Telugu Global
National

పాపం బీజేపీ మనసు ఎంత క్షోభకు గురై ఉంటుందో !

రెండునాల్కలే కాదు రెండు ముఖాలు చూపిస్తోంది బీజేపీ. సాఫ్ట్ మతోన్మాదం, హార్డ్ మతోన్మాదం అంటూ ఏమీ ఉండదు. ఎప్పటికి ఏది అవసరమైతే అది బైటపెట్టడం, ఏ ఎండకా గొడుగు పట్టడం రాజకీయనాయకులందరికీ మామూలే కానీ బీజేపీకి అది మరింత ఎక్కువగా వర్తిస్తుంది. ఈ మధ్య జరుగుతున్న నుపుర్ శర్మ వివాదం, ఆమె మాట్లాడిన మాటలు నిజంగా ఈ దేశానికి కొత్తవా ? ఎన్నడు ఎవరూ ఇలాంటి మాటలు మాట్లాడలేదా ? ఇప్పుడే ఎందుకింత వివాదాస్పదమవుతోంది. ఎందుకు ఆమెపై […]

పాపం బీజేపీ మనసు ఎంత క్షోభకు గురై ఉంటుందో !
X

రెండునాల్కలే కాదు రెండు ముఖాలు చూపిస్తోంది బీజేపీ. సాఫ్ట్ మతోన్మాదం, హార్డ్ మతోన్మాదం అంటూ ఏమీ ఉండదు. ఎప్పటికి ఏది అవసరమైతే అది బైటపెట్టడం, ఏ ఎండకా గొడుగు పట్టడం రాజకీయనాయకులందరికీ మామూలే కానీ బీజేపీకి అది మరింత ఎక్కువగా వర్తిస్తుంది.

ఈ మధ్య జరుగుతున్న నుపుర్ శర్మ వివాదం, ఆమె మాట్లాడిన మాటలు నిజంగా ఈ దేశానికి కొత్తవా ? ఎన్నడు ఎవరూ ఇలాంటి మాటలు మాట్లాడలేదా ? ఇప్పుడే ఎందుకింత వివాదాస్పదమవుతోంది. ఎందుకు ఆమెపై బీజేపీ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది ?

గతంలో బీజేపీ నాయకులు, ఎంపీలు, మంత్రులు అనేక మంది మస్లింల పట్ల, మహిళల పట్ల, దళితుల పట్ల మాట్లాడిన మాటలు, చేతలు నుపుర్ శర్మ మాటలకన్నా దారుణంగా లేవా ? ముస్లిం మహిళలను రేప్ చేయమని పిలుపునిచ్చిన నాయకులను బీజేపీ ఎందుకు వదిలేసినట్టు ? మసీదులన్నింటినీ తవ్వేస్తామన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిపై ఎందుకు చర్యలు తీసుకోనట్టు? నిజం చెప్పాలంటే బీజేపీ నిండా నుపుర్ శర్మలే ఉన్నారు. ఆమెకన్నా తాతలున్నారు. అయినా ఎన్నడు ఎవ్వరి మాటలను కనీసం ఖండించని, ఎవరిపైనా ఎలాంటి చర్యలు తీసుకోని బీజేపీ నుపుర్ శర్మ పైనే చర్యలు తీసుకోవడం కేటీఆర్ అన్నట్టు వివక్ష కాదా ?

ఏకంగా ప్రభుత్వాలే బుల్డోజర్లతో మైనార్టీల ఆస్తులు ధ్వంసం చేసినప్పుడు, అక్రమ కేసులు బనాయించి జైళ్ళలో తోసినప్పుడు లేని మత సామరస్యం ఇప్పుడెందుకు వచ్చింది ? నుపుర్ శర్మ మాటలపై దేశవ్యాప్తంగా ముస్లింలు నిరసనలు తెలిపినప్పుడు కనీసం స్పందించలేదు మోదీ సర్కార్. నిరసనకారులను కొన్ని చోట్ల అరెస్టులు చేసి జైళ్ళలోకి నెట్టింది. కాన్పూర్ లాంటి చోట్ల వాళ్ళను వేటాడుతోంది. ఇన్ని చేస్తున్న బీజేపీ సడెన్ గా ముఖానికి మత సామరస్య తొడుగు ఎందుకు తొడుక్కుంది ?
గోరక్షణ పేరుతో హత్యలు జరిగినప్పుడు, బీఫ్ మాంసం ఉన్నదని అఖ్లాక్ లను ఇంట్లోనుంచి బైటికి లాగి కొట్టి చంపినప్పుడు వినపడని మాతసామరస్యమనే మాట ఇవ్వాళ్ళ కొత్తగా వినపడుతుంటే వింతగా అనిపించడం లేదా ?

నిజానికి బీజేపీ అంతర్జాతీయ సమాజానికి చూపిస్తున్న‌ ముఖం వేరు. ఈ దేశానికి చూపిస్తున్న ముఖం వేరు. ఇప్పటికీ ఆ పార్టీ నేతలు బహిరంగంగా కొందరు, ప్రైవేటు సంభాషణల్లో కొందరు నుపుర్ శర్మ మాటలను సమర్ధిస్తున్నారు. అరబ్ దేశాలతో మనకున్న అవసరాల రీత్యా మోదీ ప్రభుత్వం ఈ విషయంపై తన మనసులో ఎన్నడూ లేని, ఇకపై ఉండని వైఖరి చూపించింది. కానీ నిజానికి తమ నరనరాన నిండిన భావాలనే తాము ఖండించాల్సి వచ్చినందుకు ఆ పార్టీ అగ్రనాయకత్వం ఎంత కుతకుతలాడుతుందో !

ఇలా ఆపార్టీ రెండు ముఖాలను చూపించాల్సి వస్తున్నందుకు ఆ పార్టీలోని కొందరు నాయకులకు నిజంగానే నిద్రపట్టకపోవచ్చు. తాలిబన్ల లాగా మనమెందుకు ఉండకూడదన్న సంశయం కూడా వాళ్ళకు కలిగి ఉండవచ్చు. బహిరంగంగానే గాంధీ హంతకులను సమర్ధించినప్పుడు లేని సమస్య, చంపుదాం, నరుకుదాం, రేప్ లు చేద్దాం అని పిలుపులు ఇచ్చినప్పుడు లేని సమస్య, నిజంగానే చంపినప్పుడు కూడా లేని సమస్య, మతాచారాల మీద నిర్బంధాలు విధించినప్పుడు రాని సమస్య ఇప్పుడు వచ్చినందుకు అరబ్ దేశాలమీద వాళ్ళు రగిలిపోతూ ఉండవచ్చు. ఈ దేశంలో ఉండాలంటే హిదువులై ఉండాలి అని చెప్పిన నోటి నుండే అన్ని మతాలను మేము గౌరవిస్తాం, మత సామరస్యం మా విధానం అనిచెప్పాల్సి రావడం వాళ్ళ మనసును ఎంత క్షోభకు గురి చేసి ఉంటుంది ?

ALSO READ: రేప్ బాధితురాలి వివరాలు వెల్లడించిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌పై కేసు

First Published:  7 Jun 2022 1:46 AM GMT
Next Story