Telugu Global
National

ఎవరి బొమ్మలు ఎవరు పెట్టుకోవాలి ?

తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్ లోనూ బీజేపీ నాయకులు ఇటీవల వింత వాదనలు లేవనెత్తుతున్నారు. కిషన్ రెడ్డి నుంచి బండి సంజయ్ దాకా తెలంగాణలో, సోమూ వీర్రాజు లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో నిస్సిగ్గుగా ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో అమలు చేసే కొన్ని కార్యక్రమాలకు కేంద్ర నుంచి కొంత భాగం నిధులు అందుతున్నాయని, అందువల్ల ఆ పథకాల ప్ర‌కటనల్లో మోదీ బొమ్మ ఉండాలని, ఆ పథకాలకు మోదీ పేరు పెట్టాలని మాట్లాడుతున్నారు. కేంద్రం సాయం అందించే పథకాలకు ఇక్కడి […]

center-for-survival-depending-on-the-states
X
తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్ లోనూ బీజేపీ నాయకులు ఇటీవల వింత వాదనలు లేవనెత్తుతున్నారు. కిషన్ రెడ్డి నుంచి బండి సంజయ్ దాకా తెలంగాణలో, సోమూ వీర్రాజు లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో నిస్సిగ్గుగా ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు.
రాష్ట్రంలో అమలు చేసే కొన్ని కార్యక్రమాలకు కేంద్ర నుంచి కొంత భాగం నిధులు అందుతున్నాయని, అందువల్ల ఆ పథకాల ప్ర‌కటనల్లో మోదీ బొమ్మ ఉండాలని, ఆ పథకాలకు మోదీ పేరు పెట్టాలని మాట్లాడుతున్నారు.
కేంద్రం సాయం అందించే పథకాలకు ఇక్కడి ముఖ్యమంత్రుల ఫోటోలు ఎందుకని నిలదీస్తున్నారు.
ఇందులో నిజం ఎంత ? రాష్ట్రాలకు ఇవ్వడానికి అసలు కేంద్రానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ?
పన్నుల రూపేణా రాష్ట్రాల నుంచి వచ్చే నిధుల్లో ఎక్కువ భాగం కేం ద్రం వినియోగించుకొని , అతి కొద్ది సొమ్ముని రాష్ట్రాలకు ఇస్తూ ఉంటే అది కేంద్రం డబ్బు అవుతుందా ?
రాష్ట్రాల నుంచి కేంద్రానికి వెళ్ళేది ఎంత ? కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చేది ఎంత ?
ఈ విషయం ప్రజలకు అర్ధం అయితే… ఇలాంటి కువిమర్షలు చేస్తున్న బీజేపీ నాయకులు తలలు ఎక్కడ పెట్టుకుంటారు ?
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాల గురించి ఈ మ‌ధ్య కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజెపి తెలంగాణ అధ్యక్షుడు బండిసంజయ్ లు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. కేంద్ర నిధులతోనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు నడుస్తున్నాయని చెప్తున్నారు. రాష్ట్ర పథకాలు మొత్తం కేంద్ర నిధులతోనే నడుస్తున్నాయని వాటన్నింటికి మోదీ బొమ్మలు పెట్టాలంటూ బీజేపీ నాయకులు వాదిస్తున్నారు
కేంద్రమిస్తున్న డ్రింకింగ్‌ వాటర్‌ స్కీం నిధుల నుంచే మిషన్‌ భగీరథ పథకం అమలు చేస్తున్నారని హరితహారం, పల్లె ల్లో పార్కులు, ప్రకృతి వనాలు, రైతు వేదికలు, చెరువులు, కాల్వల మరమ్మతుల వంటి పనులు కేంద్రం నిధులతోనే సాగుతున్నాయని బీజేపీ నేతలు వాదిస్తున్నారు.
బీజేపీ నేతలు చేస్తున్న వాదనల్లో నిజమే ఉందని వాదన కోసం ఒప్పుకున్నా అసలు కేంద్రానికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయన్నది అసలు ప్రశ్న. నిధులు ఎవరికి ఎవరిస్తున్నారు ? కేంద్రానికి రాష్ట్రం ఇస్తున్నదా లేక కేంద్రం రాష్ట్రానికి ఇస్తున్నదా ?
ఆదాయం పన్ను, సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ సుంకం, సేవా పన్ను, GST రూపంలో రాష్ట్రం కేంద్రానికి డబ్బును చెల్లిస్తుంది. GST, కేంద్ర ప్రాయోజిత పథకాలు, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు, బ్యాక్‌వర్డ్ రీజియన్ గ్రాంట్ ఫండ్ (BRGF) మొదలైన వాటి ద్వారా రాష్ట్ర వాటా రూపంలో కేంద్రం నిధులను రాష్ట్రానికి విడుదల చేస్తుంది. మరి ఇటు నుండి అటు ఎంత వెళ్ళాయి ? అటు నుండి ఇటు ఎంత వచ్చాయి ?
