు వచ్చిన అంశాలేంటి అనే విషయంలో చాలా ఊహాగానాలు వినిపించాయి. భారత్ రాష్ట్రీయ సమితి గురించి చర్చలు జరిగి ఉంటాయని, ఏపీకి ఉండవల్లిని ఇన్ చార్జిగా ప్రకటించే అవకాశముందని కూడా వార్తలు వినిపించాయి. అయితే కేసీఆర్ తో జరిగిన చర్చల్లో అసలు జాతీయ‌ పార్టీ గురించిన ప్రస్తావన రాలేదని, ఆంధ్రాకు తాను ఇన్ ఛార్జి అనే విష‌యం కూడా చ‌ర్చకు రాలేదని క్లారిటీ ఇచ్చారు ఉండవల్లి. కేవలం బీజేపీ గురించి మాత్రమే తాము మాట్లాడుకున్నామని అన్నారు.

మోదీని ఎదుర్కునే దమ్ము కేసీఆర్ కి ఉంది..

ప్ర‌స్తుతం బీజేపీని ఢీకొనే సత్తా ఉన్న ముఖ్యమంత్రులు ఎవ‌రూ లేరని, కేసీఆర్, మ‌మ‌త మాత్ర‌మే బీజేపీకి వ్య‌తిరేకంగా పోరాడుతున్నారని చెప్పారు ఉండవల్లి. బీజేపీని ఎదుర్కొనే దమ్ము కేసీఆర్‌ కు మాత్రమే ఉందని చెప్పారు. తామిద్దరం గతంలో ఒకేసారి ఎంపీలుగా పనిచేశామని, అప్పట్లో మాట్లాడుకునేవాళ్లమని, కేసీఆర్ సీఎం అయ్యాక ఇప్పటి వరకు నేరుగా కలిసింది లేదని చెప్పారు. ఆయన ఆహ్వానం మన్నించి వెంటనే వెళ్లి కలిశానని, కేసీఆర్ తనకు చాలా గౌరవం ఇచ్చారని, మూడు గంటలసేపు తమ భేటీ జరిగిందని వివరించారు.

టార్గెట్ బీజేపీ..

ప్రతిపక్షం ఉండకూడదనే ఉద్దేశంతో బీజేపీ, ఇతర పార్టీల నాయకులపై కేసులు పెడుతోందని, ఏదో ఒక రకంగా నోరు మూయించే ప్ర‌య‌త్నం చేస్తోందనే విషయం తమ మధ్య ప్రస్తావనకు వచ్చిందని చెప్పారు ఉండవల్లి. ఈ విషయంలో కేసీఆర్ చాలా క్లారిటీతో ఉన్నారని.. సాగు, తాగునీరు, కరెంట్ వంటి విషయాలు, ఇతర సమస్యలపై ఆయన చాలా హోం వర్క్ చేశారని, ఆయన మాటలు వింటుంటే తాను ఆశ్చర్యపోయానని అన్నారు. బీజేపీకి చెక్ పెట్టకపోతే ఆ పార్టీకి ఉన్న 36 శాతం ఓటు బ్యాంకు పెరిగే ప్ర‌మాదం ఉందని, బీజేపీ వైఖ‌రిని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని, దానికోసం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు.

బీజేపీ విధానాలపై అంతర్జాతీయంగా కూడా విమర్శలు ఎదురవుతున్నాయని, ఇటీవల కాలంలో నాలుగైదు దేశాలు క్షమాపణలు కోరాయని, ముస్లింలు, క్రైస్త‌వుల‌కు భారత్ వ్య‌తిరేకం అని ముద్ర ప‌డితే చాలా న‌ష్ట‌పోతామని చెప్పారు ఉండవల్లి. దేశానికి అలాంటి నష్టం జరగకూడదంటే కేంద్రంలో బీజేపీ ఉండకూడదని అన్నారు.

ఏపీ పరిస్థితి ఏంటి..?

ఏపీలో బీజేపీ బలంగా ఉందని తన లాజిక్ చెప్పారు ఉండవల్లి. ఏపీలోని అధికార, ప్రతిపక్షాలేవీ బీజేపీని వ్యతిరేకించడంలేదని చెప్పారు ఉండవల్లి. వైసీపీ ఎప్పుడూ బీజేపీని విమర్శించలేదని, టీడీపీ.. బీజేపీతో స్నేహం కోరుకుంటోందని, ఆల్రడీ జనసేన బీజేపీతో పొత్తులో ఉందని అన్నారు. అంటే ఏపీలో ఏ పార్టీకీ బీజేపీపై వ్యతిరేకత లేనట్టేనని అన్నారు. త్వరలో మరోసారి కేసీఆర్ తో భేటీ అవుతానని, తమ చర్చల్లో ప్రశాంత్ కిషోర్ కూడా ఉన్నారని చెప్పారు ఉండవల్లి. మొత్తమ్మీద కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రాణిస్తారని, ఆ తెగువ, ధైర్యం ఆయనకి ఉన్నాయని, ముఖ్యంగా బీజేపీకి ప్రత్యామ్నాయంగా కేసీఆర్ ఎదగబోతున్నారని చెప్పారు ఉండవల్లి.

First Published:  13 Jun 2022 10:17 AM GMT
Next Story