Telugu Global
NEWS

వింబుల్డన్ కొ్ట్టు..కోట్ల నజరానా పట్టు! తొలిరౌండ్లోనే ఓడినా 50వేల పౌండ్లు

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ చరిత్రలోనే అత్యంత పురాతనమైన టెన్నిస్ టోర్నీగా పేరుపొందిన వింబుల్డన్ తన రికార్డులను తానే అధిగమించుకొంటూ పోతోంది. లండన్ లోని వింబుల్డన్ ఆల్ ఇంగ్లండ్ గ్రాస్ కోర్టుల్లో ప్రతి ఏడాది జూన్ ఆఖరివారంలో ప్రారంభమయ్యే ఈ టోర్నీలో విజేతలకు ఇచ్చే ప్రైజ్ మనీ ఏడాది ఏడాదికీ పెరిగిపోతూ వస్తోంది. 11.1 శాతానికి పెరిగిన ప్రైజ్ మనీ… వింబుల్డన్ పచ్చిక కోర్టుల్లో జరిగే ఈ టోర్నీలో పాల్గొనటానికి అర్హత సాధించగలిగితేనే తమ జన్మధన్యమైనట్లుగా ప్రపంచ వ్యాప్తంగా […]

వింబుల్డన్ కొ్ట్టు..కోట్ల నజరానా పట్టు! తొలిరౌండ్లోనే ఓడినా 50వేల పౌండ్లు
X

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ చరిత్రలోనే అత్యంత పురాతనమైన టెన్నిస్ టోర్నీగా పేరుపొందిన వింబుల్డన్ తన రికార్డులను తానే అధిగమించుకొంటూ పోతోంది.

లండన్ లోని వింబుల్డన్ ఆల్ ఇంగ్లండ్ గ్రాస్ కోర్టుల్లో ప్రతి ఏడాది జూన్ ఆఖరివారంలో ప్రారంభమయ్యే ఈ టోర్నీలో విజేతలకు ఇచ్చే ప్రైజ్ మనీ ఏడాది ఏడాదికీ పెరిగిపోతూ వస్తోంది.

11.1 శాతానికి పెరిగిన ప్రైజ్ మనీ…

వింబుల్డన్ పచ్చిక కోర్టుల్లో జరిగే ఈ టోర్నీలో పాల్గొనటానికి అర్హత సాధించగలిగితేనే తమ జన్మధన్యమైనట్లుగా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాదిమంది టెన్నిస్ క్రీడాకారులు భావిస్తు ఉంటారు.

క్వాలిఫైయింగ్ రౌండ్ల గండ గట్టెక్కి మెయిన్ డ్రాకు అర్హత సాధిస్తే చాలు…కనీసం 50వేల పౌండ్ల ప్రైజ్ మనీ సొంతం చేసుకొనే అవకాశం ఉంటుంది. తొలి రౌండ్లో ఓడినా 50 వేల పౌండ్లు, నెగ్గిన వారికి లక్ష పౌండ్లు ప్రైజ్ మనీగా అందచేస్తారు.

గత ఏడాది వింబుల్డన్ ప్రైజ్ మనీతో పోల్చిచూస్తే..ఈనెల 27న ప్రారంభమయ్యే 2022 వింబుల్డన్ టోర్నీ ప్రైజ్ మనీని 11.1 శాతానికి పెంచినట్లు నిర్వాహక సంఘం చైర్మన్ ఇయాన్ హెవిట్ ప్రకటించారు.

పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్సిడ్ డబుల్స్ విభాగాలలో తొలి రౌండ్ నుంచి విన్నర్లుగా నిలిచిన వారికి మొత్తం 40. 35 మిలియన్ పౌండ్లు పారితోషికాలుగా ఇవ్వనున్నారు. 125కు పైగా సంవత్సరాల చరిత్ర కలిగిన వింబుల్డన్ లో ఇంత భారీమొత్తంలో ప్రైజ్ మనీ ఇవ్వనుండడం ఇదే మొదటిసారని నిర్వాహక సంఘం చెబుతోంది.

సింగిల్స్ విజేతకు 16 కోట్ల రూపాయలు..

పురుషుల, మహిళల సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారులకు 20 లక్షల పౌండ్ల చొ్ప్పున ప్రైజ్ మనీగా అందచేయనున్నారు.ఇది మన రూపాయలలో ఇంచుమించుగా 16 కోట్ల రూపాయలకు సమానం.

2019 వింబుల్డన్ విజేతలకు ఇచ్చిన ప్రైజ్ మనీ కంటే ఇది 5.4 శాతం అదనం.
వివాదాల మయం….

గతంలో వివాదరహితంగా ఉండే వింబుల్డన్ గత ఏడాది నుంచి వివాదాలకు చిరునామాగా ఉంటూ వస్తోంది. సీడింగ్స్ ఇచ్చే సమయంలో క్రీడాకారుల ర్యాంకింగ్స్ ను పరిగణనలోకి తీసుకొనేది లేదని నిర్వాహక సంఘం ప్రకటించడం పెనువివాదమే సృష్టించింది. ఊరంతా ఒకదారైతే..ఉలిపికట్టది మరోదారి అన్నట్లుగా తయారయ్యిందంటూ నిర్వాహక సంఘం పై క్రీడాకారులు విరుచుకుపడుతున్నారు.

ఈ నిర్ణయానికి నిరసనగా నవోమీ ఒసాకాతో సహా పలువురు దిగ్గజ క్రీడాకారులు..తాము వింబుల్డన్ ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు..ఉక్రెయిన్ పై రష్యాదాడికి దిగడంతో..రష్యా, దాని మిత్రదేశమైన బైలోరష్యన్ క్రీడాకారులపై వింబుల్డన్ నిషేధం విధించడం కూడా చర్చనీయాంశమయ్యింది.

క్రీడలకు రాజకీయాలతో సంబంధం లేదని, రష్యా, బైలోరష్యన్ క్రీడాకారులను వింబుల్డన్ లో పాల్గొనకుండా నిషేధం విధించడం సబబుకాదంటూ ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు జోకోవిచ్, ఫ్రెంచ్ ఓపెన్ విన్నర్ నడాల్ తో సహా పలువురు దిగ్గజ క్రీడాకారులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

కరోనా దెబ్బతో ఓ ఏడాది పోటీలను నిర్వాహక సంఘం రద్దు చేయడంతో..ఈ నెల 27 నుంచి రెండువారాలపాటు సాగే 2022 వింబుల్డన్ పోటీలకు అభిమానులు తండోపతండాలుగా తరలిరానున్నట్లు నిర్వాహక సంఘం అంచనావేస్తోంది.

First Published:  9 Jun 2022 10:36 PM GMT
Next Story