Telugu Global
National

రోజుకు 80మందికి పైగా మహిళలపై అత్యాచారాలు…ఎటు పోతుంది దేశం ?

అమ్నీషియా క్లబ్ మైనర్ అత్యాచారం కేసు… ఆ వెంటనే హైదరాబాద్ మొగల్ పురాలో మరో బాలిక కిడ్నాప్…కాలాపత్తర్ లో మరో బాలికపై అత్యాచారం… అంతకు ముంది దిశ, ఢిల్లీలో నిర్భయ…. ఇలా ప్రతి రోజూ దేశంలో ఎక్కడో ఓ చోట మహిళలపై అత్యాచారాలు, దాడులు, హింసలు, వేధింపులు పెరుగుతూనే ఉన్నాయి. మహిళ‌లపై అత్యాచారాలే కాదు గృహ హింస, ఉద్యోగ స్థలంలో వేధింపులు, రోడ్డు మీదికి వస్తే పోకిరీల వేధింపులు ఒకటేమిటి అడుగడునా మహిళలపై జరుగుతున్న నేరాలకు అడ్డు […]

రోజుకు 80మందికి పైగా మహిళలపై అత్యాచారాలు…ఎటు పోతుంది దేశం ?
X
అమ్నీషియా క్లబ్ మైనర్ అత్యాచారం కేసు… ఆ వెంటనే హైదరాబాద్ మొగల్ పురాలో మరో బాలిక కిడ్నాప్…కాలాపత్తర్ లో మరో బాలికపై అత్యాచారం… అంతకు ముంది దిశ, ఢిల్లీలో నిర్భయ…. ఇలా ప్రతి రోజూ దేశంలో ఎక్కడో ఓ చోట మహిళలపై అత్యాచారాలు, దాడులు, హింసలు, వేధింపులు పెరుగుతూనే ఉన్నాయి. మహిళ‌లపై అత్యాచారాలే కాదు గృహ హింస, ఉద్యోగ స్థలంలో వేధింపులు, రోడ్డు మీదికి వస్తే పోకిరీల వేధింపులు ఒకటేమిటి అడుగడునా మహిళలపై జరుగుతున్న నేరాలకు అడ్డు ఆపూ లేకుండ పోతోంది. ఇక బాలికల పట్ల జరుగుతున్న హింస చాలా మటుకు రికార్డుల్లోకి కూడా ఎక్కడం లేదు. దేశంలో బాలికలపై అత్యాచారాల సంఘటన‌లు ఆందోళన కలిగించే స్థాయిలో ఉంటున్నాయి. మరింత ఆందోళన కలిగించే అంశం బాలికలపై బాలురు చేసే హింస, అత్యాచారాలు. మొన్న జరిగిన అమ్నీషియా క్లబ్ మైనర్ అత్యాచారం కేసులో నిందితులు ఎక్కువ మంది మైనర్లే. 2021లో దేశంలో ప్రతి రోజూ యావరేజ్ గా 80 మందికి పైగా మహిళల‌పై అత్యాచారాలు జరుగాయి.
దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న నేరాల అంకెలు ఒక్క సారి చూస్తే గుండె బద్దలవుతుంది. జాతీయ మ‌హిళా క‌మిష‌న్ ప్రకారం 2021లో మ‌హిళ‌పై చోటుచేసుకున్న నేరాల‌కు సంబంధించి దాదాపు 31,000 కు పైగా ఫిర్యాదులు అందాయి. 2020తో పోలిస్తే 2021లో మహిళలపై నేరాల ఫిర్యాదులు 30 శాతం పెరిగాయి. ఇందులో స‌గానికి పైగా యూపీకి చెందిన‌వే కావ‌డం గ‌మ‌నార్హం.
ఇక నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్బీ) 2021 సెప్టంబర్ లో విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం 2020లో మహిళలపై రోజుకి సగటున 77 అత్యాచారాలు జరిగాయి. దేశవ్యాప్తంగా 28,046 అత్యాచార ఘటనలు వెలుగులోకి వచ్చాయి. మహిళలపై జరిగిన వివిధ నేరాలకు సంబంధించి 3,71,503 కేసులు నమోదయ్యాయి.
మ‌హిళ‌ల‌పై నేరాల‌కు సంబంధించి అందిన ఫిర్యాదుల్లో గరిష్టంగా 11,013 స్త్రీలపై మానసిక వేధింపుల కేసులే ఉన్నాయి. వీటి త‌ర్వాత అధికంగా 6,633 గృహ హింసకు ఫిర్యాదులు ఉన్నాయి. ఇదే స‌మ‌యంలో వరకట్న వేధింపులకు సంబంధించి 4,589 ఫిర్యాదులు అందాయ‌ని క‌మిష‌న్ పేర్కొంది. మ‌హిళ‌పై ప‌లు రాష్ట్రాల్లో హింస గ‌ణ‌నీయంగా పెరుగుతున్న‌ద‌ని గ‌ణాంకాలు పేర్కొంటున్నాయి. ఉత్త‌ర‌ప్రదేశ్‌లో మ‌హిళ‌ల ర‌క్ష‌ణ దారుణంగా ఉంద‌ని ఎన్‌సీడ‌బ్ల్యూ డేటా వెల్ల‌డిస్తున్న‌ది. అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై నేరాలకు సంబంధించి అత్యధికంగా 15,828 ఫిర్యాదులు నమోదయ్యాయి. మొత్తంగా స‌గానికి పైగా ఫిర్యాదులు ఒక్క యూపీ నుంచి అంద‌డం గ‌మ‌నార్హం. యూపీ త‌ర్వాత అధికంగా ఢిల్లీలో 3,336, మహారాష్ట్రలో 1,504, హర్యానాలో 1,460, బీహార్‌లో 1,456 ఫిర్యాదులు నమోదయ్యాయి.
నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో 2020 రిపోర్ట్ ప్రకారం దేశంలో చిన్నారులపై నేరాలు కూడా గతం కంటే పెరిగాయి. 2019లో 1,48,185 కేసులు నమోదు కాగా, ఇందులో కిడ్నాప్‌, అపరహరణ కేసులు 46.6 శాతం, అత్యాచారాల కేసులు 35.3 శాతం నమోదు అయ్యాయి. ప్రతి లక్ష మంది చిన్నారులకు 33.2 నేరాలు జరుగుతున్నాయి.
ఎన్‌సిఆర్‌బి వెల్లడించిన భయానక గణాంకాల ప్రకారం దేశంలో ప్రతి నాలుగు నిమిషాలకు స్త్రీ తన అత్తమామల చేతిలో భౌతిక హింసను అనుభవిస్తుంది. 2019లో 32,033 అత్యాచార కేసులు నమోదైతే, అందులో 11 శాతం దళిత వర్గానికి చెందిన మహిళలేనని నివేదిక పేర్కొంది. ”ఐపిసి కింద మహిళలపై నేరాలకు పాల్పడిన కేసులలో ఎక్కువ భాగం భర్త, అతని బంధువుల వేధింపుల (30.9 శాతం) కింద నమోదయ్యాయి. తరువాత ‘మహిళలపై దాడి’ (21.8 శాతం), ‘మహిళలను అపహరించడం ‘(17.9 శాతం), ‘రేప్‌ ‘ (7.9 శాతం) నమోదయ్యాయి. లక్ష మంది మహిళా జనాభాకు నేరాల రేటు 2018లో 58.8 నమోదు కాగా, దాంతో పోల్చితే 2019లో 62.4కు పెరిగింది”అని ఎన్‌సిఆర్‌బి నివేదిక పేర్కొంది. 2019లో కిడ్నాప్‌, అపహరణకు సంబంధించి 1,05,037 కేసులు నమోదయ్యాయి. అందులో 744 మంది చనిపోయారు. మొత్తం కేసులలో 78.6 శాతం (84,921) మహిళలు, బాలికలు బాధితులుగా ఉన్నారు. 2019లో దేశవ్యాప్తంగా 1,05,037 కిడ్నాప్‌, అపరహరణ కేసులలు నమోదు కాగా, అందులో 16,590 కేసులతో ఉత్తరప్రదేశ్‌ ప్రథమ స్థానంలోనూ, 11,755 కేసులతో మహారాష్ట్ర, 10,707 కేసులతో బీహార్‌ తరువాత స్థానాల్లో నిలిచాయి.
ఇంకా దయనీయమైన‌ విషయమేంటంటే తమపై జరిగే అత్యాచారాలు, హింసలు కొంత మంది మహిళలు బైటికి కూడా చెప్పుకోరు. కేసులు పెట్టరు. ఇక పోలీసులకు పిర్యాదులు చేసిన కేసుల్లో కూడా చాలా భాగం ఎఫ్ ఐ ఆర్ నమోదు కాదు. ముఖ్యంగా, దళిత, గిరిజన, వెనకబడిన వర్గాల స్త్రీల విషయంలో ఇలా జరుగుతుంది. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో ప్రకారమే 2019లో దేశం మొత్తం 1,12,23,694 ఫిర్యాదులు నమోదు కాగా, అందులో కేవలం 5,13,497 పైన మాత్రమే ఎఫ్‌ఐఆర్‌ నమోదు జరిగింది. అలాగే 84,28,966 లిఖిత పూర్వక ఫిర్యాదులు చేయగా, అందులో కేవలం 44,52,621 వాటిపై మాత్రమే ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయింది. మరో 1,90,054 కేసులపై ఆన్‌లైన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయింది. దీంతో మొత్తం 2019లో దేశవ్యాప్తంగా 1,96,52,660 ఫిర్యాలు అందగా వాటిలో కేవలం 51,56,172 పైనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అంటే అధికారిక లెక్కల ప్రకారం మొత్తం 51,56,172 ఘటనలు జరిగాయి.
ఎన్ని చట్టాలు చేసినా… ఎన్ని అరెస్టులు జరిగినా… చివరికి ఎన్ కౌంటర్లలో నిందితులను పోలీసులు చంపేసినా స్త్రీలపై హింస, అత్యాచారాలు ఎందుకు ఆగడం లేదు ? లోపం ఎక్కడ ఉంది ? చట్టాల‌లోనా ? చట్టాలను అమలు చేసే వాళ్ళలోనా ? లేక సంస్కృతిలోనా ?
First Published:  5 Jun 2022 8:19 PM GMT
Next Story