Telugu Global
NEWS

బీఆర్ఎస్ ని స్వాగతించిన వామపక్షాలు.. కాంగ్రెస్, బీజేపీ ఎత్తిపొడుపులు

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. భార‌త్ రాష్ట్రీయ స‌మితి (బీఆర్ఎస్) పేరుతో పార్టీ పెట్టడానికి కూడా ఆయన ఏర్పాట్లు చేస్తున్నారు. కేసీఆర్ సాహసాన్ని వామపక్షాలు స్వాగతించాయి. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. కేసీఆర్ ఆలోచనను స్వాగతిస్తున్నామని ప్రకటించారు. అయితే రాజకీయ లక్ష్యం విషయంలో కేసీఆర్‌ స్పష్టమైన వైఖరితో ఉండాలని సూచించారు. ఎన్డీఏ వ్యతిరేక కూటమి బలంగా నిలబడాలని ఆకాంక్షించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎత్తుగడ అదిరిపోవాలి.. రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ప్రతిపక్షాలన్నీ కలిస్తే ఎలా అనే […]

BRS
X

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. భార‌త్ రాష్ట్రీయ స‌మితి (బీఆర్ఎస్) పేరుతో పార్టీ పెట్టడానికి కూడా ఆయన ఏర్పాట్లు చేస్తున్నారు. కేసీఆర్ సాహసాన్ని వామపక్షాలు స్వాగతించాయి. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. కేసీఆర్ ఆలోచనను స్వాగతిస్తున్నామని ప్రకటించారు. అయితే రాజకీయ లక్ష్యం విషయంలో కేసీఆర్‌ స్పష్టమైన వైఖరితో ఉండాలని సూచించారు. ఎన్డీఏ వ్యతిరేక కూటమి బలంగా నిలబడాలని ఆకాంక్షించారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎత్తుగడ అదిరిపోవాలి..

రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ప్రతిపక్షాలన్నీ కలిస్తే ఎలా అనే ఆందోళనలో ఉంది బీజేపీ. కానీ ప్రతిపక్షాల మధ్య సయోధ్య లేదనే ధైర్యం కూడా వారిలో ఉంది. అయితే పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీజేపీ వైరి వర్గాలన్నిటినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ కూడా చొరవ తీసుకుని.. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నిటినీ ఒక్కతాటిపైకి తీసుకు రావాలన్నారు నారాయణ. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక కూటమిని బలపరిచే రాజకీయ ఎత్తుగడ వేయాలన్నారు.

కాంగ్రెస్ విసుర్లు..

కేసీఆర్ జాతీయ పార్టీకి సిద్ధమవుతున్న వేళ, తెలంగాణ కాంగ్రెస్ మాత్రం ఆయనపై విమర్శనాస్త్రాలు సంధించింది. తెలంగాణలో ఏం సాధించారని జాతీయ పార్టీ పెడుతున్నారని ప్రశ్నించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ కి ప్రజలు వీఆర్ఎస్ ఇస్తారనే భయంతోనే కేసీఆర్ బీఆర్ఎస్ పెడుతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ కి ఏమైంది, అదే పేరుతో పోటీ చేయొచ్చు కదా అని అన్నారు. జాతీయ రాజకీయాలపై అంత మక్కువ ఉంటే నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని సలహా ఇచ్చారు రేవంత్ రెడ్డి. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి పరోక్షంగా మేలు చేసేందుకే కేసీఆర్ కొత్త పార్టీని తెరపైకి తెచ్చారని విమర్శించారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలంగా ఉందని, భవిష్యత్తు కాంగ్రెస్ దే అని అన్నారు వెంకటరెడ్డి.

బీజేపీ రియాక్షన్ ఏంటంటే..?
కేసీఆర్ పగటి కలలు కంటున్నారని, అవి ఫామ్ హౌస్ లోనే కల్లలుగా మారిపోతాయని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆయన జాతీయ నాయకుడిగా ఎదగాలనుకోవడంలో తప్పులేదని, ఆయన భవిష్యత్తుని ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. జాతీయ రాజకీయాల్లో ఫ్రంట్ లకు, టెంట్ లకు అవకాశం లేదని అన్నారు బీజేపీ నాయకుడు లక్ష్మణ్. బంగారు తెలంగాణని తయారు చేసి, అప్పుడు బంగారు భారతం కోసం కలలు కనాలని సూచించారు.

First Published:  11 Jun 2022 9:02 PM GMT
Next Story