Telugu Global
National

ఇంత అవమానమా ? బీజేపీ నేతల వ్యాఖ్యలపై 20 దేశాలు, సంస్థల నిరసన

స్వాతంత్య్ర భారత చరిత్రలో మన దేశానికి ఇంత అవమానం ఎన్నడు జరగకపోవచ్చు. అనేక దేశాలు మన దేశాన్ని బోనులో నిలబెట్టడం ఇదే మొదటి సారి కావచ్చు. భారతీయ జనతాపార్టీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ ఇస్లాం ప్రవక్తకు, ఇస్లాంకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ సమాజంలో మన పరువు తీశాయి. దాదాపు 20 దేశాలు, సంస్థలు మన దేశాన్ని నిలదీశాయి. కొన్ని దేశాలైతే మన రాయబారులను పిలిచి మరీ తమ నిరసనను వ్యక్తం చేయడమే కాక క్షమాపణ […]

ఇంత అవమానమా ? బీజేపీ నేతల వ్యాఖ్యలపై 20 దేశాలు, సంస్థల నిరసన
X

స్వాతంత్య్ర భారత చరిత్రలో మన దేశానికి ఇంత అవమానం ఎన్నడు జరగకపోవచ్చు. అనేక దేశాలు మన దేశాన్ని బోనులో నిలబెట్టడం ఇదే మొదటి సారి కావచ్చు. భారతీయ జనతాపార్టీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ ఇస్లాం ప్రవక్తకు, ఇస్లాంకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ సమాజంలో మన పరువు తీశాయి. దాదాపు 20 దేశాలు, సంస్థలు మన దేశాన్ని నిలదీశాయి. కొన్ని దేశాలైతే మన రాయబారులను పిలిచి మరీ తమ నిరసనను వ్యక్తం చేయడమే కాక క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. చివరకు అంతర్జాతీయ సమాజానికి భారత ప్రభుత్వం క్షమాపణలు చెప్పింది. బీజేపీ చేసిన పనికి దేశమే క్షమాపణ చెప్పాల్సి రావడం ఎంత అవమానం ? మరో వైపు బీజేపీ నుపుర్ శర్మను సస్పెండ్ చేసింది. కానీ అదే పార్టీ ఫాలోవర్స్ నుపుర్ శర్మ కు మద్దతుగా ట్విట్టర్ లో ట్వీట్లు చేశారు. ఆ ట్వీట్లను ట్ర్ండింగ్ చేయడానికి ప్రణాళికబద్దంగా పని చేశారు.

ఒకవైపు ప్రభుత్వం క్షమాపణలు, బీజేపీ సస్పెన్షన్లు, వాళ్ళ అభిమానుల వీరంగాల మధ్య అరబ్ దేశాలే కాక మరిన్ని దేశాలు తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నాయి. భారత్ ఉత్పత్తులను బహిష్కరించాలని అరబ్ దేశాల్లో సోషల్ మీడియాలో నెటిజనులు ఓ ఉద్యమమే చేపట్టగా భారత్ లో హిందుత్వ శక్తులు ‘బైకాట్ ఖతర్ ఏయిర్ వేస్’ అంటూ మరో ట్వీట్ ను వైరల్ చేశాయి. ఎన్నడూ ఫ్లైట్ మొహం చూడని వాళ్ళు ఖతర్ ఏయిర్ వేస్ ను బహిష్కరించాలంటూ పోస్ట్ చేసిన వీడియోలు, #BycottQatarAirways అనే తప్పు స్పెల్లింగ్ తో ట్వీట్లు అంతర్జాతీయ సమాజంలో ఎగతాళికి గురయ్యాయి.

ఈ నేపథ్యంలో ఏ ఏ దేశాలు, ఏ ఏ అంతర్జాతీయ సంస్థలు భారత్ ను నిలదీశాయి. క్షమాపణలు కోరాయి. ఎన్నడూ లేంది మనదేశంపై కన్నెర్రచేసిన దేశాలేవి వివరాలు ఒక్కసారి చూద్దాం…

1. ఖతార్

ఖతార్ తన దేశంలోని భారత రాయబారి దీపక్ మిట్టల్‌ను పిలిపించి, ప్రవక్త మహమ్మద్‌పై బిజెపి నేత చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.

2. కువైట్

కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం కువైట్‌లోని భారత రాయబారి సిబి జార్జ్‌ను పిలిపించి తమ నిరసన నోట్ ను అందించింది.

