Telugu Global
NEWS

వార్న్ కోసం మరొక్క గెలుపు!

దేశవిదేశాలలోని కోట్లాదిమంది అభిమానులను గత రెండుమాసాలుగా అలరిస్తూ వస్తున్న ఐపీఎల్ 15వ సీజన్ సమరం పతాకస్థాయికి చేరింది. దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాలలో ఒకటైన అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగే సూపర్ సండే టైటిల్ ఫైట్ లో మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ తో అరంగేట్రం సీజన్లోనే అదరగొట్టిన గుజరాత్ టైటాన్స్ అమీతుమీకి సిద్ధమయ్యింది. లక్షమంది అభిమానులు ప్రత్యక్షంగానూ, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది టీవీల ద్వారా వీక్షించనున్న ఫైనల్ ఫైట్ కు రెండుజట్లూ తమతమ […]

షేన్ వార్న్
X

దేశవిదేశాలలోని కోట్లాదిమంది అభిమానులను గత రెండుమాసాలుగా అలరిస్తూ వస్తున్న ఐపీఎల్ 15వ సీజన్ సమరం పతాకస్థాయికి చేరింది. దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాలలో ఒకటైన అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగే సూపర్ సండే టైటిల్ ఫైట్ లో మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ తో అరంగేట్రం సీజన్లోనే అదరగొట్టిన గుజరాత్ టైటాన్స్ అమీతుమీకి సిద్ధమయ్యింది.
లక్షమంది అభిమానులు ప్రత్యక్షంగానూ, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది టీవీల ద్వారా వీక్షించనున్న ఫైనల్ ఫైట్ కు రెండుజట్లూ తమతమ వ్యూహాలతో సిద్ధమయ్యాయి.

పడిలేచిన కెరటం రాజస్థాన్ రాయల్స్..
2008 ఐపీఎల్ ప్రారంభసీజన్ టైటిల్ ను షేన్ వార్న్ నాయకత్వంలో నెగ్గిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 14 సంవత్సరాల సుదీర్ఘవిరామం తర్వాత..యంగ్ గన్ సంజు శాంసన్ కెప్టెన్సీలో మరోసారి ఫైనల్స్ కు అర్హత సంపాదించింది. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో రెండేళ్లపాటు నిషేధానికి గురైన రాజస్థాన్ రాయల్స్ జట్టు గత దశాబ్దకాలంలో ఎన్నో ఆటుపోట్లు చవిచూసింది. తమ తొలి కెప్టెన్ షేన్ వార్న్ ను..మెంటార్ గా నియమించుకోడం ద్వారా తన ప్రస్థానం కొనసాగిస్తూ వచ్చిన జైపూర్ ఫ్రాంచైజీకి..ప్రస్తుతం శ్రీలంక దిగ్గజ క్రికెటర్ కుమార సంగక్కర డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే థాయ్ లాండ్ పర్యటనకు వెళ్లిన సమయంలో షేన్ వార్న్ తన హోటెల్ గదిలో గుండెపోటుతో మరణించాడు. వార్న్ హఠాన్మరణం తమకు తీరనిలోటని, వార్న్ స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రస్తుత సీజన్లో అద్భుత విజయాలు సాధించడం ద్వారా ఫైనల్ వరకూ వచ్చామని.. మరొక్క విజయం వార్న్ కోసం సాధించగలిగితే తమ లక్ష్యం నెరవేరినట్లేనని కెప్టెన్ సంజు శాంసన్ ప్రకటించాడు.

రాయల్స్ హిట్.. బట్లర్ సూపర్ హిట్..
మొత్తం 10 జట్లతో నిర్వహించిన ప్రస్తుత 15వ సీజన్ లీగ్ కోసం రాజస్థాన్ రాయల్స్ జట్టు సమతూకంతో కూడిన జట్టుతో వ్యూహాత్మకంగా సిద్ధమయ్యింది. డాషింగ్ ఓపెనర్ జోస్ బట్లర్, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, యువఆటగాడు దేవదత్ పడిక్కల్, కెప్టెన్ సంజు శాంసన్ రేయన్ పరాగ్, షెర్మన్ హెట్ మేయర్ లతో కూడిన పవర్ ఫుల్ బ్యాటింగ్ లైనప్ కు..స్పిన్ జోడీ రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహాల్, పేస్ త్రయం ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ కృష్ణ, ఓబెడ్ మెకోయ్ జత కలవడంతో..అత్యంత పటిష్టమైన జట్టుగా రూపుదిద్దుకొంది. లీగ్ దశలో మొత్తం 14 మ్యాచ్ లు ఆడిన రాజస్థాన్ 9 విజయాలు, 5 పరాజయాలతో 18 పాయింట్లు సాధించడం ద్వారా..లీగ్ టేబుల్ రెండోస్థానంలో నిలిచింది. అంతేకాదు..క్వాలిఫైయర్ -1 రౌండ్లో గుజరాత్ చేతిలో పరాజయం ఎదురైనా.. క్వాలిఫైయర్ -2 సమరంలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ను 7 వికెట్లతో చిత్తు చేయడం ద్వారా ఫైనల్లో అడుగుపెట్టింది.

జోస్.. నయా జోష్..
ఇక..ఆరెంజ్ క్యాప్ రేసులో అందరికంటే ముందున్న డాషింగ్ ఓపెనర్ జోస్ బట్లర్ గురించి ఎంత చెప్పుకొన్నా అది తక్కువే అవుతుంది. ఇప్పటి వరకు లీగ్ దశ 14 మ్యాచ్ లు, ప్లే-ఆఫ్ రౌండ్లోని రెండు మ్యాచ్ లతో కలిపి మొత్తం 16 ఇన్నింగ్స్‌లో బట్లర్ ఏకంగా 824 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 116 పరుగుల అత్యధిక స్కోరుతో 78 బౌండ్రీలు, 45 సిక్సర్లు నమోదు చేశాడు. ఇక..బౌలింగ్ విభాగంలో లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చహాల్ సైతం అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ కు ఇచ్చే పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో నిలిచాడు. 16 మ్యాచ్ ల్లో 26 వికెట్లు పడగొట్టాడు. వెటరన్ స్పిన్నర్ అశ్విన్ బౌలర్ గా మాత్రమే కాదు..బ్యాటర్ గా కూడా జట్టు విజయాలలో ప్రధానపాత్ర వహించాడు. ఏది ఏమైనా..ప్రస్తుత టోర్నీలో మరొక్క విజయం సాధించగలిగితే..తమ ఫస్ట్ ఎవర్ రాయల్ షేన్ వార్న్ కు టైటిల్ తో ఘనమైన శ్రద్ధాంజలి ఘటించినట్లే అవుతుంది.

First Published:  28 May 2022 7:55 PM GMT
Next Story