Telugu Global
NEWS

పాత కుట్రలపై టీడీపీ జ్యోతుల, టీఆర్‌ఎస్‌ శ్రీనివాస్ మధ్య సంవాదం

చంద్రబాబుకు ముఖ్యమంత్రి స్థానం నుంచి దించేందుకు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సాయంతో 60 మంది ఎమ్మెల్యేలను 2001కి ముందే కేసీఆర్‌ ఏకం చేశారని.. 61 ఎమ్మెల్యేగా వెళ్లిన జ్యోతుల నెహ్రు విషయాన్ని మొత్తం చంద్రబాబుకు చెప్పేయడంతో వ్యూహం ఫలించలేదు అంటూ తెలంగాణ బీజేపీ నేత చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రు స్పందించారు. ఒక చర్చలో జ్యోతుల నెహ్రుకు టీఆర్ఎస్ నేత తాడూరి శ్రీనివాస్‌కు మధ్య ఆసక్తికర సంవాదం నడిచింది. అప్పట్లో కేసీఆర్‌ తనను […]

పాత కుట్రలపై టీడీపీ జ్యోతుల, టీఆర్‌ఎస్‌ శ్రీనివాస్ మధ్య సంవాదం
X

చంద్రబాబుకు ముఖ్యమంత్రి స్థానం నుంచి దించేందుకు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సాయంతో 60 మంది ఎమ్మెల్యేలను 2001కి ముందే కేసీఆర్‌ ఏకం చేశారని.. 61 ఎమ్మెల్యేగా వెళ్లిన జ్యోతుల నెహ్రు విషయాన్ని మొత్తం చంద్రబాబుకు చెప్పేయడంతో వ్యూహం ఫలించలేదు అంటూ తెలంగాణ బీజేపీ నేత చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రు స్పందించారు. ఒక చర్చలో జ్యోతుల నెహ్రుకు టీఆర్ఎస్ నేత తాడూరి శ్రీనివాస్‌కు మధ్య ఆసక్తికర సంవాదం నడిచింది.

అప్పట్లో కేసీఆర్‌ తనను పిలిచింది వాస్తవమేనని జ్యోతుల నెహ్రు చెప్పారు. అయితే తాను 61వ ఎమ్మెల్యేగా కేసీఆర్‌ శిబిరంలోకి వెళ్లానన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ”తాము 60 మంది ఎమ్మెల్యేలను సిద్ధం చేశాం.. నీవు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలను తీసుకొస్తే.. కొత్త ప్రభుత్వంలో నీదే రెండో స్థానం” అంటూ కేసీఆర్‌ ఆఫర్ చేశారని వివరించారు. ఈ పని చేస్తే చంద్రబాబుకు బుద్ది చెప్పినట్టు అవుతుందని కేసీఆర్ తనతో అన్నారని జ్యోతుల నెహ్రు వెల్లడించారు. అయితే ఆ ప్రతిపాదనను తాను అక్కడే తిరస్కరించానని.. పార్టీని చీల్చడం సరికాదని చెప్పానని.. దాంతో ఈ ప్రతిపాదన గురించి కానీ, మనం కలిసినట్టు గానీ బయట ఎక్కడా చెప్పవద్దని కేసీఆర్ విజ్ఞప్తి చేశారన్నారు. కేసీఆర్ విజ్ఞప్తిపై ఏ హామీ ఇవ్వకుండానే తాను అక్కడి నుంచి బయటకు వచ్చానన్నారు.

వెంటనే చంద్రబాబును కలిసి జరుగుతున్న విషయం చెప్పి పార్టీని కాపాడుకోవాల్సిందిగా కోరానన్నారు. అందుకు స్పందించిన చంద్రబాబు.. ”సరే కేసీఆర్‌ను పిలిపిస్తా.. ఈ మాట ఆయన ముందే చెప్పగలవా” అని ప్రశ్నించారన్నారు. తాను సిద్ధమేనని.. కానీ కేసీఆర్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తానని హామీ ఇస్తేనే .. తాను అలా కేసీఆర్‌ ముందే విషయాన్ని చెబుతానని.. అలా కాకుండా బుజ్జగించి ఆయనకు మంత్రి పదవి ఇస్తే ఆ తర్వాత తనను ఇబ్బంది పెడుతారని చంద్రబాబుతో చెప్పానన్నారు.

ఆ తర్వాత దేవేందర్ గౌడ్, యనమల రామకృష్ణుడు రాయబారం నడిపి కేసీఆర్‌ను చంద్రబాబు వద్దకు తీసుకొచ్చారన్నారు. అప్పటికప్పడు డిప్యూటీ స్పీకర్ పదవి అప్పగించారని వివరించారు. డిప్యూటీ స్పీకర్ పోస్టు ఇచ్చినప్పటికీ కేసీఆర్‌ను ఆ చైర్‌లో కూర్చోనివ్వకుండా చంద్రబాబు జాగ్రత్తపడ్డారని కూడా జ్యోతుల నెహ్రు చెప్పారు. ఒకరోజు ముఖ్యమైన అంశంపై చర్చ జరుగుతుంటే .. కేసీఆర్‌ను చైర్‌లో కూర్చోబెడితే ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో దాదాపు 20 గంటలకు పైగా ప్రతిభాభారతే స్పీకర్‌ చైర్‌లో ఉండిపోయారని.. అదో రికార్డు అని కూడా జ్యోతుల చెప్పారు. కేవలం కేసీఆర్‌ మీద నమ్మకం లేకనే డిప్యూటీ స్పీకర్‌గా ఆయన అందుబాటులో ఉన్నప్పటికీ ప్రతిభా భారతితోనే చర్చ నడిపించారన్నారు. కేసీఆర్‌ డిప్యూటీ స్పీకర్‌ స్థానాన్ని చక్కగా వాడుకున్నారని.. ఆ పదవి ద్వారా తెలంగాణ ఉద్యమానికి అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారని జ్యోతుల నెహ్రు వ్యాఖ్యానించారు. మంత్రి పదవి ఇచ్చి ఉంటే కేసీఆర్ సొంత పార్టీ పెట్టేవారు కాదని జ్యోతుల అభిప్రాయపడ్డారు.

