Telugu Global
NEWS

తెలంగాణలో ‘త్రిపుర’ ఫార్ములా ! – ఎలక్షన్ మేనేజ్ మెంట్ పై ‘కమలం’ కసరత్తు !!

తెలంగాణలో బీజేపీ ‘త్రిపుర వ్యూహం’ అనుసరించనున్నట్టు తెలుస్తోంది.విజయమే లక్ష్యంగా ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటరునూ కలిసేలా సంఘ్ పరివార్ నాయకులు ఆ రాష్ట్రంలో విస్తృతంగా జరిపిన ప్రచారం ఫలితాన్ని ఇచ్చినట్టు విశ్లేషణలున్నవి.బీజేపీకి రెండు శాతం ఓట్లు కూడా లేని త్రిపురలో ఆ పార్టీతోపాటు సంఘ్‌పరివార్‌ సంస్థల నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటరును కలిసి అభివృద్ధి అజెండాను వివరించారు.దాంతో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న వామపక్షాల్ని ఓడించి భాజపా అధికారంలోకి వచ్చిందని సంఘ్‌ పరివారం చెబుతోంది.త్రిపురలో 25 […]

తెలంగాణలో ‘త్రిపుర’ ఫార్ములా ! – ఎలక్షన్ మేనేజ్ మెంట్ పై ‘కమలం’ కసరత్తు !!
X

తెలంగాణలో బీజేపీ ‘త్రిపుర వ్యూహం’ అనుసరించనున్నట్టు తెలుస్తోంది.విజయమే లక్ష్యంగా ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటరునూ కలిసేలా సంఘ్ పరివార్ నాయకులు ఆ రాష్ట్రంలో విస్తృతంగా జరిపిన ప్రచారం ఫలితాన్ని ఇచ్చినట్టు విశ్లేషణలున్నవి.బీజేపీకి రెండు శాతం ఓట్లు కూడా లేని త్రిపురలో ఆ పార్టీతోపాటు సంఘ్‌పరివార్‌ సంస్థల నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటరును కలిసి అభివృద్ధి అజెండాను వివరించారు.దాంతో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న వామపక్షాల్ని ఓడించి భాజపా అధికారంలోకి వచ్చిందని సంఘ్‌ పరివారం చెబుతోంది.త్రిపురలో 25 ఏండ్లుగా తిరుగులేకుండా పాలిస్తున్న కమ్యూనిస్టుల కంచుకోటను 2018లో బీజేపీ బద్దలుకొట్టి సంచలనం సృష్టించింది.అంతకు ముందు ఎన్నికల్లో బీజేపీ 50 స్థానాల్లో పోటీ చేస్తే 49 స్థానాల్లో డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది.2018లో మాత్రం 60 సీట్లలో 34 సీట్లు గెలుచుకోవడమే కాకుండా 2013 ఎన్నికలతో పోలిస్తే 41.5 శాతం అధికంగా ఓట్లను సాధించుకుంది.అదే విధంగా టిఆర్ఎస్ కంచుకోటనూ బద్దలు కొట్టాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది.

‘త్రిపుర వ్యూహం’తో తెలంగాణలోనూ బీజేపీ అనూహ్య విజయాన్ని సాధించగలదని సంఘ్ పరివారం నమ్మకం.హైదరాబాద్‌లో ఆరెస్సెస్‌ సమావేశాలు తరచూ జరుగుతున్నవి.బీజేపీ విజయానికి సంఘ్‌ పరివార్‌ సంస్థలన్నింటి నుంచి తోడ్పాటు అందించాలని నాగపూర్ ఆర్ఎస్ఎస్ నాయకత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.

కాగా తెలంగాణలో పార్టీ బలోపేతంపై బీజేపీ ప్రధానంగా ఫోకస్ పెట్టింది. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరే వారి కోసం సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. జాయినింగ్స్ అండ్ కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్‌గా బీజేపీ సీనియర్ నాయకుడు నల్లు ఇంద్రసేనారెడ్డిని నియమించారు. ఈ కమిటీలో స్వామి గౌడ్,మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్, డీ.రవీంద్ర నాయక్, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచంద్రరావుతోపాటు మరో ఇద్దరు సభ్యులుగా ఉన్నారు.పార్టీలో చేరాలని నిర్ణయించుకునే వారు ముందుగా సమన్వయ కమిటీకి తెలియజేయాలి. పార్టీలో చేరే వారితో చర్చలు, వారి బలాబలాలు అంచనా వేయడం, పార్టీ నాయకత్వానికి ఈ కమిటీ తెలియజేస్తుంది. ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ వేశారు.

