Telugu Global
NEWS

దళిత బంధు లబ్దిదారుల ఎంపిక ఇక అధికారుల చేతుల్లో..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు స్కీంపై ఎమ్మెల్యేల పెత్తనం పోనున్నది. ఇప్పటి వరకు ఆయా నియోజకవర్గాల్లో లబ్దిదారులను ఎమ్మెల్యేలు ఎంపిక చేస్తూ వచ్చారు. కానీ, ఇకపై ఎంపిక అధికారాన్ని ఆఫీసర్లకు అప్పజెప్పడానికి ప్రభుత్వం రంగం సిద్దం చేస్తున్నది. ఈ మేరకు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు ప్రతిపాదనలను సర్కారుకు పంపించారు. ఒక వేళ ప్రభుత్వం కనుక అనుమతిస్తే, ఈ ఏడాది నుంచి గవర్నమెంట్ ఆఫీసర్లే లబ్దిదారులను ఎంపిక చేసే అవకాశం ఉన్నది. నిరుడు దళిత […]

దళిత బంధు లబ్దిదారుల ఎంపిక ఇక అధికారుల చేతుల్లో..
X

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు స్కీంపై ఎమ్మెల్యేల పెత్తనం పోనున్నది. ఇప్పటి వరకు ఆయా నియోజకవర్గాల్లో లబ్దిదారులను ఎమ్మెల్యేలు ఎంపిక చేస్తూ వచ్చారు. కానీ, ఇకపై ఎంపిక అధికారాన్ని ఆఫీసర్లకు అప్పజెప్పడానికి ప్రభుత్వం రంగం సిద్దం చేస్తున్నది. ఈ మేరకు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు ప్రతిపాదనలను సర్కారుకు పంపించారు. ఒక వేళ ప్రభుత్వం కనుక అనుమతిస్తే, ఈ ఏడాది నుంచి గవర్నమెంట్ ఆఫీసర్లే లబ్దిదారులను ఎంపిక చేసే అవకాశం ఉన్నది.

నిరుడు దళిత బంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు నాలుగు ఎస్సీ నియోజకవర్గాల్లోని ఒక్కో మండలం, యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రిలో ప్రారంభించారు. అక్కడ విజయవంతం కావడంతో మిగిలిన 118 నియోజకవర్గాల్లో 100 మందికి చొప్పున దళిత బంధు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఆ అధికారాన్ని ఎమ్మెల్యేలకు ఇచ్చారు. వారే లిస్టును తయారు చేసి, చివరిగా ఇంచార్జి మంత్రి అనుమతి తీసుకున్నారు. అక్కడే విమర్శలు ఎక్కువయ్యాయి.

దళిత బంధు ఎంపిక అధికారాన్ని ఎమ్మెల్యేలకు ఇవ్వడంతో తమకు ఇష్టమైన వాళ్లకు, అధికార పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులను లబ్దిదారులుగా ఎంపిక చేస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. కేసీఆర్ ఈ స్కీంను పేద ఎస్సీల ఆర్థికాభివృద్ది కోసం ప్రారంభించగా.. ఎమ్మెల్యేలు మాత్రం ఆ లక్ష్యానికి తూట్లు పొడుస్తూ వచ్చారు. లబ్దిదారుల లిస్టులో పేరుండాలంటే తమకు కమీషన్ ఇవ్వాలంటూ కొంత మంది ఎమ్మెల్యేల అనుచరులు వసూళ్లు మొదలు పెట్టారు. దీంతో ఈ పథకం లక్ష్యానికే తూట్లుపడుతున్నట్లు ప్రభుత్వం గ్రహించి, ప్రత్యామ్నాయ మార్గాలను సూచించాల్సిందిగా ఎస్సీ కార్పొరేషన్‌ను కోరింది.

దళిత బంధు లబ్దిదారులను అధికారుల ద్వారా గుర్తిస్తే ఎలాంటి అడ్డంకులు ఉండవని ఎస్సీ కార్పొరేషన్ తేల్చింది. ఈ మేరకు ఇప్పటికే కార్పొరేషన్ రూపొందించిన ప్రతిపాదనలను సర్కారు ఆమోదం కోసం పంపారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ప్రత్యేక గైడ్ లైన్స్ రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉన్నది.

ఈ ఏడాది నియోజకవర్గానికి 1500 మంది చొప్పున లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు. ఇందుకు బడ్జెట్‌లో రూ. 17,700 కోట్లు కేటాయించారు. దీనికి సంబంధించిన రిలీజ్ ఆర్డర్ కూడా వచ్చింది. అయితే ఎంపిక ఎవరి చేతుల్లో పెట్టాలనే డైలమా ఉండటంతో ఇప్పటి వరకు పథకాన్ని అమలు చేయలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నట్లు అధికారులు చెప్తున్నారు.

First Published:  7 Jun 2022 8:24 PM GMT
Next Story