Telugu Global
National

ఎన్నడూ లేనిది బీజేపీ ఎవరికి, ఎందుకు భయపడింది ?

మహ్మద్ ప్రవక్తపై, ఇస్లాం మతంపై బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన అభ్యంతర కర వ్యాఖ్యల నేపథ్యంలో ఆ పార్టీ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అదే విధమైన వ్యాఖ్యలు చేసిన పార్టీ ఢిల్లీ యూనిట్ మీడియా సెల్ హెడ్ నవీన్ కుమార్ ను పార్టీ నుంచి బహిష్కరించింది. ఇది బీజేపీ లో ఆహ్వానించదగ్గ మార్పుగా కొందరు వర్ణిస్తున్నారు. మరి కొందరేమో బీజేపీ చర్యలలో నిజాయితీ లేదని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఎవరు ఎటువంటి వాదనలు […]

ఎన్నడూ లేనిది బీజేపీ ఎవరికి, ఎందుకు భయపడింది ?
X

మహ్మద్ ప్రవక్తపై, ఇస్లాం మతంపై బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన అభ్యంతర కర వ్యాఖ్యల నేపథ్యంలో ఆ పార్టీ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అదే విధమైన వ్యాఖ్యలు చేసిన పార్టీ ఢిల్లీ యూనిట్ మీడియా సెల్ హెడ్ నవీన్ కుమార్ ను పార్టీ నుంచి బహిష్కరించింది.

ఇది బీజేపీ లో ఆహ్వానించదగ్గ మార్పుగా కొందరు వర్ణిస్తున్నారు. మరి కొందరేమో బీజేపీ చర్యలలో నిజాయితీ లేదని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఎవరు ఎటువంటి వాదనలు చేసినా అసలు ఎన్నడూ లేని విధంగా బీజేపీ ఈ విధంగా తమ నాయకులపై చర్యలు తీసుకోవడం మాత్రం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది.

ఇంత కంటే ఎక్కువగా ఇంతకన్నా విద్వేషపూరితంగా ఆ పార్టీ నేతలు అనేక సార్లు, వ్యాఖ్యానాలు చేసినా భౌతిక చర్యలకు దిగినా కిమ్మనని బీజేపీ ఇప్పుడు హటాత్తుగా ఇలా ప్రవర్తించడం వెనక అసలు కారణమేంటి ? ఆ పార్టీ ఎంపీలు సాక్షి మహరాజ్, తేజస్వీ సూర్య , ప్రఙ్యా సింగ్ సహా పలువురు మంత్రులు కూడా ముస్లింల పై చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలకు స్పంధించని బీజేపీ ఇప్పుడు స్పందించడం ఎందుకు ? పైగా నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు తమ పార్టీ అధికారిక అభిప్రాయాలు కాదని ఆ పార్టీ ప్రకటించింది. అంటే గతంలో నాయకులు ఇలాంటి వ్యాఖ్యలే చేసినప్పుడు కనీస స్పందన ఎందుకు లేదు ? అప్పుడు ఆ అభిప్రాయాలు అధికారక అభిప్రాయాలే అని భావించవచ్చా ?

అయితే ఇవన్నీ కుంటి సాకులు. అసలు కారణం నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల తర్వాత అరబ్ దేశాల నుండి వచ్చిన ప్రతి స్పంద‌న బీజేపీని భయపెట్టింది, ఆందోళనకు గురి చేసింది. ఆత్మరక్షణలో పడేసింది.నూపుర్ శర్మ వ్యాఖ్యలపై అరబ్ దేశాలన్నీ భగ్గున మండిపడ్డాయి. ఇరాన్, పాకిస్తాన్ , అఫ్ఘనిస్తాన్ లు కూడా తీవ్రంగా స్పంధించాయి. మిగతా దేశాల స్పంద‌నను పక్కన పెట్టినా అరబ్ దేశాలు, ఇరాన్ లతో మనకున్న అవసరాలు బీజేపీ ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేశాయి.