3. ఇరాన్

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో, ఇరాన్‌లోని భారత రాయబారి గడ్డం ధర్మేంద్రను జూన్ 5 సాయంత్రం దక్షిణాసియా డైరెక్టర్ జనరల్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు పిలిపించారు. నుపుర్ శర్మ వ్యాఖ్యలపై నిరసనను వ్యక్తం చేశారు. ఈ విషయంపై భారత రాయబారి విచారం వ్యక్తం చేశారు మరియు ఇస్లాం ప్రవక్తను అవమానించడం తమకు కూడా ఆమోదయోగ్యం కాదని ఆయన పేర్కొన్నారు.

4. సౌదీ అరేబియా

ఒక రోజు తర్వాత, జూన్ 6న, అతిపెద్ద గల్ఫ్ దేశం సౌదీ అరేబియా నుపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. భారత్ అన్నివిశ్వాసాలు, మతాలకు గౌరవం ఇవ్వాలని పిలుపునిచ్చింది.

ఇస్లామిక్ మతానికి వ్యతిరేకంగా పక్షపాతాన్ని శాశ్వతంగా విడనాడాలని భారత్ కు సూచించింది.

మక్కా అధికారులు

మక్కాలోని గ్రాండ్ మసీదు, మదీనాలోని ప్రవక్త మసీదు వ్యవహారాల జనరల్ ప్రెసిడెన్సీ,సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ నుండి విడి విడిగా ప్రకటనలు విడుదల చేశాయి. ప్రవక్తకు వ్యతిరేకంగా బిజెపి ప్రతినిధి చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను ఖండించాయి.

5. ఒమన్

ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖలోని అండర్ సెక్రటరీ షేక్ ఖలీఫా బిన్ అలీ అల్ హార్తీ, భారత రాయబారి అమిత్ నారంగ్‌ను పిలిపించి నుపుర్ శర్మ వ్యాఖ్యలు తీవ్ర అపరాధమని పేర్కొన్నారు.

6. బహ్రెయిన్

బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం నుపుర్ శర్మ వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రకటన విడుద‌ల చేసింది. శర్మను సస్పెండ్ చేయాలనే బిజెపి నిర్ణయాన్ని స్వాగతించింది, “ముస్లింల భావాలను కించపర్చడం, మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టడం, ప్రవక్త ను అవమానించడం ఖండించదగిన విషయమని నొక్కి చెప్పింది.

7. ఆఫ్ఘనిస్తాన్

తాలిబాన్ నేతృత్వంలోని తాత్కాలిక ఆఫ్ఘన్ ప్రభుత్వం కూడా నుపుర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిందని ఆఫ్ఘనిస్తాన్ యొక్క అతిపెద్ద స్వతంత్ర వార్తా సంస్థ పజ్వాక్ న్యూస్ తెలిపింది.

8. ఇండోనేషియా

నుపుర్ శర్మ‌ వ్యాఖ్యలపట్ల నిరసన ఒక్క గల్ఫ్ దేశాలకే పరిమితం చేయలేదు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన ముస్లిం దేశమైన ఇండోనేషియా, విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత రాయబారిని పిలిపించి, ఇద్దరు రాజకీయ నాయకులు ప్రవక్తపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను ” తీవ్రంగా ఖండించింది.

9. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్

ఈ దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, అంతర్జాతీయ సహకార మంత్రిత్వ శాఖ (MoFAIC) నుపుర్ శర్మ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. నైతిక, మానవ విలువలకు విరుద్ధమైన ఇటువంటి అన్ని పద్ధతులను,ప్రవర్తనలను తిరస్కరిస్తున్నట్లు ఆ దేశం పేర్కొంది.

10. జోర్డాన్

జోర్డాన్ కూడా ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది.

ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హైతం అబు అల్ఫౌల్ మాట్లాడుతూ, “ఇస్లామిక్, ఇతర మతాల పట్ల అభ్యంతరకరంగా మాట్లాడటాన్నిఈ దేశం తిరస్కరిస్తుంది, ఇది తీవ్రవాదాన్ని, ద్వేషాన్ని పెంచే చర్యగా పరిగణించబడుతుంది”. అని ప్రకటించారు.

11. మాల్దీవులు

దక్షిణాసియాలో భారతదేశానికి అత్యంత సన్నిహిత భాగస్వాములలో మాల్దీవులు ఒకటి. బిజెపి నేతల వ్యాఖ్యలను ఆ దేశం కూడా ఖండించింది, “అవమానకరమైన ఈ వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నాము” అని పేర్కొంది.

