Telugu Global
NEWS

టీడీపీలో ముఠా తగాదాలు.. టికెట్లు ఆశించే అభ్యర్థులకు బాబు వార్నింగ్

2019 ఎన్నికల్లో వైసీపీ చేతిలో చిత్తుగా ఓడిపోయిన టీడీపీ.. తిరిగి ఎన్నికలకు సన్నద్దం అవుతోంది. గత కొన్నాళ్లుగా నీరసించిపోయిన తెలుగు తమ్ముళ్లకు ఇటీవల జరిగిన మహానాడు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. చంద్రబాబు ఆ పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం తెచ్చే ప్రయత్నం చేశారు. ఇక ఎవరి నియోజకవర్గాలకు వాళ్లు పోయి.. జనంతో మమేకం కావాలని సూచించారు. కానీ, తెలుగు తమ్ముళ్ల తీరులో ఎలాంటి మార్పు కనపడటం లేదు. పార్టీలోని ముఠా తగాదాలు ఇప్పుడు బాబుకు కొత్త తలనొప్పులు […]

gang-fights-in-tdp-warning-to-candidates-expecting-tickets
X

2019 ఎన్నికల్లో వైసీపీ చేతిలో చిత్తుగా ఓడిపోయిన టీడీపీ.. తిరిగి ఎన్నికలకు సన్నద్దం అవుతోంది. గత కొన్నాళ్లుగా నీరసించిపోయిన తెలుగు తమ్ముళ్లకు ఇటీవల జరిగిన మహానాడు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. చంద్రబాబు ఆ పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం తెచ్చే ప్రయత్నం చేశారు. ఇక ఎవరి నియోజకవర్గాలకు వాళ్లు పోయి.. జనంతో మమేకం కావాలని సూచించారు. కానీ, తెలుగు తమ్ముళ్ల తీరులో ఎలాంటి మార్పు కనపడటం లేదు. పార్టీలోని ముఠా తగాదాలు ఇప్పుడు బాబుకు కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి.

రాష్ట్రంలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో తెలుగు దేశం పార్టీలో ముఠాలు ఏర్పడ్డాయి. అసలే అధికారంలో లేకపోవడంతో ఓడిపోయిన ఎమ్మెల్యేలకు పోటీగా కొత్త అభ్యర్థులు తయారయ్యారు. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలనే ఆరాటంలో.. ముఠాలు కట్టి రాజకీయాలు చేస్తున్నారు. 2024లో అధికారం చేజిక్కించుకోవాలని బాబు విశ్వప్రయత్నాలు చేస్తుంటే.. తమ్ముళ్ల కుమ్ములాటలు పెద్ద అవరోధంగా మారాయి. చంద్రబాబు నిర్వహిస్తున్న పార్టీ సమీక్షల్లో ప్రధానంగా గ్రూపు తగాదాలపైనే ఫోకస్ పెట్టారు. ఇలా ముఠాలు కడితే సహించేది లేదని.. అందరూ ఒక్కతాటిపైకి వచ్చి పార్టీ కోసం పని చేయాల్సిందేనని హెచ్చరించారు.

రాబోయే ఎన్నికల్లో టికెట్లు దక్కాలంటే ఈ గ్రూపు తగాదాలు వీడి ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని తిరిగి పటిష్టం చేయాలని.. ఇప్పటికే నేతలందరికీ సంబంధించిన రిపోర్టులు తెప్పించుకుంటున్నట్లు చెప్పారు. పని చేయని నేతలకు ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్లు ఇచ్చేది లేదని ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఉత్తరాంధ్ర నియోజకవర్గాల వారీగా ఆయన సమీక్ష నిర్వహించి.. వాళ్లే లక్ష్యంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ల కోఆర్డినేటర్లతో జరిపిన సమీక్షలో నేతలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నెల రోజుల్లో నాయకుల పని తీరులో సమూల మార్పు రావల్సిందేనని స్పష్టం చేశారు. గ్రూపు రాజకీయాలతో పార్టీకి నష్టం చేసే నాయకులపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. ప్రతీ నియోజకవర్గ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. పార్లమెంట్ కోఆర్డినేటర్లు రాబోయే 15 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలని చెప్పారు.

కాగా, టీడీపీలో గ్రూపు తగాదాలను బాబు కట్టడి చేయడానికి గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. అయితే ఆయన ఇంకా గ్రహించని విషయం ఏంటంటే.. రాబోయే ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకుంటే ప్రతీ నియోజకవర్గంలో మరో గ్రూప్ తయారవుతుంది. ఇప్పటికే టీడీపీలో ఉన్న ముఠా తగాదాలకు తోడు జనసేన గ్రూప్ కూడా రెడీ అవుతుంది. టికెట్ల విషయంలో సొంత పార్టీతోనే కాకుండా జనసేనతో కూడా తలనొప్పులు మొదలయ్యే అవకాశం ఉంది.

అధికారంలో ఉన్నప్పుడు బాబు మాట పార్టీలో అందరూ వింటారు. కానీ ప్రస్తుతం అధికారం లేక.. పార్టీ అత్యంత బలహీనంగా ఉన్న సమయంలో కార్యకర్తలు బాబు మాట పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఈ సమయంలో బాబు చెప్పే హిత బోధలు పార్టీలో ఎంత మంది పట్టించుకుంటారనే అనుమానం నెలకొన్నది. జనసేనతో పొత్తు కుదిరితే అది లాభమా నష్టమా అనేది పక్కన పెడితే.. టీడీపీ-జనసేన కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కలిసి పని చేస్తారా అనే అనుమానం బాబులో ఉంది. అందుకే ముందుగా తన పార్టీలో ఉన్న తగాదాలను తీర్చే పనిలో చంద్రబాబు పడ్డారు.

Also Read : స‌ర్వే చేయ‌మంటే.. క‌లెక్ష‌న్ మొద‌లెట్టారు

First Published:  8 Jun 2022 12:12 AM GMT
Next Story