Telugu Global
NEWS

అభ్యర్థుల ఎంపికలో స్పీడ్.. నమ్మక ద్రోహులకు చెక్..

తెలంగాణలో ఎన్నికలకు టైమ్ దగ్గరపడింది. అధికార టీఆర్ఎస్ వినూత్న పథకాలతో ప్రజలలో నమ్మకాన్ని పెంపొందించుకుంటోంది. తనకు ప్రధాన ప్రత్యర్థి అనుకుంటున్న బీజేపీపై విమర్శలతో విరుచుకుపడుతోంది. బీజేపీ కూడా నెలకోసారి కేంద్ర నాయకత్వాన్ని తెలంగాణకు తీసుకొస్తూ హడావిడి చేస్తోంది. ఇటీవల కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీతో సభ నిర్వహించి వరంగల్ డిక్లరేషన్ ప్రకటించారు. ఆ తర్వాత రైతు రచ్చబండ పెట్టారు. అయితే అనుకున్నంత స్థాయిలో ఆ కార్యక్రమాలు సక్సెస్ కాలేదనుకున్నారో ఏమో.. పార్టీ జాతీయ విభాగం చింతన్ శిబిర్ […]

అభ్యర్థుల ఎంపికలో స్పీడ్.. నమ్మక ద్రోహులకు చెక్..
X

తెలంగాణలో ఎన్నికలకు టైమ్ దగ్గరపడింది. అధికార టీఆర్ఎస్ వినూత్న పథకాలతో ప్రజలలో నమ్మకాన్ని పెంపొందించుకుంటోంది. తనకు ప్రధాన ప్రత్యర్థి అనుకుంటున్న బీజేపీపై విమర్శలతో విరుచుకుపడుతోంది. బీజేపీ కూడా నెలకోసారి కేంద్ర నాయకత్వాన్ని తెలంగాణకు తీసుకొస్తూ హడావిడి చేస్తోంది. ఇటీవల కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీతో సభ నిర్వహించి వరంగల్ డిక్లరేషన్ ప్రకటించారు. ఆ తర్వాత రైతు రచ్చబండ పెట్టారు. అయితే అనుకున్నంత స్థాయిలో ఆ కార్యక్రమాలు సక్సెస్ కాలేదనుకున్నారో ఏమో.. పార్టీ జాతీయ విభాగం చింతన్ శిబిర్ పెట్టినట్టే, టీ కాంగ్రెస్ కూడా రెండు రోజులపాటు చింతన్ శిబిర్ నిర్వహించింది. 2023 ఎన్నికలే లక్ష్యంగా విధి విధానాలు ప్రకటించింది.

6 నెలల ముందుగానే అభ్యర్థుల ఎంపిక..
తీరా ఎన్నికల ముందు అభ్యర్థులను ప్రకటించి ఇబ్బంది పడేకంటే.. ఆరు నెలల ముందుగానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకోసం అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించింది ఈమేరకు ఇప్పటినుంచే కసరత్తులు మొదలు పెడతామని చెప్పింది. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఐదారుగురితో లిస్ట్ రెడీ చేసి, ఆ జాబితాను ఏఐసీసీకి పంపించి ఆ తర్వాత అభ్యర్థులను ఖరారు చేస్తామంటున్నారు టీ కాంగ్రెస్ నేతలు. ఈమేరకు చింతన్ శిబిర్ లో తీర్మానం కూడా చేశారు.

బయటకు వెళ్లినవారికి చోటు లేదు..
పార్టీ ఏదైనా.. ఎన్నికల ముందు కూడికలు తీసివేతలు ఉంటాయి. అవకాశాన్ని బట్టి, అదును చూసి పార్టీలోకి వచ్చేవారుంటారు, ఫిరాయించేవారు కూడా ఉంటారు, సొంత గూటికి చేరుకునేవారు కూడా ఉంటారు. అయితే ఈసారి పాతవారెవరినీ తిరిగి పార్టీలో చేర్చుకునే అవకాశం లేదని చెబుతోంది టీ కాంగ్రెస్. చేయి గుర్తుకి చేయిచ్చి వెళ్లిపోయినవారెవర్నీ తిరిగి దగ్గరకు తీసుకోవద్దని చింతన్ శిబిర్ లో తీర్మానం చేశారు నేతలు.

తెలంగాణలోని సమస్యలపై చింతన్ శిబిర్ లో చర్చించారు కాంగ్రెస్ నేతలు. అధికార టీఆర్ఎస్ ని ఎలా ఎదుర్కోవాలి, ప్రజల్లో ఎలా ఎండగట్టాలనే విషయాలపై కూడా చర్చ జరిగింది. సామాజిక న్యాయం, ఆర్థిక, రాజకీయ, సంస్థాగత, రైతులు, యువత ఇలా ఆరు కమిటీలను ఏర్పాటు చేసి చింతన్ శిబిర్ లో రాష్ట్ర సమస్యలపై చర్చించారు.

First Published:  2 Jun 2022 10:52 AM GMT
Next Story