12. ఇరాక్

ఇరాక్ కూడా అక్కడి భారత రాయబారిని పిలిపించింది. ”ఇటువంటి హానికరమైన వ్యాఖ్యలు, అవమానకరమైన చర్యలు తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తాయి. ఇవి శాంతియుత సహజీవనానికి అడ్డంకి. ప్రజల మధ్య కలహాలను , ఉద్రిక్తతలను రెచ్చగొడతాయి” అని ఆ దేశం పేర్కొంది.

తమ ప్రభుత్వానికి నుపుర్ శర్మ వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేదని భారత రాయభారి ఇరాక్ కు తెలిపారు.

13. లిబియా

ఉత్తర ఆఫ్రికా దేశమైన లిబియా విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా బీజెపి అధికార ప్రతినిధి చేసిన అవమానకరమైన వ్యాఖ్యల పట్ల ఆందోళన వ్యక్తం చేసింది.

14. పాకిస్తాన్

ప్రవక్త మహమ్మద్‌పై ఇద్దరు బీజేపీ నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను తీవ్రంగా, ఖండిస్తున్నట్లు పాక్ పేర్కొంది.

ఈ వ్యాఖ్యలు “ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. పాకిస్తాన్ ప్రజల మనోభావాలను మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయి” అని విదేశాంగ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

ఈజిప్ట్

ఈజిప్ట్ లోని రెండు బలమైన ప్రధాన మత సంస్థలు నుపుర్ శర్మ వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రకటనలు జారీ చేశాయి.

15. అల్-అజార్ అల్-షరీఫ్

ఈజిప్ట్‌లోని అల్-అజార్ అల్-షరీఫ్, ప్రపంచంలోని పురాతన ముస్లిం సంస్థల్లో ఒకటి, ఆ సంస్థ బిజెపి నాయకుల మాటలను ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.

“ఇవి అజ్ఞానంతో చేసిన‌ వ్యాఖ్యలు. “ఉగ్రవాదానికి, ద్వేషానికి మద్దతుదారులు, విభిన్న విశ్వాసాలు, నాగరికతలు, సంస్కృతులకు శత్రువులు మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు” అని ఆ సంస్థ తన ప్రకటనలో పేర్కొంది.

16. ఈజిప్ట్ గ్రాండ్ ముఫ్తీ

ఈజిప్టు గ్రాండ్ ముఫ్తీ, ప్రపంచవ్యాప్త ఫత్వా అథారిటీస్ జనరల్ సెక్రటేరియట్ ఛైర్మన్ షావ్కీ ఆలం కూడా బిజెపి నాయకుల మాటలను ఖండించారు, ఇటువంటి వ్యాఖ్యలు “అవమానాలు, ద్వేష భావాలను పెంచుతాయి ” అని పేర్కొన్నారు.

17. టర్కీ

టర్కీ అధికార ఎకె పార్టీకి చెందిన ఓమర్ సెలిక్ కూడా బిజెపి నేతల వ్యాఖ్యలను ఖండించారు.

“భారత అధికార పార్టీ (బిజెపి)కి చెందిన ఒక ప్రతినిధి ప్రవక్తకు వ్యతిరేకంగా చేసిన అవమానకరమైన ప్రకటనలను మేము ఖండిస్తున్నాము. ఇది భారతదేశంలోని ముస్లింలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు కూడా అవమానకరం’ అని సెలిక్ ట్విట్టర్‌లో రాశారు.

18. మలేషియా

బీజేపీ నేతల వ్యాఖ్యలను ఖండించిన మలేషియా విదేశాంగ శాఖ, భారత హైకమిషనర్‌ను కూడా పిలిపించి తమ నిరసనను వ్యక్తం చేసింది.

19. ఇస్లామిక్ కోఆపరేషన్ సంస్థ

57 మంది సభ్యులతో కూడిన ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) ఈ వ్యాఖ్యలను ఖండించింది. భారతదేశంలో ముస్లింలపై ఒకపద్దతి ప్రకారం జరుగుతున్న‌ వేధింపులకు వ్యతిరేకంగా ఆందోళనల వెలిబుచ్చింది.
భారత్‌లో ముస్లింల హక్కులకు రక్షణ కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఓఐసీ ఐక్యరాజ్యసమితిని కోరింది.

20. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్

నుపుర్ శర్మ‌ వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రాంతీయ సంస్థ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది.

పవిత్ర ప్రవక్త మహమ్మద్ బిన్ అబ్దుల్లాపై భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలను గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) సెక్రటరీ జనరల్ హెచ్‌ఇ డాక్టర్ నయీఫ్ ఫలాహ్ ఎం. అల్ హజ్రాఫ్ ఖండిస్తూ రియాద్‌లో ఓ ప్రకటన జారీ చేశారు.

First Published:  8 Jun 2022 12:51 AM GMT
Next Story