Telugu Global
National

బెంగాల్ యూనివర్సిటీల ఛాన్సలర్ పదవి.. సీఎం మమతపై మేధావుల ఫైర్

బెంగాల్ యూనివర్సిటీల ఛాన్సలర్ గా సీఎం మమతా బెనర్జీ నియామకంపై మేధావులు, విద్యావేత్తలు భగ్గుమన్నారు. వడ్డించేవాడు మనవాడైతే అన్నట్టు తానే వడ్డించుకుని తానే పదవీభోగం అనుభవించడమేమిటని వీరు ప్రశ్నిస్తున్నారు. ఇదెక్కడి విడ్డూరం ? ఓ వైపు ముఖ్యమంత్రిగా ఉంటూ మరో వైపు మీరే ఈ పదవిని అలంకరించడం సబబు కాదన్నది వారి వాదన.. ఈ చర్య విశ్వవిద్యాలయ స్వయంప్రతిపత్తిని దెబ్బ తీస్తుందని, ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడిచినట్టేనని వాళ్ళు ఫైరవుతున్నారు. నిజానికి ఈ పదవిలో ప్రముఖ విద్యావేత్తనెవరినైనా […]

mamatha-chancellor-universities11
X

బెంగాల్ యూనివర్సిటీల ఛాన్సలర్ గా సీఎం మమతా బెనర్జీ నియామకంపై మేధావులు, విద్యావేత్తలు భగ్గుమన్నారు. వడ్డించేవాడు మనవాడైతే అన్నట్టు తానే వడ్డించుకుని తానే పదవీభోగం అనుభవించడమేమిటని వీరు ప్రశ్నిస్తున్నారు. ఇదెక్కడి విడ్డూరం ? ఓ వైపు ముఖ్యమంత్రిగా ఉంటూ మరో వైపు మీరే ఈ పదవిని అలంకరించడం సబబు కాదన్నది వారి వాదన.. ఈ చర్య విశ్వవిద్యాలయ స్వయంప్రతిపత్తిని దెబ్బ తీస్తుందని, ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడిచినట్టేనని వాళ్ళు ఫైరవుతున్నారు. నిజానికి ఈ పదవిలో ప్రముఖ విద్యావేత్తనెవరినైనా నియమించాలన్నది వీరి చిరకాల డిమాండ్. కానీ మమత కేబినెట్ ఈ డిమాండును పట్టించుకోలేదని దాదాపు 40 మంది మేధావులు, విద్యావేత్తలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యమంత్రిని రాష్ట్ర యూనివర్సిటీల ఛాన్సలర్ గా నియమించాలని ఇటీవల కేబినెట్ తీసుకున్న నిర్ణయం పట్ల తాము దిగ్భ్రాంతి చెందామని, విద్యాసంస్థల ప్రతిపత్తి గురించి తమకు తెలుసునని, కానీ ఇలాంటి నిర్ణయం వీటి అటానమీని దెబ్బ తీస్తుందని వీరు నిన్న ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీనిపై సంతకం చేసినవారిలో యాక్టర్ కౌశిక్ సేన్, దర్శకులు అనిక్ దుక్తా, రాజా సేన్, ప్రముఖ పెయింటర్ సమీర్ ఎయిచ్, సామాజికవేత్త మిరాతున్ నహర్, హక్కుల సంఘం నేత సుజాతో భద్ర వంటివారున్నారు.

విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ పోస్టులో విద్యావేత్తను నియమించిన పక్షంలో విద్యాసంస్థల నిర్వహణలో బయటివారి జోక్యాన్ని నివారించినట్టవుతుందని, అందువల్ల ఈ నిర్ణయంపై పునరాలోచించుకోవాలని వీరు కోరుతున్నారు. ‘ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రైమరీ, సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డుల్లో తన సొంతమనుషులను నియమించుకుంటోంది.. పైగా స్కూలు మేనేజింగ్ కమిటీలు, గవర్నింగ్ సంస్థలు, ఉన్నత విద్యా సంస్థల్లో కూడా ప్రభుత్వ పెద్దలు , అస్మదీయులే దర్శనమిస్తున్నారు ‘ అని మేధావులు దుయ్యబట్టారు.

రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని ప్రైవేటు యూనివర్సిటీల ‘విజిటర్’గా నియమించాలన్న నిర్ణయం కూడా దారుణమన్నది వీరి విమర్శ. ఈ చర్య సైతం యూనివర్సిటీలకు సీఎంని ఛాన్సలర్ చేస్తే కలిగే ప్రమాదం వంటిదానికే దారి తీస్తుందని వాపోయారు అంతా ! అసలు సీఎం ఛాన్సలర్ పదవి చేపట్టడమన్నది తాము కనీవినీ ఎరుగమని, కేబినెట్ నిర్ణయంతో తాము షాక్ తిన్నామని నటుడు కౌశిక్ వ్యాఖ్యానించారు. నిజానికి గవర్నర్ ని ఈ పదవిలో నియమించే సంప్రదాయాన్ని కూడా తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన చెప్పారు.

గవర్నర్ కి కూడా ‘పొంచి ఉన్న ముప్పు’

రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలకు విజిటర్ గా పాత్ర వహిస్తున్న గవర్నర్ ధన్ కర్ ను ఈ ‘పాత్ర’ నుంచి తప్పించేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే యత్నాలు జరుగుతున్నాయి. ఆయన స్థానే విద్యాశాఖ మంత్రి బ్రత్యా బసును ఈ పదవిలో నియమించేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది. అసలే మమతా బెనర్జీ ప్రభుత్వానికి, గవర్నర్ ధన్ కర్ కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులున్నాయి. అనేక సందర్భాల్లో గవర్నర్ తీసుకున్న నిర్ణయాలను మమత, ఈమె చేబట్టిన పనులను గవర్నర్ ఒకరికొకరు దుయ్యబట్టిన ఉదంతాలున్నాయి. ఇక.. విశ్వవిద్యాలయాలకు ముఖ్యమంత్రిని ఛాన్సలర్ గా నియమించాలన్న నిర్ణయాన్ని ఖండిస్తూ రేపు కోల్ కతాలోని కలకత్తా యూనివర్సిటీ వద్ద ‘సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ’ ఆధ్వర్యాన విద్యావేత్తలు నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు. ప్రభుత్వం దిగివచ్చేవరకు తమ ఆందోళన కొనసాగుతుందని ఈ కమిటీ కార్యదర్శి తరుణ్ నస్కర్ వెల్లడించారు.

First Published:  12 Jun 2022 4:05 AM GMT
Next Story