Telugu Global
NEWS

ఖాళీ కుర్చీలతో కొట్టుకుంటున్న వైసీపీ, టీడీపీ

ఏపీలో రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు ఖాళీ కుర్చీలను విసురుకుంటున్నాయి. రెండుగా చీలిన మీడియా.. ప్రత్యర్థి పార్టీ సమావేశం జరిగితే చాలు.. ఖాళీ కుర్చీల కోసం ఎదురుచూస్తోంది. జగన్ మీటింగ్‌కు వచ్చిన వారు మధ్యలోనే వెళ్లిపోతున్నారని టీడీపీ అనుకూల మీడియా ఒకటే ప్రచారం. బీసీ మంత్రుల బస్సు యాత్ర విషయంలోనూ టీడీపీ మీడియా కథనాలు అదే తరహాలో ఉన్నాయి. ఇక వైసీపీ మీడియా మరింత దూకుడుగా ఉంది. చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా జనం రావడం లేదంటూ ఆ […]

ఖాళీ కుర్చీలతో కొట్టుకుంటున్న వైసీపీ, టీడీపీ
X

ఏపీలో రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు ఖాళీ కుర్చీలను విసురుకుంటున్నాయి. రెండుగా చీలిన మీడియా.. ప్రత్యర్థి పార్టీ సమావేశం జరిగితే చాలు.. ఖాళీ కుర్చీల కోసం ఎదురుచూస్తోంది. జగన్ మీటింగ్‌కు వచ్చిన వారు మధ్యలోనే వెళ్లిపోతున్నారని టీడీపీ అనుకూల మీడియా ఒకటే ప్రచారం. బీసీ మంత్రుల బస్సు యాత్ర విషయంలోనూ టీడీపీ మీడియా కథనాలు అదే తరహాలో ఉన్నాయి. ఇక వైసీపీ మీడియా మరింత దూకుడుగా ఉంది. చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా జనం రావడం లేదంటూ ఆ మీడియా ప్రచారం చేస్తోంది. మహానాడులో చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలోనే కార్యకర్తలు వెళ్లిపోయారని, ఖాళీ కుర్చీలే దర్శనం ఇచ్చాయని లేటెస్ట్‌గా జగన్ పత్రిక ప్రచురించింది.

రెండు వర్గాల మీడియా కథనాల్లోనూ వాస్తవం ఉంది. జగన్‌ సభలకు వస్తున్న జనం కూడా మధ్యలో వెళ్లిపోతున్నారు. చంద్రబాబుదీ అదే స్థితి. ఎందుకిలా?. నిజానికి సీఎంగా ఎవరున్నా సభలకు ఎక్కువగా డ్వాక్రా మహిళలను అధికారులు తీసుకొస్తుంటారు. వచ్చామా వెళ్లామా అన్నట్టుగా వారి తీరు ఉంటుంది. అందుకే ఏ సీఎం ఉన్నా సభ మధ్య నుంచి మహిళలు వెళ్లిపోవడం కామన్. పైగా అటు చంద్రబాబు గానీ, ఇటు జగన్‌ కానీ ప్రజలను కట్టిపడేసేంత గొప్ప వక్తలు కాదు. వారి ప్రసంగంలో పెద్దగా కొత్తదనం ఉండదన్న ఒక అభిప్రాయం ప్రజల్లో ఉంది. అందుకే వారు మాట్లాడుతున్నా వినేందుకు జనంలో ఆసక్తి తగ్గింది.

జగన్‌ వీలైనంత వరకు కాగితాలను చూసి ప్రసంగం చేస్తుంటారు. ఆ ప్రసంగాలు రాసే వారు కూడా పూర్తి నాసిరకంగా తయారైనట్టు.. జగన్‌ ప్రసంగాలు చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి సభలోనూ జగన్‌ది ఒకే ప్రసంగం. అందుకే జగన్‌ ప్రసంగాలను ప్రత్యేకంగా వినే వారి సంఖ్య తగ్గుతోంది. ఇక చంద్రబాబు స్పీచ్‌లు బోర్‌కు వచ్చి చాలాకాలం అయింది.

తెలుగు రాష్ట్రాల్లో సభలకు వచ్చిన ప్రజలను ఎంతసేపైనా తన ప్రసంగాలతో కూర్చోబెట్టి వాగ్ధాటి ఒక్క కేసీఆర్‌ దగ్గర మాత్రమే కనిపిస్తుంది. జగన్‌, చంద్రబాబు సభలకు వచ్చే జనం మధ్యలో వెళ్లిపోవడానికి వారి ప్రసంగాల్లో కొత్తదనం లేకపోవడం ఒక కారణం. ఇక్కడ ఒక తేడా ఉంది. చంద్రబాబు ప్రసంగాలు రాజకీయ పార్టీ ప్రమోషన్‌లో భాగంగా చేస్తున్నవి. జగన్‌ సభలు ముఖ్యమంత్రి హోదాలో జరుగుతున్నాయి. ఆ సభకు కార్యకర్తల కంటే డ్వాక్రా మహిళలు ఎక్కువగా తరలివస్తుంటారు. జగన్ రాజకీయ యాత్రలు మొదలుపెడితే అప్పుడు జనస్పందన ఎలా ఉంటుంది అన్నది చూడాలి.

First Published:  27 May 2022 8:44 PM GMT
Next Story