Telugu Global
NEWS

దివ్యవాణి వస్తానంటే చేర్చుకోవద్దు.. జగన్‌కు వైసీపీ కార్యకర్తల డిమాండ్

టీడీపీకి దివ్యవాణి రాజీనామా చేసిన తర్వాత ఆ పార్టీ నేతలెవరూ ఆమెను పెద్దగా పట్టించుకోవడం లేదు. పార్టీని, నేతలను ఇష్టానుసారం తిట్టి బయటకు వచ్చినా.. ఆమెను లైట్‌గానే తీసుకున్నారు. తనను అవమానించారంటూ పలువురి పేర్లు చెప్పినా.. వాళ్లు మాత్రం కిమ్మనకుండా ఉండిపోయారు. ఇప్పటికిప్పుడు ఆమె గురించి కౌంటర్లు ఇస్తే.. దివ్యవాణి పాపులారిటీ పెరుగుతుందనే అలా టీడీపీ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్లు తెలుస్తున్నది. దివ్యవాణి రాజీనామా ఎపిసోడ్ తర్వాత వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా స్పందించారు. ఆమె మాటలను […]

దివ్యవాణి వస్తానంటే చేర్చుకోవద్దు.. జగన్‌కు వైసీపీ కార్యకర్తల డిమాండ్
X

టీడీపీకి దివ్యవాణి రాజీనామా చేసిన తర్వాత ఆ పార్టీ నేతలెవరూ ఆమెను పెద్దగా పట్టించుకోవడం లేదు. పార్టీని, నేతలను ఇష్టానుసారం తిట్టి బయటకు వచ్చినా.. ఆమెను లైట్‌గానే తీసుకున్నారు. తనను అవమానించారంటూ పలువురి పేర్లు చెప్పినా.. వాళ్లు మాత్రం కిమ్మనకుండా ఉండిపోయారు. ఇప్పటికిప్పుడు ఆమె గురించి కౌంటర్లు ఇస్తే.. దివ్యవాణి పాపులారిటీ పెరుగుతుందనే అలా టీడీపీ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్లు తెలుస్తున్నది.

దివ్యవాణి రాజీనామా ఎపిసోడ్ తర్వాత వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా స్పందించారు. ఆమె మాటలను బేస్‌గా తీసుకొని టీడీపీపై విమర్శలు గుప్పించారు. అయితే దివ్యవాణి తన రాజకీయ భవిష్యత్ వైసీపీతో కొనసాగించాలనే ఆశతో ఉన్నట్లు సన్నిహితులు అంటున్నారు. అందుకోసం తనకు తెలిసిన మార్గాల్లో వైసీపీ చీఫ్, సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలవడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది.

నిన్న మొన్నటి వరకు టీడీపీలో ఉండి అధికార వైసీపీపై ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేసిన దివ్యవాణిని ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలో చేర్చుకోవద్దని కార్యకర్తలు కోరుతున్నారు. ఆమె గతంలో పార్టీపై విమర్శలు చేస్తూ వాడిన భాషకూడా బాగోలేదని.. వాటిని అప్పుడే ఎలా మర్చిపోతామని వారు అంటున్నారు. క్రిస్టియన్ మైనార్టీ ఓట్లను ఆకర్షించడానికి దివ్యవాణితో పనేముందని.. ఇప్పటికీ ఆ వర్గం వైసీపీతోనే ఉన్నదని గుర్తు చేస్తున్నారు. ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనుక దివ్యవాణి విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటే.. పార్టీలో కొంత మందికి రుచించకపోవచ్చని తెలుస్తున్నది.

మరోవైపు దివ్యవాణి తనకు సన్నిహితులైన సినీ స్నేహితుల ద్వారా వైసీపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ప్రభుత్వంలో మంచి హోదాలో ఉన్న తన పూర్వ స్నేహితురాలి సహాయం తీసుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు కూడా సదరు వైసీపీ నేతపై ఆమె ఎలాంటి విమర్శలు చేయలేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఆ మహిళా నేత వైఎస్ జగన్‌కు కూడా సన్నిహితురాలే కాబట్టి.. ఆమె ద్వారా పార్టీలోకి రావాలని దివ్యవాణి భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

First Published:  3 Jun 2022 10:17 PM GMT
Next Story