Telugu Global
National

పోలీసుల ఇన్వెస్టిగేషన్ కు కర్నాటక హైకోర్ట్ డెడ్ లైన్..

విచారణ పేరుతో ఏళ్ల తరబడి కేసులను సాగదీయడం ఇక కుదరదు. వాయిదాల మీద వాయిదాలు అడగడం కూడా కుదరదు. చిన్న కేసయితే రెండు నెలలు, పెద్ద నేరం అయితే మూడు నెలలలోగా పోలీసులు విచారణ పూర్తి చేయాలి. దర్యాప్తు సంస్థలు కూడా ఈ నిబంధన పాటించాల్సిందే. ఈ మేరకు కర్నాటక హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాల పరిమితి నిర్ణయాన్ని పోలీసులు, దర్యాప్తు సంస్థలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని చెప్పింది. అయితే విచారణ సకాలంలో పూర్తి కాకపోతే సరైన […]

పోలీసుల ఇన్వెస్టిగేషన్ కు కర్నాటక హైకోర్ట్ డెడ్ లైన్..
X

విచారణ పేరుతో ఏళ్ల తరబడి కేసులను సాగదీయడం ఇక కుదరదు. వాయిదాల మీద వాయిదాలు అడగడం కూడా కుదరదు. చిన్న కేసయితే రెండు నెలలు, పెద్ద నేరం అయితే మూడు నెలలలోగా పోలీసులు విచారణ పూర్తి చేయాలి. దర్యాప్తు సంస్థలు కూడా ఈ నిబంధన పాటించాల్సిందే. ఈ మేరకు కర్నాటక హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాల పరిమితి నిర్ణయాన్ని పోలీసులు, దర్యాప్తు సంస్థలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని చెప్పింది. అయితే విచారణ సకాలంలో పూర్తి కాకపోతే సరైన కారణం చెప్పి ట్రయల్ కోర్టు ద్వారా పోలీసులు ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

2012లో బెలగావి ఎమ్మెల్యే అభయ్ కుమార్ పాటిల్ అక్రమాస్తుల కేసు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. పదేళ్లవుతున్నా కేసు విచారణను పోలీసులు ముగించలేకపోతున్నారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కర్నాటక హైకోర్టు అమికస్ క్యూరీని నియమించింది. అయితే విచారణకు అడ్డంకిగా ఉన్న కారణాలను తెలుసుకున్న హైకోర్టు ఇకపై ఏ కేసులో కూడా ఇలాంటి అలసత్వాన్ని, ఆలస్యాన్ని సహించబోనని చెప్పింది. ఈ కేసు విచారణలో భాగంగానే కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఒకవేళ ఈ మార్గదర్శకాలను పోలీసులు పాటించలేకపోతే.. కర్నాటక పోలీసు చట్టం కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కర్నాటక పోలీస్ చట్టంలోని సెక్షన్ 20 సి-7 ప్రకారం విచారణ సకాలంలో పూర్తి చేయడంలో అధికార యంత్రాంగం విఫలమైతే.. దాన్ని తీవ్రమైన క్రమశిక్షణ ఉల్లంఘనగా భావిస్తారు. అయితే ఈ పోలీస్ చట్టాన్ని ఎవరూ అనుసరించడంలేదు. ఇకపై దీని ప్రకారం విచారణ సకాలంలో పూర్తి చేయని అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది కర్నాటక హైకోర్టు.

ఇక పోలీస్ స్టేషన్లలో కూడా నేర విచారణకోసం అనుభవజ్ఞులైన, అంకిత భావం కలిగిన సిబ్బందిని నియమించాలని సూచించింది కర్నాటక హైకోర్టు. సాంకేతికతను వాడుకుని కేసుల విచారణను త్వరితగతిన ముగించాలని, సాగదీయకూడదని చెప్పింది. సైబర్ నేరాలు, మనీలాండరింగ్, అవినీతికి సంబంధించిన నేరాల విచారణకు ప్రత్యేక సాంకేతికత ఉపయోగించుకోవాలని సూచించింది.

First Published:  29 May 2022 1:27 AM GMT
Next Story