Telugu Global
National

చరిత్రంటే RRR మూవీ కాదని వాళ్ళకు కాస్త చెప్పండిరా…

జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం తొలిసారి జరపడం సంతోషించవల్సిన విషయమే. ఆ ఉత్సవాల్లో స్వయంగా దేశ హోం శాఖా మంత్రి అమిత్ షా పాల్గోవడం ఆ ఉత్సవానికి మరింత వన్నె తెచ్చింది. అయితే ఆ ఉత్సవాల్లో చరిత్రను వక్రీక‌రించే మాటలు… చరిత్రను వక్రీకరించే ఫోటో ప్రదర్శన చూస్తే కొత్త చరిత్రను రాసే తన లక్ష్యంలో భాగంగా బీజేపీ తెలంగాణ చరిత్రను కూడా మార్చదల్చుకుందా అనే అనుమానాలు కలగక మానవు. అల్లూరి సీతారామరాజు […]

చరిత్రంటే RRR మూవీ కాదని వాళ్ళకు కాస్త చెప్పండిరా…
X

జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం తొలిసారి జరపడం సంతోషించవల్సిన విషయమే. ఆ ఉత్సవాల్లో స్వయంగా దేశ హోం శాఖా మంత్రి అమిత్ షా పాల్గోవడం ఆ ఉత్సవానికి మరింత వన్నె తెచ్చింది. అయితే ఆ ఉత్సవాల్లో చరిత్రను వక్రీక‌రించే మాటలు… చరిత్రను వక్రీకరించే ఫోటో ప్రదర్శన చూస్తే కొత్త చరిత్రను రాసే తన లక్ష్యంలో భాగంగా బీజేపీ తెలంగాణ చరిత్రను కూడా మార్చదల్చుకుందా అనే అనుమానాలు కలగక మానవు.

అల్లూరి సీతారామరాజు గొప్ప యోధుడు, దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన త్యాగదనుడు. మన్యంలో గిరిజనులను ఏకం చేసి ఆయన పోరాడిన తీరు రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు బహు తక్కువ. ఉత్తర భారతీయులకు ఆయన చరిత్ర తెలియక పోవచ్చు, సినిమాల కోసం రాజమౌళి లాంటి వాళ్ళు చరిత్రను మార్చొచ్చు కానీ తెలుగు రాష్ట్రాల్లో పుట్టిపెరిగిన ప్రతి ఒక్కరికీ ఆయన చరిత్ర తెలిసి తీరవల్సిందే కదా ! అందులోనూ రాజకీయ నాయకులు తెలుసుకోవడం మరింత అవసరం . నిజాంవ్యతిరేక పోరాటంలోకి అల్లూరి సీతారామరాజును, బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలోకి కొమురం భీం ను సినిమా వాళ్ళు తీసుకెళ్తారేమో కాని చరిత్ర మాత్రం మారదు.

నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న తెలంగాణ పోరాట యోధుడిగా అల్లూరి సీతారామరాజును అమిత్ షా వర్ణించడం, అందులో తప్పే ఉంది ఉమ్మడి రాష్ట్రంలో ఆయన పోరాడాడు అని బీజేపీ నాయకుడు రాంచంద్రరావు సమర్దించడం, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా అమిత్ షా మాటలను సమర్దించడమే కాక‌ అదే సరైన చరిత్ర అంటూ బుకాయించడం దేనికి నిదర్శనం ?

అల్లూరి సీతారామరాజు పోరాడిన రోజుల్లో ఆ ప్రాంతం ఉన్నది మద్రాసు రాష్ట్రంలో. తెలంగాణ ఉన్నది హైదరాబాద్ స్టేట్ లో రెండింటి పరిపాలనే వేరు. అప్పటి మద్రాసు రాష్ట్రాన్ని(ఇప్పటి ఏపీ) బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తే తెలంగాణను నిజాం పరిపాలించాడు. ఈ చరిత్రను ఎందుకు వక్రీకరించదల్చుకున్నారు ? ఏం ప్రయోజనాలు ఆశించి అబద్దపు చరిత్రను ప్రచారం చేస్తున్నారు.

ఉత్తర భారతీయులైన అమిత్ షా లాంటి వాళ్ళకైతే తెలంగాణ, అల్లూరి చరిత్ర తెలియదనుకుందాం. మరి తెలంగాణలో పుట్టి పెరిగి ఇక్కడి ప్రజల ఓట్లతో నాయకులైన కిషన్ రెడ్డి, రాంచంద్రరావులకు కూడా తెలియకపోవడం విషాదం కాదా ?

ఇప్పటి వరకు ఉన్న భారత దేశ చరిత్ర మీద ముందు నుంచీ ఆరెస్సెస్, బీజేపీలు గుర్రుగానే ఉన్నాయి. మతాధారిత చరిత్ర రాయడానికి ఎప్పటి నుంచో తహతహలాడుతున్నాయి. ఇప్పటి కే చాలా చరిత్ర పుస్తకాలను మార్చేశాయి కూడా. అందులో భాగమే తెలంగాణ కు అల్లూరికి లింక్ కలపడమా ? ఇది అజ్ఞానమా లేక పక్కా ప్రణాళికనా ?

First Published:  4 Jun 2022 4:32 AM GMT
Next Story