రాష్ట్రంలోని ఎస్.సీ,ఎస్.టీ.నియోజవర్గాలపై హైదరాబాద్‌లో బీజేపీ నాయకులు సమీక్ష సమావేశాలు నిర్వహించారు.ఎస్.టీ. నియోజకవర్గాల సమన్వయ కమిటీ ఛైర్మన్‌గా గరికపాటి మోహన్ రావు పని చేస్తున్నారు.చాడా సురేష్ రెడ్డి, కటకం మృత్యుంజయం, కూన శ్రీశైలం గౌడ్ సభ్యులుగా ఉన్నారు.ఎస్సీ నియోజకవర్గాలపై ఫోకస్ లో భాగంగా ‘మిషన్-19 ‘ను చేబట్టారు.పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో బలమైన నాయకుల కోసం బీజేపీ నాయకత్వం అన్వేషణ సాగుతోంది.వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలాబలాలను అంచనా వేసి బలమైన వ్యక్తులను ఎంపిక చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది.పార్టీ క్యాడర్‌తో సమన్వయం చేసుకుంటూ ముందుకుసాగాలని బండి సంజయ్ ఆదేశించారు. ఎన్నికలకు 18 నెలలకు పైగా వ్యవధి ఉన్నా ఇప్పటినుంచే పోలింగు బూత్ స్థాయిలో బలపడాలని బీజేపీ భావిస్తోంది.

పార్టీ ప్రచార కార్యక్రమాలపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను నియమించి ఒక రోడ్‌మ్యాప్‌ను, ఫార్మూలాను ఖరారు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, ప్రధాన రాజకీయ పార్టీల బలాబలాలు, ఆయా స్థానాల్లో బీజేపీ పరిస్థితి ఏమిటన్న దానిపై లోతైన అధ్యయనాన్ని బిజేపి నిర్వహిస్తోంది.రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ స్థానాల్లో ఎస్సీ,ఎస్టీ ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు దోహదపడే అంశాలను పరిశీలిస్తోంది.

ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలవారీగా విస్తృత కసరత్తు ద్వారా బలమైన అభ్యర్థులను ముందుగానే ఎంపిక చేయాలన్న ఆలోచనతో పార్టీ అగ్రనాయకత్వం ఉన్నది.ఆయా స్థానాలకు సంబంధించి పార్టీలో బలమైన అభ్యర్థులు లేని చోట్ల, ఆయా సీట్లలో గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయి,ఏ పార్టీ వాళ్లను చేర్చుకొని టికెట్టు ఇస్తే పక్కాగా విజయం సాధించవచ్చు వంటి అంశాలపై కసరత్తు జరుగుతోంది.

తెలంగాణలో బండి సంజయ్,కిషన్ రెడ్డి,ధర్మపురి అరవింద్,ఈటల రాజేందర్,జితేందర్ రెడ్డి,డీకే.అరుణ తదితర ముఖ్యులు పది మంది వరకు బలంగా కనిపిస్తున్నారు.చాలా నియోజకవర్గాల్లో పార్టీకి బలమైన నాయకులు లేకపోవడం పార్టీకి పెద్ద మైనస్.క్రమంగా పార్టీ ఇమేజ్ పెరుగుతున్నట్టు ప్రధానమంత్రి మోడీ,కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా మొదలుకొని తరుణ్ ఛుగ్ వంటి వారంతా తెలంగాణ బీజేపీ చూస్తోందని అంటున్నారు.

తెలంగాణలో 2014 తో పోల్చితే టీఆర్‌ఎస్‌కు 2018 లో ఓట్ల శాతం పెరిగింది.2014 లో 34 శాతం రాగా,2018 ఎన్నికల్లో 46.9 శాతం ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్‌కు 2014 ఎన్నికల్లో 25.2 శాతం ఓట్లు లభించాయి.2018 ఎన్నికల్లో 28.4 శాతం ఓట్లు పోలయ్యాయి. బీజేపీ ఓటుబ్యాంకు మారలేదు.ఏడు శాతం ఓట్లు పోలయ్యాయి.

బీజేపీ విజయాల్లో ‘పన్నా ప్రముఖ్‌ ‘లదే కీలక పాత్ర.బీజేపీ మినహా మిగతా ఏ పార్టీలోనూ ఇలాంటి వ్యవస్థ లేదు.పన్నా ప్రముఖ్‌లకు కేటాయించిన బాధ్యతల గురించి కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ పార్టీ ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ ”ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కొక్క ‘పన్నా ప్రముఖ్’ 60 మందితో ఓట్లు వేయించేలా పనిచేయాలి. అంటే 20 కుటుంబాలే.వాళ్లను కలిస్తే సరిపోతుంది” అని అన్నారు.ప్రతి ఎన్నికలకు కొన్ని నెలల ముందుగానే ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను ప్రచురిస్తుంది. దీనిని తరచుగా సవరిస్తుంటుంది కూడా. ఒక్కో పేజీలో ముందు, వెనుకా కలిపి 60 మంది ఓటర్ల పేర్లు, ఫొటోలు, ఇతర వివరాలు ఉంటాయి.ఒక్కో పేజీలో ఉన్న 60 మంది ఓటర్ల బాధ్యతలను భారతీయ జనతా పార్టీ ఒక్కొక్క కార్యకర్తకు అప్పగిస్తుంది.వీరినే సంస్థాగతంగా ‘పన్నా ప్రముఖ్’ అని పిలుస్తారు.తమకు అప్పగించిన ఓటర్లను నేరుగా కలవడం, వారికి ప్రభుత్వ పథకాలు అన్నీ అందుతున్నాయో లేదో చూడటం.అందకపోతే పార్టీ తరపున ఏం చేయాలో నిర్ణయించి, తగినవిధంగా సహాయం చేయడం వంటి పనులు పన్నా ప్రముఖ్ చేస్తుంటారు.ఓటర్లు బీజేపీకి అనుకూలంగా లేకపోతే పార్టీ గురించి, పార్టీ విధానాల గురించి, నాయకుల గురించి చెప్పి, పార్టీకి అనుకూలంగా వారిని మలచే ప్రయత్నం చేయడం పన్నా ప్రముఖ్ ల పని. ఓటర్ల సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను కూడా పన్నా ప్రముఖ్‌లు పరిశీలించి వారిని ఆకట్టుకోవడానికి ప్రచారం సాగిస్తారు.

