Telugu Global
National

సోషల్ మీడియాను గుప్పిట్లో పెట్టుకోనున్న కేంద్రం.. ఐటీ చట్టంలో మార్పులు..!

సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు గూగుల్‌లకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇవ్వబోతున్నది. వాటిలో వచ్చే కంటెంట్‌పై పూర్తి స్థాయి అధికారం పొందే దిశగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్ 2021 చట్టానికి మార్పులు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్‌ను ఇప్పటికే సిద్దం చేసింది. ఈ మార్పులు జరిగితే.. ప్రభుత్వం తరపున గ్రీవియెన్స్ అప్పిలేట్ కమిటీ (జీఏసీ) అనే అత్యంత పవర్ ఫుల్ సంస్థ […]

సోషల్ మీడియాను గుప్పిట్లో పెట్టుకోనున్న కేంద్రం.. ఐటీ చట్టంలో మార్పులు..!
X

సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు గూగుల్‌లకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇవ్వబోతున్నది. వాటిలో వచ్చే కంటెంట్‌పై పూర్తి స్థాయి అధికారం పొందే దిశగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్ 2021 చట్టానికి మార్పులు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్‌ను ఇప్పటికే సిద్దం చేసింది. ఈ మార్పులు జరిగితే.. ప్రభుత్వం తరపున గ్రీవియెన్స్ అప్పిలేట్ కమిటీ (జీఏసీ) అనే అత్యంత పవర్ ఫుల్ సంస్థ ఏర్పడుతుంది. ఇది సోషల్ మీడియా సంస్థలపై పెత్తనం చేసేదిగా మారబోతున్నది. కాగా, తొలుత ఐటీ మినిస్ట్రీ దీనికి సంబంధించిన డ్రాఫ్ట్‌ను తమ వెబ్‌సైట్‌లో ఉంచింది. నెటిజన్లు దాన్ని విస్తృతంగా షేర్ చేయడమే కాకుండా, విమర్శలు కూడా చేయడంతో తొలగించింది.

సోషల్ మీడియా కంపెనీలకు చట్టవ్యతిరేకమైన, విద్వేషపూరిత కంటెంట్‌ను తొలగించడం ఇబ్బందికరంగా మారిందని.. వారిపై అదనపు భారం పడుతోందని, అందుకే ఒక పర్యవేక్షక సంస్థ ఉండాలని కేంద్రం భావిస్తున్నది. ఈ క్రమంలోనే జీఏసీని ఏర్పాటు చేయడానికి సిద్దపడింది అని సదరు డ్రాఫ్ట్‌లో పేర్కొన్నారు. అయితే ఈ చట్ట సవరణ అమలు చేసి, జీఏసీ మనుగడలోకి వస్తే సోషల్ మీడియాపై ప్రభుత్వానిదే పై చేయి అవుతుందని లీగల్ రీసెర్చర్ గుర్షాబాద్ గ్రోవర్ అన్నారు. సోషల్ మీడియాలోని కంటెంట్ డిలీట్ చేయాలన్నా, సస్పెండ్ చేసిన అకౌంట్లను పునరుద్దరించాలన్నా.. ప్రభుత్వం చెప్పేదే ఫైనల్ అవుతుందని ఆయన హెచ్చరించారు.

ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా సోషల్ మీడియా ఖాతాల్లోని కంటెంట్‌పై సెన్సార్ విధించబోతున్నదని ఆయన అన్నారు. ఈ నిర్ణయం కచ్చితంగా సోషల్ మీడియా దిగ్గజాలకు పెద్ద ఎదురు దెబ్బే అని, ప్రభుత్వం నేరుగా వాటితో యుద్దానికి దిగబోతున్నదని నిపుణులు చెప్తున్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఎవరి అకౌంట్లు సస్పెండ్/బ్లాక్/రిమూవ్ చేయాలో, ఉంచాలో అనే తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే జీఏసీ పరిధిలో ఉండనున్నది. దీంతో సోషల్ మీడియా కంపెనీల పాత్ర నామమాత్రం కానున్నది. అదే జరిగితే ఆయా సంస్థలు నేరుగా కేంద్రంతో ఢీ కొట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

అన్ని సోషల్ మీడియా సంస్థలకు కలిపి ఒకటే జీఏసీ కాకుండా.. వేర్వేరు జీఏసీలు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది. ప్రతీ జీఏసీకి ఒక చైర్ పర్సన్‌తో పాటు సభ్యులు కూడా ఉండనున్నారు. వీళ్లు తీసుకునేదే తుది నిర్ణయం కానున్నది. ఆ మేరకు సోషల్ మీడియా కంపెనీలు కూడా ఉత్తర్వులు అమలు చేయాల్సి ఉన్నది.

కాగా, ఈ నిర్ణయంపై తీవ్రమైన విమర్శలు రావడంతో డ్రాఫ్ట్‌ను తొలగించారు. దీనిపై ఐటీ శాఖ వివరణ ఇచ్చింది. డ్రాఫ్ట్‌లో కొన్ని మార్పలు చేయాల్సి ఉన్నది. అందుకే ప్రస్తుతానికి తొలగించాము. త్వరలోనే దీన్ని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తామని చెప్పింది.

First Published:  2 Jun 2022 10:36 PM GMT
Next Story