Telugu Global
NEWS

కుల పెద్దలు మరణశిక్ష విధించారు.. కుటుంబ సభ్యులు చంపేశారు..

ఆధునిక కాలంలో కూడా ఇంకా అనాగరిక చట్టాలను అమలు చేస్తున్న వారు అక్కడక్కడా ఉన్నారు. కుల పెద్దల పేరుతో అమాయక గిరిజనుల జీవితాలతో ఆడుకునే పెద్దమనుషులూ ఉన్నారు. అలాంటి అనాగరిక ఘటనే మన్యం జిల్లాలోని సీతంపేట ఏజెన్సీలో జరిగింది. 33 ఏళ్ల సింగన్న అనే వ్యక్తికి మరణ శిక్ష విధించారు సవర గిరిజన పెద్దలు. ఆ శిక్షను అమాయకంగా అమలు చేశారు సింగన్న కుటుంబ సభ్యులు. అతడిని ఓ గదిలో బంధించి చంపేశారు. సింగన్న మానసిక వికలాంగుడు. […]

కుల పెద్దలు మరణశిక్ష విధించారు.. కుటుంబ సభ్యులు చంపేశారు..
X

ఆధునిక కాలంలో కూడా ఇంకా అనాగరిక చట్టాలను అమలు చేస్తున్న వారు అక్కడక్కడా ఉన్నారు. కుల పెద్దల పేరుతో అమాయక గిరిజనుల జీవితాలతో ఆడుకునే పెద్దమనుషులూ ఉన్నారు. అలాంటి అనాగరిక ఘటనే మన్యం జిల్లాలోని సీతంపేట ఏజెన్సీలో జరిగింది. 33 ఏళ్ల సింగన్న అనే వ్యక్తికి మరణ శిక్ష విధించారు సవర గిరిజన పెద్దలు. ఆ శిక్షను అమాయకంగా అమలు చేశారు సింగన్న కుటుంబ సభ్యులు. అతడిని ఓ గదిలో బంధించి చంపేశారు. సింగన్న మానసిక వికలాంగుడు. కనీసం ఆ కనికరం కూడా లేకుండా కుటుంబ సభ్యులే అతడ్ని చంపేయడం మరీ దారుణం. ఈ విషయం బయటకు పొక్కడంతో పోలీసులు విచారణ చేపట్టారు. సింగన్న మరణానికి కారణమైన 16మందిని అరెస్ట్ చేశారు.

సింగన్న చేసిన తప్పేంటి..?
సవర సింగన్న మానసిక వికలాంగుడు. ఉసిరికపాడు అనే గ్రామంలో జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో బంధువులతో అతను గొడవ పడ్డాడు. గయ అనే వృద్ధుడిని కర్రతో కొట్టాడు. కొంతసేపటికి ఆ వృద్ధుడు చనిపోయాడు. అయితే ఈ విషయాన్ని గిరిజన కుటుంబాలు గోప్యంగా ఉంచాయి. మృతదేహానికి అంత్యక్రియలు చేసి, సింగన్న చేసిన తప్పుపై పంచాయితీ పెట్టాయి. పంచాయితీ పెద్దలు ఈ వ్యవహారాన్ని పోలీసులుకు అప్పజెప్పకుండా తామే తీర్పు చెప్పారు. ఏకంగా మరణ శిక్ష విధించారు. ఆ శిక్షని కూడా కుటుంబ సభ్యులే అమలు చేయాలని సూచించారు.

ఆ తెగ కట్టుబాట్ల ప్రకారం పెద్దలు పంచాయితీలో చేసిన తీర్మానాన్ని వారంతా కచ్చితంగా అమలు చేయాల్సిందే. దీంతో ఓ గదిలో సింగన్నను బంధించి తీవ్రంగా హింసించి చంపేశారు కుటుంబ సభ్యులు. వారికి మరికొందరు సాయపడ్డారు. సింగన్న మానసిక పరిస్థితిపై కొంతమంది జాలి చూపించినా.. చివరకు పెద్దల పంచాయితీ ప్రకారం మరణ శిక్ష అమలైంది. మే 28, 29 తేదీల్లో పంచాయితీ జరిగింది. ఆ మరుసటి రోజు శిక్షను అమలు చేశారు, సింగన్నను చంపేసి గుట్టు చప్పుడు కాకుండా అంత్య క్రియలు నిర్వహించారు. ఈ విషయం ఆనోటా ఈనోటా పోలీసుల వరకు వెళ్లింది. పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించిన పోలీసులు సింగన్న మరణానికి కారణైన కుటుంబ సభ్యులతోపాటు మొత్తం 16మందిని అరెస్ట్ చేశారు.

First Published:  3 Jun 2022 10:30 PM GMT
Next Story