Telugu Global
NEWS

చంద్రబాబు తగ్గుతారా? పవన్ తన మాట నెగ్గుతారా?

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు మా పవన్ అని అతడి ఫ్యాన్స్ గొప్పగా చెప్పుకుంటుంటారు. అదే సమయంలో 40 ఏళ్ల రాజకీయ జీవితం కలిగిన చంద్రబాబు.. ఏనాడూ ఎవరి వద్ద తగ్గరు అంటూ టీడీపీ నేతలు అంటుంటారు. కానీ శనివారం పవన్ కల్యాణ్ జ‌న‌సేన‌ విస్తృత స్థాయి సమావేశం అనంతరం ఇచ్చిన మూడు ఆప్షన్లు చూస్తుంటే.. సీన్ రివర్స్ అయినట్లే కనపడుతున్నది. మేం తగ్గేదే లేదు.. మీరే కాస్త తగ్గండి అని తొలిసారి […]

చంద్రబాబు తగ్గుతారా? పవన్ తన మాట నెగ్గుతారా?
X

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు మా పవన్ అని అతడి ఫ్యాన్స్ గొప్పగా చెప్పుకుంటుంటారు. అదే సమయంలో 40 ఏళ్ల రాజకీయ జీవితం కలిగిన చంద్రబాబు.. ఏనాడూ ఎవరి వద్ద తగ్గరు అంటూ టీడీపీ నేతలు అంటుంటారు. కానీ శనివారం పవన్ కల్యాణ్ జ‌న‌సేన‌ విస్తృత స్థాయి సమావేశం అనంతరం ఇచ్చిన మూడు ఆప్షన్లు చూస్తుంటే.. సీన్ రివర్స్ అయినట్లే కనపడుతున్నది. మేం తగ్గేదే లేదు.. మీరే కాస్త తగ్గండి అని తొలిసారి చంద్రబాబును డిమాండ్ చేసినంత పనిచేశారు. బైబిల్ వాక్యాలు కోట్ చేస్తూ పవన్ కల్యాణ్ ఇచ్చిన మూడు ఆప్షన్లు రాజకీయ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారాయి.

పవన్ ఇచ్చిన ఆప్షన్లను పక్కన పెడితే.. అసలు జనసేనాని అంతటి నిర్ణయం ఎలా తీసుకున్నారని పలువురు ఆశ్చర్యపడుతున్నారు. పవన్ కల్యాణ్ బలం పెరిగిందా? లేదా చంద్రబాబు బలహీనుడయ్యాడా? అంటే కచ్చితంగా బాబు చరిష్మాకు బీటలు పడ్డాయనే చెప్పవచ్చు. గత ఎన్నికల్లో కేవలం 23 సీట్లకే పరిమితం అయిన తర్వాత చంద్రబాబు చాలా కాలం హైదరాబాద్‌కే పరిమితం అయ్యారు. అసెంబ్లీ సమావేశాలకు తప్ప ఏనాడూ ఏపీలో కనపడలేదు. రాజధాని రైతుల ఉద్యమానికి మొదట్లో ప్రత్యక్షంగా మద్దతు తెలిపినా.. ఆ తర్వాత వారిని కలిసిన దాఖలాలు లేవు. అప్పుడప్పుడు ఏదైనా సంఘటన జరిగితే వారిని ఫోన్ల ద్వారా పరామర్శించడం తప్ప ప్రత్యక్షంగా కలవడం అనేదే లేదు.

అయితే దీని వల్ల పార్టీ కూడా బలహీన పడుతుందని గ్రహించిన చంద్రబాబు ఇటీవల మళ్లీ యాక్టీవ్ అయ్యారు. మహానాడులో మరోసారి ఒంగి ఒంగి దండాలు పెట్టి ప్రజలను గెలిపించమని వేడుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబులో మునుపటి దూకుడు, రాజకీయ చతురత తగ్గిపోయాయి. ఒకవైపు వయసు మీదపడుతుండటం.. మరోవైపు టీడీపీ రోజు రోజుకూ బలహీనపడుతుండటంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి.

