Telugu Global
National

రాష్ట్రపతిగా గిరిజన మహిళ..?

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం జూలై 25తో ముగియనుంది. దీంతో కొత్త రాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ సారి రాష్ట్రపతి ఎన్నిక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి సవాలుగా మారబోతున్నాయి. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాలను ఎన్డీయే కూటమి చేజిక్కించుకుంది. అయితే అదే సమయంలో యూపీ, ఉత్తరాఖండ్‌లలో సీట్లు తగ్గిపోవడం ఎన్టీయేకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రపతిని ఎన్నుకునే మొత్తం ఎలక్టోరల్ కాలేజీ విలువ 10,93,347. ఇందులో […]

రాష్ట్రపతిగా గిరిజన మహిళ..?
X

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం జూలై 25తో ముగియనుంది. దీంతో కొత్త రాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ సారి రాష్ట్రపతి ఎన్నిక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి సవాలుగా మారబోతున్నాయి. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాలను ఎన్డీయే కూటమి చేజిక్కించుకుంది. అయితే అదే సమయంలో యూపీ, ఉత్తరాఖండ్‌లలో సీట్లు తగ్గిపోవడం ఎన్టీయేకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రపతిని ఎన్నుకునే మొత్తం ఎలక్టోరల్ కాలేజీ విలువ 10,93,347. ఇందులో ఎన్టీయేకు 48.8 శాతం విలువైన ఓట్లు ఉన్నాయి. ఒకవేళ ప్రతిపక్షాలు కనుక ఉమ్మడి అభ్యర్థిని నిలిపితే ఎన్టీయే అభ్యర్థికి అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రతిపక్షాలు కూడా ఒప్పుకునే అభ్యర్థిని బరిలోకి దింపాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.

2017లో రాష్ట్రపతి ఎన్నిక జరిగిన సమయంలో సామాజిక సమీకరణలు అన్నీ బేరీజు వేసుకొని దళితులకు దగ్గరయ్యేలా రామ్‌నాథ్ కోవింద్‌ను నిలబెట్టి, గెలిపించుకున్నది. ఈసారి కూడా ఇలాంటి సమీకరణాలు తమకు కలిసి వస్తాయని బీజేపీ భావిస్తుంది. మహిళకు లేదా గిరిజనులకు ఛాన్స్ ఇచ్చే విషయంపై సమాలోచనలు జరుపుతోంది. ఏకంగా గిరిజన మహిళలకు ఛాన్స్ ఇస్తే ప్రతిపక్షాలు కూడా నోరు మెదపని పరిస్థితి ఉంటుందని భావిస్తుంది. గిరిజన మహిళా అభ్యర్థి అయితే ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్ము (ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్‌) ఉన్నారు. ఆమెతో పాటు ఛ‌త్తీస్‌గడ్ గవర్నర్ అనసూయ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారు. ఆమెను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది.

గిరిజన వ్యక్తికి ఇవ్వాలనుకుంటే కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, జ్యూయల్ ఓరంలలో ఎవరికో ఒకరికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉన్నది. అయితే వీరందరిలో ద్రౌపదికే రాష్ట్రపతి అభ్యర్థిత్వం వరించే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. రామ్‌నాథ్ కోవింద్ ఎన్నిక సమయంలో కూడా ద్రౌపది పేరు బలంగా వినిపించింది. కానీ, దళితులకు ఇవ్వాలనే సమీకరణల్లో ఆమెను పక్కన పెట్టి.. జార్ఖండ్ గవర్నర్‌గా పంపారు. ఇప్పుడు కనుక గిరిజన కార్డు ముందుకు వస్తే ద్రౌపదికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. తొలి గిరిజన రాష్ట్రపతిని చేసిన క్రెడిట్ కూడా తమ ఖాతాలో వేసుకోవచ్చని బీజేపీ అనుకుంటుంది. ఇటీవల గిరిజన బెల్టులో బీజేపీ అధికారం కోల్పోయింది. ఈ దెబ్బతో వారిని మచ్చిక చేసుకునే అవకాశం లభిస్తుందని భావిస్తోంది.

