Telugu Global
NEWS

దర్బార్ ఆగదు, కొనసాగిస్తా.. విమర్శల మధ్యే తొలి విడత వినతుల స్వీకరణ

రాజ్ భవన్ లో రాజకీయాలా అంటూ.. వివిధ పార్టీల నేతలు విమర్శించినా కూడా తెలంగాణ గవర్నర్ తగ్గేదే లేదన్నారు. తొలి విడత మహిళా దర్బార్ ని నిర్వహించారు. మహిళల దగ్గర ఆమె వినతులు స్వీకరించారు, వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అయితే దాదాపుగా అన్నీ వ్యక్తిగత సమస్యలు, భూ వివాదాలు, ఆస్తి సమస్యలే ఆమె దృష్టికి వచ్చాయి. వాటిని అధికారుల వద్దకు పంపి పరిష్కరించాల్సిందిగా ఆదేశిస్తానన్నారు గవర్నర్. కేసీఆర్ కి మెసేజ్.. సీఎం కేసీఆర్ తో ముఖా […]

దర్బార్ ఆగదు, కొనసాగిస్తా.. విమర్శల మధ్యే తొలి విడత వినతుల స్వీకరణ
X

రాజ్ భవన్ లో రాజకీయాలా అంటూ.. వివిధ పార్టీల నేతలు విమర్శించినా కూడా తెలంగాణ గవర్నర్ తగ్గేదే లేదన్నారు. తొలి విడత మహిళా దర్బార్ ని నిర్వహించారు. మహిళల దగ్గర ఆమె వినతులు స్వీకరించారు, వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అయితే దాదాపుగా అన్నీ వ్యక్తిగత సమస్యలు, భూ వివాదాలు, ఆస్తి సమస్యలే ఆమె దృష్టికి వచ్చాయి. వాటిని అధికారుల వద్దకు పంపి పరిష్కరించాల్సిందిగా ఆదేశిస్తానన్నారు గవర్నర్.

కేసీఆర్ కి మెసేజ్..

సీఎం కేసీఆర్ తో ముఖా ముఖి కలసి ఏడాది దాటిపోయిందని, ఆయన తనను కలవకపోయినా తన సందేశం ఆయనకు చేరితే చాలన్నారు గవర్నర్ తమిళిసై. కేసీఆర్ కు సందేశం పంపించేందుకే మహిళా దర్బార్ నిర్వహించానన్నారు. తెలంగాణలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని, జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచార ఘటనపై నివేదిక కోరితే.. ఇంతవరకు అధికారులు స్పందించలేదని చెప్పారు. రాజ్ భవన్ నే గౌరవించడంలేదని, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చన్నారు తమిళి సై.

తెలంగాణ మహిళలు సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నానని, మహిళల బాధలను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు గవర్నర్ తమిళిసై. రాజ్‌ భవన్‌ కూడా ప్రభుత్వ కార్యాలయమేనని, ప్రజా దర్బార్ నిర్వహించడానికి అభ్యంతరమేంటని ప్రశ్నించారామె. తాను మహిళలు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలని భావిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తున్న తనను ఆపే శక్తి ఎవరికీ లేదని స్పష్టం చేశారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని పట్టించుకోనన్నారు.

ప్రభుత్వం తనకు సరైన గౌరవ మర్యాదలు ఇవ్వకపోయినా తన కార్యక్రమాలు ఆపడంలేదని చెప్పారు. ఇక యూనివర్శిటీల ఛాన్స్ లర్ గా, వైస్ ఛాన్స్ లర్లకు అధిపతిగా గవర్నర్ కు ఉన్న అధికారాల్లో కోత వేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ఆలోచనపై కూడా ఆమె స్పందించారు. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు.

మొత్తమ్మీద విమర్శల మధ్యే ప్రజా దర్బార్ నిర్వహించి తెలంగాణలో పొలిటికల్ హీట్ మరింత పెంచారు గవర్నర్ తమిళిసై. విమర్శలకు తగ్గేదే లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై అధికార పార్టీ స్పందించాల్సి ఉంది.

First Published:  10 Jun 2022 9:28 PM GMT
Next Story