ఒక్క సారి 2014 నుండి 2021 వరకు లెక్కలు చూద్దాం.
రాష్ట్రం నుండి కేంద్రానికి ఎన్ని నిధులు వెళ్ళాయి కేంద్రం నుండి రాష్ట్రానికి ఎన్ని నిధులు వచ్చాయో ఒక్క సారి లెక్కలు వేసుకుందాం. 2014,15 నుంచి 2020, 21 వరకు తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్ళిన నిధులు 3,65,797 కోట్ల రూపాయలు కాగా కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చిన నిధులు 1,68,647 కోట్ల రూపాయలు.
ఇంకా వివరంగా సంవత్సరాల వారీగా చెప్పుకోవాలంటే…. 2014,15 లో రాష్ట్రం నుండి పన్నుల రూపంలో కేంద్రానికి వెళ్ళిన నిధులు 40,727 కోట్ల రూపాయలు కాగా 2015,16 లో 52,250 కోట్ల రూపాయలు, 2016,17 లో 57,276 కోట్ల రూపాయలు, 2017,18 లో 52,996 కొట్ల రూపాయలు, 2018,19లో 69,677 కోట్ల రూపాయలు 2019,20 లో 46,754 కోట్ల రూపాయలు, 2020,21 లో 46,117 కోట్ల రూపాయలు.
అయితే కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చిన నిధులు 2014,15 లో 15,307 కోట్ల రూపాయలు కాగా, 2015,16 లో 21,745 కోట్ల రూపాయలు, 2016,17 లో 24,628 కోట్ల రూపాయలు, 2017,18 లో 24,479 కోట్ల రూపాయలు, 2018,19 లో 26,739 కోట్ల రూపాయలు, 2019,20 లో 27,586 కోట్ల రూపాయలు, 2020,21 లో 28,163 కోట్ల రూపాయలు.
దీన్ని బట్టి అర్దమవుతున్నదేంటి ? ఎవరి డబ్బులు ఎవరు ఖర్చు పెడుతున్నారు ? అసలు రాష్ట్రాలు లేకుండా కేంద్రం ఉంటుందా ? రాష్ట్రాలే లేకుంటే మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామా రావు చెప్పినట్టు కేంద్ర మిథ్య అనేది వాస్తవం కాదా ?
మరి దేశంలోని మొత్తం రాష్ట్రాల నుండి కేంద్రానికి పన్నుల రూపంలో వెళ్తున్న సొమ్ము ఎక్కడ ఖర్చు అవుతోంది ? ఆ లెక్కలెప్పుడైనా కేంద్రం చెప్పిందా ? కొంత భాగం దేశ రక్షణకు ఖర్చు కాగా మిగతాది ఏమవుతుంది ?
ఏమవుతున్నది అనే ప్రశ్న ఇప్పటిది కాదు. గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనూ అనేక రాష్ట్రాలు ఈ ప్రశ్నలను లేవనెత్తాయి. కేంద్రానికి కొన్ని రాష్ట్రాల నుండి అతి ఎక్కువ ఆదాయం వస్తూ ఉండగా కొన్ని రాష్ట్రాల నుండి అతి తక్కువ ఆదాయం వస్తోంది. మళ్ళీ అందులోనూ తక్కువ ఆదాయాలొస్తున్న రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలకు మాత్రం కేంద్రం ఎక్కువ నిధులు ఖర్చుపెడుతోంది.
ముఖ్యంగా బీమారు (bimaru ) రాష్ట్రాల మీద కేంద్రం ఎక్కువ నిధులు ఖర్చుపెడుతోంది. బీమారు (bimaru) రాష్ట్రాలు అంటే బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లు. బీమారు రాష్ట్రాలుగా పిలవబడే ఈ నాలుగు రాష్ట్రాల నుండి కేంద్రానికి అతి తక్కువ ఆదాయం వస్తోంది.
పైగా ఆ నాలుగు రాష్ట్రాల కోసం కేంద్రం ఎక్కువ నిధులను విడుదల చేస్తోంది. ఈ మధ్య కాలంలో ఆ నాలుగు రాష్ట్రాలకు తోడు గుజరాత్ కూడా చేరినట్టు సమాచారం.
లెక్కలు ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత తెలంగాణాలో కానీ ఏపీలో కానీ అమలవుతున్న పథకాలు కేం ద్ర నిధులపై ఆధారపడి ఉన్నాయంటే నమ్మగలమా ? రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు మోదీ బొమ్మ పెట్టుకోవాలన్న బీజేపీ నేతల వాదనలో పస ఉందా ? ఈ లెక్కలన్నీ చూసిన తర్వాత‌ అసలు ఎవరి బొమ్మలు ఎవరు పెట్టుకోవాలో బీజేపీ నాయకులు చెప్పలేక పోయినా ప్ర‌జలకైతే అర్దమవుతుంది కదా !
First Published:  31 May 2022 2:18 AM GMT
Next Story