Telugu Global
National

కేరళ సీఎం విజయన్ కు చుట్టుకున్న ‘గోల్డ్ మసి’ ! రాజీనామాకై కాంగ్రెస్ డిమాండ్

కేరళ సీఎం పినరయి విజయన్ మళ్ళీ గోల్డ్ స్కామ్ లో ఇరుక్కున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్ ఇన్నాళ్లకు తిరిగి వార్తల్లోకి వచ్చింది. 2020 లో జరిగిన గోల్డ్ స్మగ్లింగ్ కేసుతో సాక్షాత్తూ సీఎం విజయన్, ఆయన భార్య కమల, కూతురు వీణలకు సంబంధం ఉందని, వీరేగాక అప్పటి మంత్రి కె.టి. జలీల్, ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి రవీంద్రన్ కూడా ఈ కుంభకోణంలో భాగస్వాములేనని ఆమె ఆరోపణలు పేల్చింది. పైగా తనకు ప్రాణహాని ఉందని […]

కేరళ సీఎం విజయన్ కు చుట్టుకున్న ‘గోల్డ్ మసి’ ! రాజీనామాకై కాంగ్రెస్ డిమాండ్
X

కేరళ సీఎం పినరయి విజయన్ మళ్ళీ గోల్డ్ స్కామ్ లో ఇరుక్కున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్ ఇన్నాళ్లకు తిరిగి వార్తల్లోకి వచ్చింది.

2020 లో జరిగిన గోల్డ్ స్మగ్లింగ్ కేసుతో సాక్షాత్తూ సీఎం విజయన్, ఆయన భార్య కమల, కూతురు వీణలకు సంబంధం ఉందని, వీరేగాక అప్పటి మంత్రి కె.టి. జలీల్, ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి రవీంద్రన్ కూడా ఈ కుంభకోణంలో భాగస్వాములేనని ఆమె ఆరోపణలు పేల్చింది. పైగా తనకు ప్రాణహాని ఉందని అందువల్లే అన్ని విషయాలూ కోర్టుకు వివరిస్తానని ఆమె పేర్కొంది.

ఈమె ఒక్కసారిగా ఈ ఆరోపణలు చేయడంతో కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితాల రంగంలోకి దిగారు. సీఎం విజయన్ పై వచ్చిన ఈ ఆరోపణలు తీవ్రమైనవని, ఆయన రాజీనామా చేయాలని చెన్నితాల డిమాండ్ చేశారు. ఈ కేసుపై సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు.

ఈ ఆరోపణలను రాజకీయ కుట్రగా సీఎం గానీ ఆయన మంత్రివర్గం గానీ కొట్టిపారేయజాలవన్నారు. ఈ కేసు విషయంలో బీజేపీ.. పాలక సీపీఎంతో కుట్రకు పాల్పడుతోందని, తమ పార్టీని బలహీనపరచజూస్తోందని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో దేశ వ్యతిరేక శక్తుల ప్రాబల్యం పెరుగుతోందని, సీఎం రాజీనామా చేయాల్సిందేనని రమేష్ చెన్నితాల అన్నారు.

కేంద్ర దర్యాప్తు సంస్థలపై తమకు నమ్మకం లేదని, బీజేపీని కూడా విశ్వసించజాలమని ఆయన పేర్కొన్నారు.

ఇలా ఉండగా ఈ కేసులో సీఎం ఆయన కుటుంబసభ్యుల ప్రమేయంపై తాను కోచ్చి లోని కోర్టుకు తెలియజేశానని సప్న సురేష్ ఓ మీడియా సంస్థకు వెల్లడించారు. కేరళలో 2020 లో జరిగిన సెన్సేషనల్ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కోచ్చి లోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దౌత్య కార్యాలయ మాజీ ఉద్యోగి అయిన ఈమెను జాతీయ భద్రతా సంస్థ అధికారులు అరెస్టు చేయడం, గత ఏడాది నవంబరులో ఈమె జైలు నుంచి విడుదల కావడం తెలిసిందే.

స్వప్న సురేష్ తో బాటు సందీప్ నాయర్ అనే మరో నిందితుడు కూడా నాడు పోలీసులకు పట్టుబడ్డాడు . తిరువనంతపురం విమానాశ్రయంలో 2020 జూలై 5న 15 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో తన ప్రమేయం లేదని సీఎం విజయన్ ఆనాడే స్పష్టం చేశారు. ఇది రాజకీయ దురుద్దేశంతో కూడినదని కేరళ ప్రభుత్వం చాలాసార్లు పేర్కొంది.

ఈ కేసుపై మళ్ళీ దర్యాప్తు జరగాలని, ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని అసెంబ్లీలో విపక్ష నేత వీ.డీ. శశీలన్ డిమాండ్ చేశారు. పైగా లోగడ సోలార్ స్కామ్ కేసుకు సంబంధించి నాడు ఊమెన్ చాందీ పై కూడా పలు కేసులు దాఖలయ్యాయని ఆయన గుర్తుచేశారు.

నాడు సీబీఐ విచారణ కూడా జరిగిందని ఆయన చెప్పారు. ఇక బీజేపీ నేత వి.మురళీధరన్ సైతం.. సీఎం గద్దె దిగాల్సిందేనని అంటున్నారు. ప్రజలను ఎదుర్కోవడానికి పాలక పార్టీ భయపడుతోందని, గోల్డ్ స్మగ్లింగ్ కేసులో తాజాగా దర్యాప్తు జరగాలని ఆయన అన్నారు. హఠాత్తుగా స్వప్న సురేష్.. సీఎం కుటుంబ సభ్యులపైనా ఆరోపించడం ప్రాధాన్యత సంతరిందుకుంది.

Next Story