ఇక పవన్ కల్యాణ్ మాత్రం సినిమాలు చేసే టైంలో తప్ప.. మిగిలిన రోజుల్లో ఏదో విధంగా ప్రజల్లో ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. ఏదో ఒక సమస్యను తీసుకొని నిత్యం వార్తల్లో ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. గతం కంటే కాస్త భిన్నంగా వ్యవహరిస్తూ తనకంటూ ఒక గుర్తింపు వచ్చేలా చూసుకుంటున్నారు. అందుకే పవన్‌లో ధీమా బాగా పెరిగినట్లు కనిపిస్తున్నది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా.. టీడీపీ, జనసేన ఒంటరిగా పోటీ చేసి గెలవలేవు అని పవన్‌కు బాగా అర్థం అయ్యింది. మరోవైపు బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావొచ్చేమో కానీ.. ఇక్కడ మాత్రం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కష్టమని పవన్‌కు కూడా తెలుసు. అందుకే రెండు పార్టీలను ముందు పెట్టి తానే ఆప్షన్లు ఇచ్చారు.

టీడీపీ-బీజేపీ-జనసేన కలిస్తేనే ఏపీలో వైసీపీని ఎదుర్కోగలమని పవన్‌కు తెలుసు. తాను ముందుగా ఆయా పార్టీల వద్దకు వెళ్లి పొత్తుల గురించి మాట్లాడితే ప్రజల్లో చులకన అవుతానని కూడా గ్రహించారు. అందుకే తానే ఆప్షన్లు ఇస్తున్నట్లు.. తన వద్దకే మిగిలిన పార్టీలు రావాలని అన్నట్లు ఉండేలా ఇలా వ్యవహరించారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఈ విషయంలో పవన్ సాహసం చేశారనే చెప్పుకుంటున్నారు. అయితే చంద్రబాబు తగ్గడం అనే ప్రసక్తే ఉండదని అంటున్నారు. జనసేనకు ఎక్కువ సీట్లు ఇచ్చి.. టీడీపీ తక్కువ సీట్లలో నిలబడే అవకాశం లేదు. పవన్ ఎట్టిపరిస్థితుల్లోనూ బీజేపీని వదులుకోలేరు. అదే సమయంలో బీజేపీతో టీడీపీ జట్టు కట్టే అవకాశం కూడా కనపడటం లేదు. అందుకు బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా ఒప్పుకుంటుందా అనేది డౌటనుమానమే.

రాష్ట్రంలో కమ్మ, కాపు, అగ్రవర్ణాలు వైసీపీకి దూరమయ్యారని పవన్ చెబుతున్నారు. అయితే ఆ వ్యతిరేక ఓటు చీలకుండా అందరం కలుద్దామని అంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీని కట్టడి చేయాలంటే ఒక్క పార్టీతో కుదరదని.. మూడు పార్టీలు ఏకమైతేనే ఓడించగలమని పవన్అంటున్నారు. ఇది టీడీపీ నేతలకు, కార్యకర్తలకు రుచించడం లేదు. ఎంతో అనుభవం ఉండి, సీఎంగా పని చేసిన చంద్రబాబుకే ఆప్షన్లు ఇచ్చే వాడు అయ్యాడా అని ప‌వ‌న్‌ను బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు కాస్త తగ్గుదామన్నా.. టీడీపీ కార్యక‌ర్త‌లు మాత్రం అందుకు ఒప్పుకునేందుకు సిద్దంగా లేరు. మొత్తానికి చంద్రబాబు తగ్గడం అనేది కాస్త అనుమానమే అని.. ఈ విషయంలో చివరకు పవన్ సర్దుకుపోవాల్సిందేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

First Published:  5 Jun 2022 11:15 PM GMT
Next Story