Telugu Global
National

2024 ఎన్నికల కోసం సావర్కార్ మూవీ..

సినిమాల వల్ల ప్రజలు ప్రభావితం అవుతారనేది ఎంత వాస్తవమో.. రాజకీయ నాయకులకు సినిమాలు ఉపయోగపడతాయనేది కూడా అంతే వాస్తవం. 2019 ఎన్నికల ముందు ప్రధాని నరేంద్రమోదీపై ఓ సినిమా విడుదల కావాల్సి ఉంది. సరిగ్గా ఎన్నికల సమయానికి విడుదలయ్యేలా పక్కా ప్లాన్ తో ఆ సినిమా తీశారు. కానీ ప్రతిపక్షాలు ఆక్షేపించడంతో ఎన్నికల సంఘం విడుదలను ఆపేసింది. ఎన్నికల తర్వాత ఆ సినిమా విడుదలైంది. 2019 ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకే నరేంద్ర మోదీ అనే సినిమా […]

2024 ఎన్నికల కోసం సావర్కార్ మూవీ..
X

సినిమాల వల్ల ప్రజలు ప్రభావితం అవుతారనేది ఎంత వాస్తవమో.. రాజకీయ నాయకులకు సినిమాలు ఉపయోగపడతాయనేది కూడా అంతే వాస్తవం. 2019 ఎన్నికల ముందు ప్రధాని నరేంద్రమోదీపై ఓ సినిమా విడుదల కావాల్సి ఉంది. సరిగ్గా ఎన్నికల సమయానికి విడుదలయ్యేలా పక్కా ప్లాన్ తో ఆ సినిమా తీశారు. కానీ ప్రతిపక్షాలు ఆక్షేపించడంతో ఎన్నికల సంఘం విడుదలను ఆపేసింది. ఎన్నికల తర్వాత ఆ సినిమా విడుదలైంది. 2019 ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకే నరేంద్ర మోదీ అనే సినిమా తీశారనే ఆరోపణలున్నా.. అది కేవలం అభిమానంగానే చెప్పుకున్నారు నిర్మాత సందీప్ సింగ్. సరిగ్గా ఇప్పుడు 2024 ఎన్నికల సమయానికి మరో సినిమాని ఆయన రెడీ చేస్తున్నారు.

వీర సావర్కార్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు సందీప్ సింగ్. సావర్కార్ జయంతి సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి 2023 చివరలో ఈ సినిమా విడుదల చేస్తామంటున్నారు. ఈసారి ఎన్నికల విషయంలో అడ్డంకులు లేకుండా పక్కా ప్లానింగ్ తో వెళ్తున్నారు సందీప్ సింగ్.

బీజేపీ కోసమేనా..?
గాంధీ హత్య కేసులో నాథూరామ్ గాడ్సే దోషిగా తేలితే.. ఆ కుట్రలో సావర్కార్ కి కూడా భాగం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే అవి కేవలం ఆరోపణలే కావడం, ఆధారాలు లేకపోవడంతో ఆయనపై ఉన్న అభియోగాలను కోర్టు కొట్టివేసింది. అయితే సావర్కార్ హిందూత్వ నాయకుడు కావడంతో బీజేపీ ఆయనను ఓన్ చేసుకుంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో 2001లో కూడా వీర సావర్కార్ పై ఓ సినిమా తీశారు. ఇప్పుడు మరోసారి ఈ సినిమా తెరకెక్కుతోంది. రణదీప్ హుడా ప్రధాన పాత్రలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మహేష్ మంజ్రేకర్.

దావూద్ ఇబ్రహాం, హర్షద్ మెహతా, లలిత్ మోడీలపై సినిమాలు వచ్చినప్పుడు.. స్వాతంత్ర సమర యోధుడైన సావర్కార్ పై సినిమా ఎందుకు తీయకూడదు అని ప్రశ్నిస్తున్నారు నిర్మాత సందీప్ సింగ్. నరేంద్రమోదీ పేరుతో సినిమా తీసిన ఈ యువ నిర్మాత.. బయోపిక్ ల స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. త్వరలో గాడ్సే జీవిత చరిత్రపై కూడా సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు సందీప్ సింగ్. సావర్కార్‌ కు భారతరత్న ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అటెన్ బరో తీసిన గాంధీ సినిమాలో అంబేద్కర్, సావర్కార్ కి తగిన స్థానం ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత సావర్కార్ జీవితాన్ని ఎవరూ సరిగా ఆవిష్కరించలేకపోయారని, ఆయనపై తప్పుగా ప్రచారం జరిగిందని అంటున్నారు సందీప్ సింగ్. సావర్కార్ జీవితం ఏంటో, అసలు నిజం ఏంటో.. తాను ప్రేక్షకులకు చూపెడతానంటున్నారు.

First Published:  29 May 2022 9:48 PM GMT
Next Story