Telugu Global
NEWS

గాలీ, నీళ్ళు కలుషితం.. అందుకే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ బంద్

పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఫెర్టిలైజర్స్ కంపెనీ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సిఎల్) తక్షణం ఎరువుల ఉత్పత్తిని నిలిపివేయాలని కాలుష్య నియంత్రణ మండలి (పిసిబి) ఆదివారం నోటీసు జారీ చేసింది. అంతేకాక కంపెనీకీ చెందిన 12 లక్షల రూపాయల హామీ మొత్తాన్ని జప్తు చేసింది. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులతోపాటు టీఆర్ఎస్ కు చెందిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ఫిర్యాదు మేరకు విచారణ జరిపి చర్యలు తీసుకున్నట్లు పీసీబీ సభ్య కార్యదర్శి ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేంద్రం ఇటీవలే ఆర్‌ఎఫ్‌సిఎల్ […]

గాలీ, నీళ్ళు కలుషితం.. అందుకే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ బంద్
X

పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఫెర్టిలైజర్స్ కంపెనీ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సిఎల్) తక్షణం ఎరువుల ఉత్పత్తిని నిలిపివేయాలని కాలుష్య నియంత్రణ మండలి (పిసిబి) ఆదివారం నోటీసు జారీ చేసింది. అంతేకాక కంపెనీకీ చెందిన 12 లక్షల రూపాయల హామీ మొత్తాన్ని జప్తు చేసింది. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులతోపాటు టీఆర్ఎస్ కు చెందిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ఫిర్యాదు మేరకు విచారణ జరిపి చర్యలు తీసుకున్నట్లు పీసీబీ సభ్య కార్యదర్శి ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కేంద్రం ఇటీవలే ఆర్‌ఎఫ్‌సిఎల్ పునరుద్ధరణ పనులను రూ.6,120.5 కోట్లతో చేపట్టగా, ఈ ప్లాంట్‌ ద్వారా ఏడాదికి 12.5 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా ఉత్పత్తి అవుతుందని అంచనా. ఫిబ్రవరి 28, 2020 నుండి యూరియా ఉత్పత్తిని అధికారులు ట్రయల్ రన్ ప్రారంభించారు.

అయితే కంపెనీ అమ్మోనియా ప్లాంట్ నుండి వాయువుల లీకేజీతో పాటు దాని వ్యర్థాల వల్ల నీరు కలుషితమవడంతో చాలా సమస్యలు వస్తున్నాయని ప్లాంట్ పరిసరాల్లో నివసించే ప్రజలు అప్పటి నుండి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. వీర్లపల్లి, లక్ష్మీపూర్‌, యెల్కపల్లిగేట్‌, వేటల్‌నగర్‌, శాంతినగర్‌, తిలక్‌నగర్‌, గౌతమినగర్‌, సంజయ్‌గాంధీనగర్‌, చైతన్యపురి కాలనీల్లో గ్యాస్‌ లీకేజీపై అనేక ఫిర్యాదులు అందాయి.

నాసిరకం పనుల వల్ల, గ్యాస్ లీకేజీ వల్ల సమీపంలోని నివాసితులకే కాకుండా కార్మికులకు కూడా నష్టం వాటిల్లిందని ఆర్‌ఎఫ్‌సిఎల్ యూనియన్ అధ్యక్షుడు అంబటి నరేష్ ఆరోపించారు.

కంపెనీకి ఇంతకుముందు వ్యర్థ జలాలను తరలించడానికి ప్రత్యేక కాలువ ఉంది, ఆ తర్వాత అది ఆక్రమణకు గురైంది. ప్రస్తుతం ఇందిరానగర్, మార్కండేయ కాలనీ, సంజయ్ గాంధీనగర్ మీదుగా ప్రవహించే డ్రైనేజీలోకి వందల క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి వదులుతున్నారు. దీంతో భూగర్భ జలాలు, గోదావరిలో నీరు కలుషితమవుతోంది.

షరతుల ప్రకారం ఆర్ఎఫ్ సీఎల్‌లో అమ్మోనియా లీకేజీ నివారణ చర్యలను పూర్తి స్థాయిలో చేపట్టడం లేదు. పరిశ్రమ నుంచి వెలువడే వ్యర్థ జలాలను శుద్ధి చేసి ప్లాంటేషన్‌కే వాడతామని చెప్పి.. పూర్తిస్థాయిలో శుద్ధి చేయకుండానే గోదావరి నదిలోకి వదులుతున్నారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన సుందిళ్ల బ్యారేజీ నీరు కలుషితమవుతోందని ప్రజలు ఆందోళన నిర్వహిస్తున్నారు.

గత సంవత్సరం, బిజెపి రామగుండం కార్పొరేషన్ యూనిట్ ప్రధాన కార్యదర్శి గొర్రె రాజు, న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు, అతను వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలని RFCL యాజమాన్యాన్ని కోరాడు, కానీ యాజమాన్యం స్పంధించలేదు.

కాగా, గ్యాస్‌ లీకేజీని అరికట్టేందుకు ఆర్‌ఎఫ్‌సీఎల్‌ యాజమాన్యం చర్యలు తీసుకోవడం లేదని స్థానికుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్‌ టీఎస్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డుకు ఫిర్యాదు చేశారు. కర్మాగారం వల్ల గోదావరి నదికి కాలుష్యం చేరడంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తన పిర్యాదులో పేర్కొన్నారు.

దాంతో పిసిబి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ అధికారిని నియమించింది, అతను వారం రోజుల పాటు రామగుండం ప్లాంట్, దాని పరిసరాలను పరిశీలించి, కాలుష్య సమస్యలు ఉన్నాయని ధృవీకరించి నివేదికను సమర్పించింది. నివేదిక ఆధారంగా పీసీబీ చర్యలు తీసుకుంది.

First Published:  30 May 2022 2:07 AM GMT
Next Story