పోలింగ్ వేళ తమకు సంబంధించిన ఓటర్లంతా ఓట్లు వేసేలా చూస్తారు. ఓటింగ్ ముగిసిన తర్వాత ఎంతమంది బీజేపీకి ఓటు వేసి ఉంటారో కూడా ఒక అంచనా వేసి బూత్ స్థాయి కమిటీకి పన్నాప్రముఖ్ లు నివేదిస్తారు. ప్రతి బూత్‌లోనూ 60 మంది ఓటర్ల బాధ్యత ఉండదని , ఒక్కో చోట 15మంది ఓటర్ల బాధ్యతలను, మరో చోట 30 మంది ఓటర్ల బాధ్యతలను పన్నా ప్రముఖ్‌లకు బీజేపీ అప్పగిస్తుంది. ఆర్ఎస్ఎస్ ఆలోచనల నుంచి పన్నా ప్రముఖ్ జన్మించింది.ఈ వ్యవస్థను గుజరాత్ లో చాలాకాలంగా అమలు చేస్తున్నట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నవి.

బీజేపీ 2014 నుంచి ఇప్పటి వరకూ దాదాపు అన్ని రాష్ట్రాల్లో, అన్ని ఎన్నికల్లో ‘పన్నా ప్రముఖ్‌’లను నియమిస్తోంది.తెలంగాణలో హుజూరాబాద్‌లో జరిగిన ఉప ఎన్నికలో కూడా పన్నా ప్రముఖ్‌లదే కీలక పాత్ర పోషించినట్టు బీజేపీ చెబుతోంది.పన్నా ప్రముఖ్‌ బాధ్యతకూ,బీజేపీ జాతీయ అధ్యక్షుని బాధ్యతకూ సమాన హోదా ఉంటుందని పలు పన్నా ప్రముఖ్‌ సమావేశాల్లో బీజేపీ నాయకులు చెబుతుండడం వల్ల ‘పన్నా ప్రముఖ్’ ప్రాధాన్యం ఏమిటో తెలుస్తుంది.ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం 15 లక్షల మంది పన్నా ప్రముఖ్‌లను ఇప్పటికే బీజేపీ నియమించింది.బీజేపీ వ్యవస్థీకృతంగా ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ‘పన్నా ప్రముఖ్’. ఎన్నికల వ్యూహంలో ‘మైక్రో మేనేజ్‌మెంట్‌’కు బీజేపీ అధిక ప్రాధాన్యం ఇస్తోంది. పన్నా ప్రముఖ్‌, బూత్ కమిటీ, శక్తి కేంద్రాలు.. ఇవన్నీ ఈ మైక్రో మేనేజ్‌మెంట్‌లో భాగం.

2018 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ 107 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది.రాజాసింగ్ ఒక్కరే గెలిచారు.తర్వాత ఉపఎన్నికలలో దుబ్బాక,హుజురాబాద్ లను బీజేపీ కైవసం చేసుకున్నది.అలాగే లోక్ సభ ఎన్నికల్లో అనూహ్యంగా 4 నియోజకవర్గాల్లో కాషాయ జెండా ఎగిరింది.గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లోనూ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూపింది.ఈ ఫలితాలన్నింటితో బీజేపీకి గొప్ప కిక్కు లభించింది.హుజురాబాద్ లో బీజేపీ తరపున టిఆర్ఎస్ మాజీ మంత్రి ఈటల రాజేందర్ గెలవడం ఆ పార్టీకి ‘నైతిక’బలాన్నిచ్చింది.ఇక తెలంగాణలో తమకు అధికారం లభించడం ఖాయమని బీజేపీ నాయకులు కలలుగంటున్నారు.ఆ కలలను సాకారం చేసుకోవడానికి భారీ వ్యూహరచనతో ముందుకు వెడుతోంది.ఇందుకు తగిన ‘మందుగుండు’ను తెలంగాణ నాయకత్వానికి మోడీ,అమిత్ షా సమకూర్చుతున్నారు.

అయితే సమస్యంతా తెలంగాణ రాష్ట్ర సాధకుడు,ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాలు,ఎత్తుగడలను చిత్తు చేయగలమా,లేదా ? అన్నదే!కేసీఆర్ ‘రణతంత్ర’పుటెత్తులకు విరుగుడు కనుగొనడం సాధ్యం కాదేమోనన్న అనుమానాలు బీజేపీని వెంటాడుతున్నవి.

Next Story