Telugu Global
NEWS

గ్రేటర్ సీట్లే లక్ష్యం.. కార్పొరేటర్లతో మోడీ భేటీ అందుకేనా?

ప్రధానితో కార్పొరేటర్ల భేటీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అంత పెద్ద హోదాలో ఉన్న నరేంద్ర మోడీ స్వయంగా కార్పొరేటర్లను పిలిపించుకోవడం ఏంటని ఆశ్చర్యం కూడా కలుగుతుంది. జీహెచ్ఎంసీలో గెలిచిన 47 మంది బీజేపీ కార్పొరేటర్లతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ సహా ఇతర నాయకులు ప్రధానిని కలిశారు. అయితే, ప్రధాని వారితో ప్రత్యేకంగా భేటీ కావడానికి రాబోయే ఎన్నికలే లక్ష్యమని తెలుస్తున్నది. ఇటీవల […]

గ్రేటర్ సీట్లే లక్ష్యం.. కార్పొరేటర్లతో మోడీ భేటీ అందుకేనా?
X

ప్రధానితో కార్పొరేటర్ల భేటీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అంత పెద్ద హోదాలో ఉన్న నరేంద్ర మోడీ స్వయంగా కార్పొరేటర్లను పిలిపించుకోవడం ఏంటని ఆశ్చర్యం కూడా కలుగుతుంది. జీహెచ్ఎంసీలో గెలిచిన 47 మంది బీజేపీ కార్పొరేటర్లతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ సహా ఇతర నాయకులు ప్రధానిని కలిశారు. అయితే, ప్రధాని వారితో ప్రత్యేకంగా భేటీ కావడానికి రాబోయే ఎన్నికలే లక్ష్యమని తెలుస్తున్నది.

ఇటీవల ప్రధాని హైదరాబాద్ వచ్చిన సమయంలో కార్పొరేట్లర్లు ఆయనను కలవాల్సి ఉన్నది. అయితే ఆ సమయంలో వర్షం పడి వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఆ కార్యక్రమం రద్దయింది. దీంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ విషయంలో చొరవ తీసుకొని మోడీతో భేటీకి మార్గం సుగమమం చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని భావిస్తున్నది. గ్రేటర్ పరిధిలోని 24 అసెంబ్లీ సీట్లలో ఎన్ని ఎక్కువ గెలుచుకుంటే బీజేపీకి అంత అవకాశం ఉంటుంది. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో కంటే అర్బన్ ఏరియాల్లోనే బీజేపీకి గెలుపు సునాయాసం అవుతుందనే సర్వేల నేపథ్యంలో గ్రేటర్ సీట్లను బీజేపీ టార్గెట్‌గా పెట్టుకున్నది.

గ్రేటర్ ఎన్నికల్లో అనూహ్యంగా 47 మంది కార్పొరేటర్లు గెలిచారు. దీంతో మరింత కష్టపడితే ఎమ్మెల్యేలను కూడా గెలిపించుకోవచ్చని బీజేపీ భావిస్తున్నది. క్షేత్రస్థాయిలో ఉండేది కార్పొరేటర్లే కాబట్టి వారిని సమర్దవంతంగా వినియోగించుకోవాలని అనుకుంటున్నది. వారిని మోటివేట్ చేయడానికి ప్రధాని మోడీ అయితేనే సరైన వ్యక్తి అని భావించడంతోనే ఏకంగా ఢిల్లీకి పిలిపించి మాట్లాడినట్లు తెలుస్తున్నది. మోడీ ఈ భేటీని ఒక రాజకీయ వేదికలా కాకుండా ఒక ఫ్యామిలీ గెట్‌-టూ-గెదర్‌లాగా నిర్వహించినట్లు తెలుస్తున్నది.

ఆ సమావేశంలో ప్రతీ కార్పొరేటర్‌ను పేర్లతో పరిచయం చేసుకోవడమే కాకుండా కుటుంబం, పిల్లలు ఇతర విషయాలు కూడా అడిగి తెలుసుకోవడంతో కార్పొరేటర్లు ఉబ్బితబ్బిబయ్యారు. ఏకంగా ప్రధానే తమతో మాట్లాడటంతో కార్పొరేటర్లు కూడా నమ్మలేకపోయారు. బీజేపీ తమ క్షేత్రస్థాయి నాయకులను ఎలా మోటివేట్ చేస్తుందో ఈ సంఘటనే ఒక ఉదాహరణ. ఇంతలా కష్టపడటానికి గ్రేటర్‌లో సాధ్యమైనన్ని సీట్లు గెలుచుకోవడమే అని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. కార్పొరేటర్లు సహకరిస్తే ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం కష్టమేమీ కాదని బీజేపీ అంటోంది. కనీసం 15 సీట్లు గ్రేటర్ పరిధిలో గెలుచుకుంటే అధికారం సాధ్యమని చెప్తోంది. గ్రేటర్ తర్వాత మిగిలిన పట్టణాలపై ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నది.

అయితే, గ్రేటర్‌లో బీజేపీ పాచిక పారుతుందా అనేది అనుమానమే. గత ఎన్నికల్లో రాష్ట్రం మొత్తంలో కేవలం గోషామహల్ మాత్రమే బీజేపీ గెలుచుకున్నది. అప్పటితో పోలిస్తే ప్రస్తుత పరిస్థితులు మారినా.. నగర ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతారా అనేది అనుమానమే. కార్పొరేషన్ ఎన్నికలు పూర్తిగా స్థానిక సమస్యలే ఫోకస్‌గా ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సరికి కేసీఆర్‌ను చూసి ఓట్లేసే వాళ్లే ఎక్కువ. సీమాంధ్రులు కూడా బీజేపీకి సపోర్ట్ చేసే అవకాశం పెద్దగా లేదు. ఈ నేపథ్యంలో మోడీతో కార్పొరేటర్ల భేటీ ఎంత మేరకు సత్ఫలితాలను ఇస్తుందో చూడాలి.

ALSO READ: తెలంగాణ‌కు మాట‌లు.. గుజ‌రాత్‌కు మూట‌లా..?

First Published:  7 Jun 2022 9:19 PM GMT
Next Story