Telugu Global
National

శవాన్ని ఇచ్చేందుకు 50వేలు లంచం.. తల్లిదండ్రుల భిక్షాటన..

మనిషి ప్రాణంతో ఉన్నప్పుడు ఫీజుల రూపంలో లక్షలకు లక్షలు వసూలు చేస్తుంటాయి ప్రైవేట్ ఆస్పత్రులు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రాణంపోయిన తర్వాత శవాన్ని అప్పగించడానికి బేరసారాలు మొదలవుతాయి. పోస్ట్ మార్టం చేసి శవాన్ని అప్పగించేందుకు లంచం అడిగిన సంఘటనలు ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కూడా వెలుగుచూశాయి. కానీ బీహార్ లో జరిగిన ఈ ఘటన మాత్రం నిజంగా చాలా దారుణం. కొడుకు శవాన్ని అప్పగించేందుకు మార్చురీ దగ్గర పనిచేసే ఓ ఉద్యోగి 50వేల రూపాయలు లంచం అడగడంతో.. తల్లిదండ్రులు […]

50-thousand-bribe-to-give-a-corpse-parental-begging
X

మనిషి ప్రాణంతో ఉన్నప్పుడు ఫీజుల రూపంలో లక్షలకు లక్షలు వసూలు చేస్తుంటాయి ప్రైవేట్ ఆస్పత్రులు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రాణంపోయిన తర్వాత శవాన్ని అప్పగించడానికి బేరసారాలు మొదలవుతాయి. పోస్ట్ మార్టం చేసి శవాన్ని అప్పగించేందుకు లంచం అడిగిన సంఘటనలు ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కూడా వెలుగుచూశాయి. కానీ బీహార్ లో జరిగిన ఈ ఘటన మాత్రం నిజంగా చాలా దారుణం. కొడుకు శవాన్ని అప్పగించేందుకు మార్చురీ దగ్గర పనిచేసే ఓ ఉద్యోగి 50వేల రూపాయలు లంచం అడగడంతో.. తల్లిదండ్రులు భిక్షాటన చేసి ఆ డబ్బు సమకూర్చుకోడానికి ప్రయత్నించారు. తల్లిదండ్రులు భిక్షాటన చేసే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఈ ఘటన సంచలనంగా మారింది.

బీహార్ లోని ముశ్రీఘరారి ప్రాంతంలో ఈనెల 6న మాన‌సిక విక‌లాంగుడైన ఓ బాలుడు అదృశ్య‌మ‌య్యాడు. ఆ తర్వాత శవమై తేలాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు డెడ్ బాడీని పోస్ట్ మార్టంకోసం తరలించారు. స‌మ‌స్తిపూర్ స‌దార్ హాస్పిట‌ల్‌ కు డెడ్ బాడీని పంపించారు. అయితే పోస్ట్ మార్టం తర్వాత ఆ పిల్లవాడి డెడ్ బాడీని అప్పగించడానికి మార్చురీ వద్ద ఓ ఉద్యోగి లంచం డిమాండ్ చేశాడు. వంద, వెయ్యి కాదు.. ఏకంగా 50వేల రూపాయలు డిమాండ్ చేయడంతో తల్లిదండ్రులకు దిక్కుతోచలేదు. దీంతో వారు భిక్షాటన మొదలు పెట్టారు. కారణం అడిగితే కొడుకు శవంకోసం అని చెప్పారు. వీరి భిక్షాటనను కొంతమంది ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సమస్తిపూర్ సదార్ ఆస్పత్రి అధికారులు వెంటనే స్పందించారు. తల్లిదండ్రుల్ని పిలిపించి ఆ బాలుడి డెడ్ బాడీని అప్పగించారు. అంతే కాదు, లంచం డిమాండ్ చేసిన ఘటనపై అంతర్గత విచారణ ప్రారంభించారు. ఓ కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. లంచం డిమాండ్ చేసిన ఉద్యోగిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

First Published:  9 Jun 2022 3:06 AM GMT
Next Story