దేశంలో ప్రస్తుతం బీజేపీపై ముస్లిం వ్యతిరేక పార్టీ అని బలంగా ముద్రపడింది. ఇటీవల నుపుర్ శర్మ ఉదంతం తర్వాత ఇతర దేశాలు కూడా ఇండియాలోని మోడీ ప్రభుత్వం ముస్లింలను చులకనగా చూస్తోందనే భావన పెరిగింది. దీనికి చెక్ పెట్టాలంటే, ముస్లింను రాష్ట్రపతిని చేస్తే ఎలా ఉంటుందనే విషయంపై కూడా చర్చిస్తోంది. మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు ఉన్న తరుణంలో.. ముస్లిం అభ్యర్థిని రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిపితే మైనార్టీల్లో ఉన్న ఆగ్రహాన్ని కొంత మేరకైనా చల్లార్చుకోవచ్చని అనుకుంటుంది. గతంలో వాయిపేయి ప్రభుత్వం కూడా ఏపీజే అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా గెలిపించుకుంది. ఈ క్రమంలో ముస్లిం అభ్యర్ధిగా ముక్తార్ అబ్బాస్ నఖ్విని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

అబ్బాస్ నఖ్వీ ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన రాజ్యసభ పదవీ కాలం కూడా పూర్తయ్యింది. కానీ, ఆయనకు ఏ రాష్ట్రం నుంచి కూడా రాజ్యసభ సీటు కేటాయించలేదు. మరోవైపు ఆయన ఎంపీగా ఉంటేనే కానీ మంత్రి పదవిలో కొనసాగలేరు. రాంపూర్ లోక్‌సభ ఉప ఎన్నికలో అయినా ఆయనను నిలబెడతారనుకుంటే అక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు. దీంతో మైనార్టీ కోటాలో ముక్తార్‌కే రాష్ట్రపతి అవకాశం ఇస్తారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

దక్షిణాది నుంచి ఇప్పటి వరకు సర్వేపల్లి రాధాకృష్ణ, వీవీ గిరి, నీలం సంజీవరెడ్డి, వెంకట్రామన్ రాష్ట్రపతులుగా పని చేశారు. దక్షిణాదిలో బలం పెంచుకోవాలని బీజేపీ భావిస్తున్నది. ఈ క్రమంలో వెంకయ్య నాయుడు రాష్ట్రపతి అవుతారని కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. కానీ, వెంకయ్య అభ్యర్థిత్వానికి ఏపీలోని అధికార వైసీపీ ఒప్పుకునే అవకాశం లేదు. రాష్ట్రపతి ఎన్నికలో తమ అభ్యర్థి గెలవాలంటే ఎన్టీయే కూటమికి మరో రెండున్నర శాతం ఓట్లు తప్పనిసరిగా కావాలి.

వైసీపీ వద్ద 4 శాతం ఓట్లు ఉన్నందున, జగన్ మద్దతు పొందాలంటే వెంకయ్య నాయుడు కాకుండా వేరే అభ్యర్థిని నిలబెట్టక తప్పదు. బీజేపీ అభ్యర్థికి టీఆర్ఎస్, ఆప్, శివసేన మద్దతు పలికే అవకాశం లేని తరుణంలో.. వైసీపీ మాటను బీజేపీ వినాల్సిందే. కాబట్టి వైసీపీతో పాటు ఇతర పార్టీలను తమవైపు తిప్పుకోవాలంటే గిరిజన మహిళ లేదా మైనార్టీ అభ్యర్థి అయితేనే కరెక్ట్ అని అనుకుంటున్నది. మరి చివరకు బీజేపీ అధినాయకత్వం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో వేచి చూడాలి.

First Published:  7 Jun 2022 4:50 AM GMT
Next Story