ఇదే చర్చలో పాల్గొన్న బీజేపీ నేత చంద్రశేఖర్ మాత్రం.. కేసీఆర్‌ ను.. చంద్రబాబు పిలిచి బుజ్జగించి ఆయనతో పాటు నలుగురికి మంత్రి పదవులు ఇచ్చేందుకు సిద్దమయ్యారని వివరించారు. కానీ కేసీఆర్‌ మంత్రి పదవి తీసుకునేందుకు అంగీకరించలేదన్నారు. మంత్రి పదవి ఇచ్చినట్టే ఇచ్చి ఆ తర్వాత తనను భర్తరఫ్ చేస్తారని దాని వల్ల తన రాజకీయ జీవితం నాశనం అవుతుందని కేసీఆర్‌ తమతో చెప్పారన్నారు. స్పీకర్‌ గానీ, డిప్యూటీ స్పీకర్‌ పోస్టు గానీ ఇస్తే .. వాటి నుంచి భర్తరఫ్ చేయడం కుదరదన్న ఉద్దేశంతో అటుగా కేసీఆరే మొగ్గు చూపి చివరకు డిప్యూటీ స్పీకర్‌గా నియమితులయ్యారని బీజేపీ నేత చంద్రశేఖర్ వివరించారు. డిప్యూటీ స్పీకర్‌ పదవి ద్వారా అనేక మందిని తెలంగాణ ఉద్యమానికి అనుకూలంగా ఆకర్శించగలిగారన్నారు.

టీఆర్‌ఎస్ సీనియర్ నేత తాడూరి శ్రీనివాస్ మాత్రం జ్యోతుల నెహ్రు, చంద్రశేఖర్ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. నిజంగా కేసీఆర్‌ ఎమ్మెల్యేలను చీల్చే పనిచేసి ఉంటే.. 2001 తర్వాత ఎంతో మంది పుస్తకాలు రాశారని, ఎన్నో సందర్భాలు వచ్చాయని కానీ ఇంత పెద్ద విషయాన్ని ఎందుకు ఎవరూ ఒక్కసారి కూడా ప్రస్తావించలేదని తాడూరి శ్రీనివాస్ ప్రశ్నించారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కూడా కేసీఆర్‌తో కలిశారంటున్న వారు.. ఆయన చనిపోయిన తర్వాతనే ఈ విషయాలను చెప్పడంపైనా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఎలాగైనా సరే కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో చంద్రబాబు ఇలా కాంగ్రెస్‌, బీజేపీ నేతల ద్వారా లేనిపోని ప్రచారాలు చేయిస్తున్నారని ఆరోపించారు.

మంత్రి పదవి ఇస్తుంటే కేసీఆరే వద్దన్నారని ఇదే బీజేపీ నేత చంద్రశేఖర్ చెబుతున్నారని.. మరి ఇంతకాలం మంత్రి పదవి రాలేదన్న కోపంతోనే కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ స్థాపించారన్న వారు ఏం సమాధానం చెబుతారని తాడూరి శ్రీనివాస్ ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ను దించడంతో పాటు..అన్ని కుట్రల్లో ఆరితేరిన చంద్రబాబుకు.. స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ లాంటి పోస్టులు ఎదురుతిరిగే వారికి ఇస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో తెలియదా అని వ్యాఖ్యానించారు. నిజంగా కేసీఆర్‌ ఎమ్మెల్యేలను చీల్చి ఉంటే డిప్యూటీ స్పీకర్ పదవిని చంద్రబాబు ఇచ్చే వారు కాదన్నారు.

డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చినప్పటికీ ఆయన్ను ఆ సీట్లు కూర్చోనివ్వకుండా చంద్రబాబు పావులు కదిపారని జ్యోతులు చెబుతున్నారని.. దీన్ని బట్టి చంద్రబాబు తీరు ఎలా ఉండేదో అర్థమవుతోందన్నారు. పార్టీ మీద ప్రేమతో, పార్టీ నాయకత్వం మీద గౌరవంతోనే.. చంద్రబాబుకు కుట్ర అంశాన్ని తెలియజేశాం అంటున్న వారు.. మరి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన ఎన్టీఆర్‌ను చంద్రబాబు దించే కార్యక్రమానికి ఎలా మద్దతు ఇచ్చారని కూడా టీఆర్ఎస్ నేత తాడూరి శ్రీనివాస్ ప్రశ్నించారు. మొత్తం మీద.. అప్పట్లో ఏం జరిగినా.. ఆ అంశాలు ఇప్పుడు కేసీఆర్‌పై ప్రభావం చూపే అవకాశం లేదు. దీని వల్ల టీఆర్‌ఎస్‌కు నష్టమూ లేదు, ఇతరులకు ప్రత్యేకంగా వచ్చే లాభమూ లేదు. పైగా కేసీఆర్‌ అప్పట్లోనే అంత వీరోచిత రాజకీయాలు చేశారా అన్న అభిప్రాయానికి అవకాశం ఏర్పడుతోంది.

First Published:  3 Jun 2022 10:07 PM GMT
Next Story