Telugu Global
NEWS

అనంతపురంలో ముగిసిన సామాజిక న్యాయభేరి..

నాలుగురోజులపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మంత్రులు చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర అనంతపురం బహిరంగ సభతో ముగిసింది. శ్రీకాకుళంతో మొదలై.. మొత్తం నాలుగురోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో యాత్ర కొనసాగింది. బస్సు యాత్రలో పాల్గొన్న మంత్రులు.. నాలుగు రోజులపాటు నాలుగు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. జగన్ తోనే సామాజిక న్యాయం జరిగిందని చెప్పిన మంత్రులు, చంద్రబాబుపై విమర్శలతో విరుచుకుపడ్డారు. చంద్రబాబు పాలనలో టీడీపీ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు అందాయని.. వైఎస్‌ జగన్ పాలనలో కులాలు, […]

అనంతపురంలో ముగిసిన సామాజిక న్యాయభేరి..
X

నాలుగురోజులపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మంత్రులు చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర అనంతపురం బహిరంగ సభతో ముగిసింది. శ్రీకాకుళంతో మొదలై.. మొత్తం నాలుగురోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో యాత్ర కొనసాగింది. బస్సు యాత్రలో పాల్గొన్న మంత్రులు.. నాలుగు రోజులపాటు నాలుగు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. జగన్ తోనే సామాజిక న్యాయం జరిగిందని చెప్పిన మంత్రులు, చంద్రబాబుపై విమర్శలతో విరుచుకుపడ్డారు.

చంద్రబాబు పాలనలో టీడీపీ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు అందాయని.. వైఎస్‌ జగన్ పాలనలో కులాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు మంత్రి చెల్లుబోయిన గోపాలకృష్ణ. . బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగానే చూశారని చెప్పారు. ఒంగోలులో నిర్వహించిన టీడీపీ మహానాడు అట్టర్ ఫ్లాప్ అయిందని అన్నారాయన. జగనన్న ముద్దు – చంద్రబాబు వద్దు అనే నినాదంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.

కేబినెట్ లో 74 శాతం పదవులు అణగారిన వర్గాలకు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని అన్నారు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా. సంక్షేమ పథకాల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేశారన్నారు. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో దోచుకున్నారని, చంద్రబాబు కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. టీడీపీది మహానాడు కాదని, వెన్నుపోటు నాడు, దగా నాడు అని అన్నారు మరో మంత్రి నారాయణ స్వామి. టీడీపీది నయవంచక మహానాడు అని ఎద్దేవా చేశారు. నవరత్నాల పథకాలతో సీఎం జగన్‌.. పేదలకు ఆర్థిక భరోసా ఇచ్చారని చెప్పారు.

టీడీపీ బీసీ వ్యతిరేక పార్టీ అని అన్నారు ఆర్‌ కృష్ణయ్య. చంద్రబాబు మాటల్లోనే బీసీలపై ప్రేమ చూపించారని, జగన్ చేతల్లో కూడా చూపిస్తున్నారని చెప్పారు. ఇతర రాష్ట్రాల సీఎంలకు కూడా జగన్ ఆదర్శనీయుడని కొనియాడారు. చివరి రోజు బస్సు యాత్ర ముగిసిన అనంతరం అనంతపురంలో భారీ బహిరంగ సభలో నేతలంతా పాల్గొన్నారు. మంత్రులకు స్థానిక నేతలు, కార్యకర్తలు ఘన సన్మానాలు చేశారు. బస్సు యాత్రకు ఊహించని స్పందన వచ్చిందని, ఈ ఘనత జగన్ దేనని అన్నారు నేతలు.

First Published:  29 May 2022 9:30 AM GMT
Next Story