ఖతర్, కువైట్ దేశాలు మన దేశ రాయబారులను పిలిపించి తమ వ్యతిరేకతను తెలియజేశాయి. వెంటనే భారత దేశం బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) సెక్రటరీ జనరల్ డాక్టర్ నయీఫ్ ఫలాహ్ ఎం. అల్ హజ్రఫ్, నూపుర్ శర్మ ప్రవక్తకు వ్యతిరేకంగా చేసిన ప్రకటనలను తీవ్రంగా ఖండించారు, బీజేపీ ప్రతినిధి నుపుర్ శర్మ వ్యాఖ్యలను అవమానకరంగా భావిస్తున్నట్టు సౌదీఅరేబియా విదేశాంగ శాఖ శాఖ అధికారికంగా ఆక్షేపించింది. విశ్వాసాలు, మతాలకు గౌరవమివ్వాలని ఈ సందర్భంగా సౌదీ పిలుపునిచ్చింది.

మరో వైపు గల్ఫ్ దేశాలలో భారతీయ వస్తువులను బహిష్కరించాలని పిలుపునిస్తూ సోషల్ మీడియాలో ఓ ఉద్యమమే ప్రారంభమైంది. హ్యాష్‌ట్యాగ్‌లు ట్విట్టర్‌లో ట్రెండ్‌గా మారాయి.

ఒక వైపు భారతీయ వస్తువులను బహిష్కరించాలనే ఉద్యమం, మరో వైపు మనం పెట్రోల్, డిజిల్ ల కోసం ఆధారపడే గల్ఫ్ దేశాలు, ఇరాన్ లు ప్రవక్తపై వ్యాఖ్యలపై తీవ్రంగా స్పంధించడం. బీజేపీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఒక అడుగు వెనకకు వేయక తప్పదని భావించిన బీజేపీ అధినాయకత్వం వెంటనే నష్టనివారణ చర్యలు ప్రారంభించింది. నూపుర్ శర్మ చేసిన అభ్యంతర కర వ్యాఖ్యలు భారత ప్రభుత్వ విధానం కాదని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా స్పంధించింది. ఆ వ్యాఖ్యలకు తమకూ ఎలాంటి సంబధం లేదని స్పష్టం చేసింది. మరో వైపు బీజేపీ కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నేతలపై చర్యలు తీసుకుంది. అది తమ అధికారక అభిప్రాయం కాదని స్పష్టం చేసింది.

అది సరే, గతంలో ముస్లింలను ఎదుర్కోవడానికి ఆయుధాలు పట్టండి అని పిలుపునిచ్చిన బీజేపీ ఎంపీ సాక్షీ మహరాజ్, దేశంలో కరోనా వ్యాప్తికి ముస్లింలే కారణమన్న మరో ఎంపీ తేజస్వీ సూర్య. హిందువులు ముస్లింల ఇళ్ళలోకి దూరి వారి ఆడపిల్లలను రేప్ చేయాలంటూ పిలుపునిచ్చిన ఉత్తరప్రదేశ్ బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు సునీతా సింగ్ గౌర్, ముస్లింల మసీదులన్నింటినీ తవ్వేద్దాం అని పిలుపునిచ్చిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్…. ఇలా చెప్పుకుంటు పోతే ప్రతి రాష్ట్రంలో అనేక మంది బీజేపీ లీడర్లు ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషపూరితంగా, హింసను రెచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు ఖండించని, వారిపై చర్యలు తీసుకోని బీజేపీ నాయకత్వం ఇప్పుడు నూపుర్ శర్మపై చర్యలు తీసుకోవడం, ఆమె చేసిన వ్యాఖ్యలు తమ అధికారిక అభిప్రాయాలు కావని చెప్పిందంటే గతంలో మిగతావాళ్ళు చేసిన వ్యాఖ్యలన్నీ బీజేపీ అధికారిక అభిప్రాయాలుగానే భావించాలా ?

First Published:  6 Jun 2022 12:53 AM GMT
Next Story