Telugu Global
NEWS

కేంద్రం ఆంక్షలపై కేసీఆర్‌ ఫైర్

కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ మరోసారి విరుచుకుపడ్డారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ప్రసంగించిన కేసీఆర్.. కేంద్రం నుంచి తెలంగాణకు నయాపైసా కూడా సాయం అందడం లేదన్నారు. న్యాయంగా రావాల్సిన నిధుల్లోనూ కోత పెడుతున్నారని విమర్శించారు. నిధులు కేటాయించాలని ప్రధానిని కోరినా ఉపయోగం లేకుండా పోయిందన్నారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. కేంద్రంపై పోరాటాలు చేయాల్సి వస్తోందన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు 24వేల కోట్లు ఇవ్వాలన్న నీతిఆయోగ్ సిఫార్సులను కూడా కేంద్రం […]

కేంద్రం ఆంక్షలపై కేసీఆర్‌ ఫైర్
X

కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ మరోసారి విరుచుకుపడ్డారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ప్రసంగించిన కేసీఆర్.. కేంద్రం నుంచి తెలంగాణకు నయాపైసా కూడా సాయం అందడం లేదన్నారు. న్యాయంగా రావాల్సిన నిధుల్లోనూ కోత పెడుతున్నారని విమర్శించారు. నిధులు కేటాయించాలని ప్రధానిని కోరినా ఉపయోగం లేకుండా పోయిందన్నారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. కేంద్రంపై పోరాటాలు చేయాల్సి వస్తోందన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు 24వేల కోట్లు ఇవ్వాలన్న నీతిఆయోగ్ సిఫార్సులను కూడా కేంద్రం ఖాతరు చేయలేదన్నారు.

ధాన్యం కొనుగోలు విషయంలోనూ తెలంగాణకు కేంద్రం అన్యాయం చేసిందన్నారు. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని కేంద్ర మంత్రి ఒకరు అవహేళన చేశారని.. ఈ మాటలను తెలంగాణ ప్రజల హృదయాలను తీవ్రంగా గాయపరిచాయన్నారు. కేంద్రం సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. రైతులతో చెలగాటం ఆడవద్దని కేంద్రానికి తాను హితవు పలుకుతున్నానని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కార్పొరేట్లతో చెలిమి చేస్తూ రైతుల జీవితాలతో ఆడుకోవడం ఇప్పటికైనా కేంద్రం మానుకోవాలన్నారు.

ప్రగతిశీల రాష్ట్రాలకు ప్రోత్సహించకుండా కేంద్రం వివక్ష చూపుతోందన్నారు. విభజన చట్టంలోని హామీలను బుట్టదాఖలు చేశారన్నారు. అత్యంత క్లిష్టమైన కరోనా సమయంలోనూ రాష్ట్రానికి ఎలాంటి సాయం కేంద్రం చేయలేదన్నారు. ఐటీఐఆర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయకుండా అడ్డుపడ్డారన్నారు.

సమైక్య పాలనలో తెలంగాణ పట్ల ఆంధ్రా పాలకులు వివక్ష చూపితే .. ఇప్పుడు కేంద్రం వివక్ష చూపుతోందన్నారు. రాష్ట్రాలపై కర్రపెత్తనం చేయాలని కేంద్రం చూస్తోందన్నారు. సమాఖ్య స్పూర్తిని దెబ్బతీసేలా కేంద్రం పనిచేస్తోందన్నారు. కేంద్ర వైఖరి రాష్ట్రానికి గుదిబండగా తయారైందన్నారు. విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాల సంఖ్య పెంచాల్సి ఉన్నా ఆ పని కూడా కేంద్రం చేయడం లేదన్నారు.

రాష్ట్రాలకు ఉన్న ఆర్థిక స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేస్తున్నారని.. ఎఫ్‌ఆర్‌బీఎం పేరుతో ఆంక్షలు విధిస్తున్నారని కేసీఆర్ విమర్శించారు. కులం,మతం పేరుతో విధ్వేష రాజకీయాలను చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విద్వేష రాజకీయాలతో దేశాన్ని వందేళ్లు వెనక్కు తీసుకెళ్లారని కేసీఆర్ ఆవేదన చెందారు. ప్రపంచంలోని అనేక దేశాలు రానురాను ప్రజాస్వామ్యయుతంగా బలోపేతం అవుతుంటే.. మన దేశంలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని.. రానురాను నిరంకుశ పోకడలు పెరిగిపోతున్నాయన్నారు. దేశంలో గుణాత్మక మార్పులు రావాల్సి ఉందన్నారు. ఉమ్మడి జాబితాలోని అంశాలను అడ్డుపెట్టుకుని రాష్ట్రాలపై కేంద్రం కర్రపెత్తనం చేస్తోందన్నారు. రానురాను ఉమ్మడి జాబితా పెరుగుతోందని.. రాష్ట్రాల అధికార జాబితా తగ్గిపోతోందన్నారు.

ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న వారు బలమైన కేంద్రం.. బలహీన రాష్ట్రాలు అనే పనికిమాలిన సిద్ధాంతాన్ని ప్రతిపాదికగా చేసుకున్నారన్నారు. కూర్చున్న కొమ్మను నరికేలా కేంద్రం పనిచేస్తోందన్నారు. పన్నులను సెస్‌లుగా మార్చి రాష్ట్రాలకు నిధులు రాకుండా అడ్డుకుంటోందన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను తప్పక పాటించాలని రాష్ట్రాలను ఆదేశిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. తాను మాత్రం ఇష్టానుసారం అప్పులు చేస్తోందన్నారు.

రాష్ట్రాలపై విధిస్తున్న ఆర్థిక ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని కేంద్రాన్ని తాను డిమాండ్ చేస్తున్నానన్నారు. కేంద్రానికి తలొగ్గి విద్యుత్‌ సంస్కరణలు అమలు చేయకపోవడం వల్ల ఐదేళ్లలో 25వేల కోట్లు అదనంగా సమకూర్చుకునే అవకాశం లేకుండాపోతోందన్నారు.. ఈ డబ్బులకు ఆశపడితే రైతు మోటార్లకు మీటర్లకు పెట్టాల్సి ఉంటుందని, రైతుల నుంచి చార్జీలు వసూలు చేయాల్సి ఉంటుందని.. తాము అలా చేయబోమన్నారు. కంఠంలో ప్రాణమున్నంత వరకు రైతుల పక్షానే ఉంటామని కేంద్రానికి తాను స్పష్టం చేశానన్నారు.

మనతో పాటు స్వాతంత్య్రంపొందిన దేశాలు సూపర్ పవర్‌గా ఎదుగుతుంటే మనం మాత్రం ఇంకా కులం, మతం అంటూ కొట్టుకుంటున్నామని కేసీఆర్ ఆవేదన చెందారు. అశాంతి ఇలాగే కొనసాగితే పెట్టుబడులు రావని, దేశం బయట బతుకున్న భారతీయులు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు.

First Published:  1 Jun 2022 11:31 PM GMT
Next Story