Telugu Global
NEWS

బైరెడ్డికి షాకిచ్చిన వైసీపీ అధిష్టానం.. కారణం ఏంటి?

వైసీపీ యువ నాయకుడు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (శాప్) చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి పార్టీ అధిష్టానం షాకిచ్చింది. మూడేళ్ల పాలన ముగిసిన సందర్భంగా ‘గడప గడపకు మన ప్రభుత్వం’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలని పార్టీ అధిష్టానం బైరెడ్డికి చెప్పినట్లు తెలుస్తున్నది. అసలు యువ నాయకుడిని పక్కన పెట్టడానికి కారణాలేంటని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సుపరిచితమైన రాజకీయ కుటుంబానికి చెందిన బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, 2019 […]

బైరెడ్డికి షాకిచ్చిన వైసీపీ అధిష్టానం.. కారణం ఏంటి?
X

వైసీపీ యువ నాయకుడు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (శాప్) చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి పార్టీ అధిష్టానం షాకిచ్చింది. మూడేళ్ల పాలన ముగిసిన సందర్భంగా ‘గడప గడపకు మన ప్రభుత్వం’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలని పార్టీ అధిష్టానం బైరెడ్డికి చెప్పినట్లు తెలుస్తున్నది. అసలు యువ నాయకుడిని పక్కన పెట్టడానికి కారణాలేంటని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో సుపరిచితమైన రాజకీయ కుటుంబానికి చెందిన బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో జాయిన్ అయ్యారు. అయితే, అప్పటికే జిల్లాలోని అన్ని అసెంబ్లీ సీట్లకు అధినేత వైఎస్ జగన్ అభ్యర్థులను నిర్ణయించేశారు. దీంతో ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గమైన నందికొట్కూరు ఇంచార్జిగా నియమించింది. సిద్ధార్థ కూడా గత ఎన్నికల్లో చాలా ఉత్సాహంగా పనిచేశారు. వైసీపీ అభ్యర్థి తొగురు ఆర్థర్ విజయానికి తన వంతు పాత్రను నిర్వహించారు.

నందికొట్కూరు నియోజకవర్గంలో ఓసీలు.. ముఖ్యంగా రెడ్ల ఓట్లు ఆర్థర్‌కు పడేలా వ్యూహం రచించారు. యువకుడు కావడంతో తన మాటలతో ఉత్సాహం నింపి.. ఆర్థర్ గెలుపులో కీలకంగా వ్యవహరించారు. బైరెడ్డి ఆ తర్వాత యూట్యూబ్ ఇంటర్వ్యూలతో కూడా పాపులర్ అయ్యారు. అయితే, తాను ఎవరి గెలుపుకోసం అయితే క్రియాశీలకంగా వ్యవహరించాడో.. అదే ఆర్థర్‌తో విభేదాలు మొదలయ్యాయి. నందికొట్కూరులో ఇద్దరు నాయకుల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. చిన్న చిన్న విషయాలు కూడా వివాదాలుగా మారుతుండటంతో విషయం పలుమార్లు అధిష్టానం వద్దకు వెళ్లింది.

ఈ క్రమంలో అనేక సార్లు అధిష్టానం కూడా వారికి సర్ది చెప్పి పంపినా.. వారి వైరం షరా మామూలుగా తయారయ్యింది. మరోవైపు తనకు రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని బైరెడ్డి పట్టుబడుతున్నారు. సీఎం జగన్ తన సామాజిక వర్గానికి చెందిన యువ నేతకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి కీలకమైన నామినేటెడ్ పోస్టు కట్టబెట్టారు. సీనియర్లకు కూడా దక్కని పదవీయోగం యువకుడైన సిద్ధార్థకు దక్కింది. దీంతో ఆయన మరింత దూకుడుగా వ్యవహరించడం మొదలు పెట్టినట్లు తెలుస్తున్నది. దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో బైరెడ్డికి వ్యతిరేక వర్గం పెరిగిపోయింది.

సీనియర్లను సైడ్ చేసి బైరెడ్డి వ్యవహరించడం వారికి మింగుడు పడటం లేదు. దీంతో అతడిపై పలువురు ఫిర్యాదులు చేశారు. బైరెడ్డి దూకుడు తగ్గించకపోతే పార్టీకి నష్టం కలుగుతుందని హెచ్చరించారు. విషయం చాలా తీవ్రంగా మారుతుందని గ్రహించిన అధిష్టానం బైరెడ్డి విషయంలో సీనియర్ల మాట విన్నది. ఈ క్రమంలోనే ‘గడప గడపకు ప్రభుత్వం’ కార్యక్రమానికి దూరంగా ఉండాలని చెప్పినట్లు తెలుస్తున్నది. అయితే ఈ విషయంపై బైరెడ్డి ఇంకా స్పందించలేదు.

First Published:  6 Jun 2022 1:02 AM GMT
Next Story