Telugu Global
NEWS

ముదురుతున్న రుషికొండ ధ్వంసం వ్యవహారం

విశాఖ రుషికొండ విధ్వంసం కేసు సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టు ముందు కూడా రాష్ట్ర ప్రభుత్వం పచ్చి అబద్దాలు చెప్పిందని.. ఆ వివరాలను సుప్రీంకోర్టుకు అందజేస్తానని ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రకటించారు. విశాఖ సముద్ర తీరానికి అనుకుని ఉన్న రుషికొండ వద్ద.. గతంలో టూరిజం శాఖకు చెందిన కొన్ని నిర్మాణాలు ఉండేవి. వాటిని కూడా అక్కడ ప్రకృతికి విఘాతం కలగకుండా చిన్నచిన్నగా నిర్మాణాలు చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. ఇప్పటికే ఉన్న టూరిజం కట్టడాలను మరింత అభివృద్ధి చేస్తామంటూ ప్రకటించింది. […]

ముదురుతున్న రుషికొండ ధ్వంసం వ్యవహారం
X

విశాఖ రుషికొండ విధ్వంసం కేసు సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టు ముందు కూడా రాష్ట్ర ప్రభుత్వం పచ్చి అబద్దాలు చెప్పిందని.. ఆ వివరాలను సుప్రీంకోర్టుకు అందజేస్తానని ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రకటించారు. విశాఖ సముద్ర తీరానికి అనుకుని ఉన్న రుషికొండ వద్ద.. గతంలో టూరిజం శాఖకు చెందిన కొన్ని నిర్మాణాలు ఉండేవి. వాటిని కూడా అక్కడ ప్రకృతికి విఘాతం కలగకుండా చిన్నచిన్నగా నిర్మాణాలు చేశారు.

వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. ఇప్పటికే ఉన్న టూరిజం కట్టడాలను మరింత అభివృద్ధి చేస్తామంటూ ప్రకటించింది. ప్రకృతికి విఘాతం కలగకుండా నిర్మాణం చేస్తామని అనుమతులు తీసుకున్నారు. అయితే ఊహించని విధంగా రుషికొండను చుట్టూ తవ్వేశారు. దీనిపై ఎంపీ రఘురామ.. ఎన్‌జీటీలో ఫిర్యాదు చేశారు. దాంతో నిర్మాణాలపై ఎన్‌జీటీ స్టే ఇచ్చింది. హైకోర్టు కూడా ఈ వ్యవహారాన్ని సెలవుల తర్వాత విచారిస్తామని చెప్పింది. ప్రభుత్వం అనుమతులు అత్యవసరంగా ఇవ్వాలంటూ సుప్రీంకోర్టుకు వెళ్లింది.

త్వరలో వర్షకాలం రాబోతోంది.. ఇప్పుడు పనులు ఆపితే నష్టం జరుగుతుంది కాబట్టి తక్షణం ఎన్‌జీటీ స్టే ఎత్తివేయాలని కోరింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే 50 శాతం పనులు కూడా పూర్తయ్యాయని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు కూడా ఇవ్వకుండా స్టే ఇచ్చారని వివరించారు. ఈ ప్రాజెక్టుతో 300 మందికి ఉపాధి వస్తుందని..180 కోట్లు రూపాయల పెట్టుబడులను ఏపీ ప్రభుత్వం పెట్టిందని వివరించారు. ఓ ఎంపీ లేఖపై ఎన్జీటీ స్టే ఉత్తర్వులు జారీ చేసిందని అభ్యంతరం తెలిపారు.

అయితే ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు పచ్చి అబద్దాలు చెప్పిందంటున్నారు రఘురామకృష్ణంరాజు. అప్పటికే ఉన్న నిర్మాణాలపై అదనపు అంతస్తులు నిర్మిస్తామని అనుమతులు తీసుకుని.. వాటిని నేల మట్టం చేయడమే కాకుండా, చుట్టూ కొండను ధ్వంసం చేశారని వివరించారు. ఇప్పటికే 50 శాతం పనులు పూర్తి అయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని, అది పూర్తి అవాస్తవమన్నారు. అక్కడ కొండను ధ్వంసం చేయడం తప్ప ఒక్క ఇటుక కూడా పెట్టలేదన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సుప్రీంకోర్టుకు సమర్పిస్తానంటున్నారు.

అక్కడ జరిగిన విధ్వంసంపై నివేదిక ఇచ్చేందుకు ఒక కమిటీని ఎన్‌జీటీ నియమించిందని.. ఆ కమిటీ అక్కడ పర్యటిస్తే జరిగిన విధ్వంసం బయటపడుతుందనే.. ఆ కమిటీ రావడానికి ముందే సుప్రీంకోర్టు ద్వారా ఎన్‌జీటీ ఆదేశాలను కొట్టివేయించాలని ప్రభుత్వం చూస్తోందని.. అందుకే అబద్దాలను లాయర్ ద్వారా సుప్రీంకోర్టుకు వివరించారని రఘురామ చెబుతున్నారు. తదుపరి విచారణను రేపటికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. రేపు అన్ని ఆధారాలను సుప్రీంకోర్టు ముందు ఉంచుతానని ఎంపీ చెప్పారు. కేవలం టూరిజం ముసుగులో రుషికొండ చుట్టూ భారీ నిర్మాణాలు చేసి.. ఆ తర్వాత అక్కడ సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు.

First Published:  31 May 2022 4:52 AM GMT
Next Story