Telugu Global
National

పశువుల కొట్టంలో దళితుడిని గొలుసులతో కట్టేసి 31 గంటలపాటు చిత్రహింసలు

రాజస్థాన్‌లోని బుండి జిల్లాలో 35 ఏళ్ల దళిత కూలీని కిడ్నాప్ చేసి, పశువుల కొట్టంలో గొలుసులతో బంధించి చిత్రహింసలకు గురి చేశారు. ఈ సంఘటన జరిగి వారం రోజులు గడిచింది, అయినప్పటికీ పోలీసులు ఇంకా నిందితులను అరెస్టు చేయలేదు. నిందితులను పట్టుకునేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. బుండి జిల్లా తలేరా పోలీస్ స్టేషన్ పరిధిలోని బిలుబా గ్రామానికి చెందిన రాధేశ్యామ్ మేఘ్‌వాల్ అనే దళిత కూలీని మూడు సంవత్సరాల క్రితం 70,000 […]

పశువుల కొట్టంలో దళితుడిని గొలుసులతో కట్టేసి 31 గంటలపాటు చిత్రహింసలు
X

రాజస్థాన్‌లోని బుండి జిల్లాలో 35 ఏళ్ల దళిత కూలీని కిడ్నాప్ చేసి, పశువుల కొట్టంలో గొలుసులతో బంధించి చిత్రహింసలకు గురి చేశారు. ఈ సంఘటన జరిగి వారం రోజులు గడిచింది, అయినప్పటికీ పోలీసులు ఇంకా నిందితులను అరెస్టు చేయలేదు. నిందితులను పట్టుకునేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

బుండి జిల్లా తలేరా పోలీస్ స్టేషన్ పరిధిలోని బిలుబా గ్రామానికి చెందిన రాధేశ్యామ్ మేఘ్‌వాల్ అనే దళిత కూలీని మూడు సంవత్సరాల క్రితం 70,000 రూపాయల అడ్వాన్స్ చెల్లించి పరమ్‌జిత్ సింగ్ అనే వ్యక్తి తన ఫామ్‌హౌస్‌లో పనికి నియమించుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు మేఘ్వాల్ తన సోదరి వివాహం కోసం సింగ్ నుండి 30,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. కొద్ది రోజులకు 50,000 రూపాయలు తిరిగి చెల్లించాడు. పైగా అడ్వాన్స్ అయిపోయిన తర్వాత కూడా పది రోజుల పాటు సింగ్ ఫార్మ్ హౌజ్ లో పని చేశాడు మేఘ్వాల్. అయితే, మేఘ్వాల్ తనకు 1,10,000 రూపాయలు బాకీ పడ్డాడని, ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని మేఘ్వాల్ పై సింగ్ ఒత్తిడి తెచ్చాడు. అనేక సార్లు బెధిరించాడు.

అక్కడితో ఆగని పరమ్‌జిత్ సింగ్ ఈ నెల 22వ తేదీన అతని సోదరుడు, మరో నలుగురితో కలిసి మేఘ్వాల్ ను కిడ్నాప్ చేసి పశువుల కొట్టంలో గొలుసులతో బంధించి 31 గంటల పాటు నీళ్ళు, ఆహారం కూడా ఇవ్వకుండా చిత్ర హింసలకు గురి చేశాడు. చివరకు మేఘ్వాల్ సోదరుడు మరో భూస్వామి దగ్గర పని చేయడానికి ఒప్పుకొని అతని దగ్గర 46,000 రూపాయలు అడ్వాన్స్ తీసుకొని పరమ్‌జిత్ సింగ్ కు ఇచ్చి అన్నను విడిపించాడు.

అనంతరం మే 24న మేఘ్వాల్ తనపై జరిగిన దాడి, చిత్ర హింసల విషయంపై పోలీసులకు పిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు మేరకు సింగ్‌తో పాటు మరో ఐదుగురిపై ఐపీసీ, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శంకర్ లాల్ తెలిపారు. అయితే వారం రోజులు గడిచిపోతున్నా ఇప్పటి వరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

First Published:  30 May 2022 5:26 AM GMT
Next Story