Telugu Global
NEWS

తండ్రి గారు.. ఇక తప్పుకోండి !..

మహానాడు వేదికగా మీడియా ప్రతినిధుల చిట్‌చాట్‌లో నారా లోకేష్‌ చేసిన ప్రతిపాదనలు ఆసక్తిగా ఉన్నాయి. వరుసగా మూడు సార్లు ఎన్నికల్లో ఓడిన వారికి టికెట్ ఇవ్వకూడదని భావిస్తున్నట్టు నారా లోకేష్ చెప్పారు. అదే అమలైతే సోమిరెడ్డితో పాటు చాలా మంది సీనియర్లు ఇక విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ విషయం పక్కన పెడితే పార్టీ పదవులపైనా లోకేష్ వ్యాఖ్యలు చేశారు. పార్టీ పదవులను పట్టుకుని వేలాడడం సరికాదని, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రెండు సార్లు […]

తండ్రి గారు.. ఇక తప్పుకోండి !..
X

మహానాడు వేదికగా మీడియా ప్రతినిధుల చిట్‌చాట్‌లో నారా లోకేష్‌ చేసిన ప్రతిపాదనలు ఆసక్తిగా ఉన్నాయి. వరుసగా మూడు సార్లు ఎన్నికల్లో ఓడిన వారికి టికెట్ ఇవ్వకూడదని భావిస్తున్నట్టు నారా లోకేష్ చెప్పారు. అదే అమలైతే సోమిరెడ్డితో పాటు చాలా మంది సీనియర్లు ఇక విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ విషయం పక్కన పెడితే పార్టీ పదవులపైనా లోకేష్ వ్యాఖ్యలు చేశారు.

పార్టీ పదవులను పట్టుకుని వేలాడడం సరికాదని, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రెండు సార్లు వరుసగా ఒకే పదవిలో ఉన్నవారికి బ్రేక్ అవసరమని వ్యాఖ్యానించారు. రెండు పర్యాయాలు ఒకే పదవిలో ఉన్న వారు… పైస్థాయికి అయినా వెళ్లాలి, లేదా కిందకైనా రావాలి, లేదంటే బ్రేక్‌ తీసుకోవాలని లోకేష్ వ్యాఖ్యానించారు. తాను కూడా జాతీయ ప్రధాన కార్యదర్శిగా మూడుసార్లు పనిచేశాను కాబట్టి.. బ్రేక్ తీసుకుని మరొకరికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు చెప్పారు.

లోకేష్ ప్రతిపాదనను ప్రజాస్వామికంగా పార్టీలో అందరికీ వర్తింప చేస్తే… మరి చంద్రబాబు పరిస్థితి ఏంటి?. ఆయన ఎప్పటి నుంచో అధ్యక్షుడిగా ఉన్నారు. 2015లో తనకు తాను జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించుకుని పార్టీలో తీర్మానం చేయించుకున్నారు. 2014 ఎన్నికలు గెలిచిన ఊపులో… చుట్టూపక్కల రాష్ట్రాలన్నింటిలోనూ టీడీపీ విస్తరిస్తుందని చంద్రబాబు ప్రకటించుకున్నారు. జాతీయ అధ్యక్షుడి హోదాలో అలా విస్తరించకపోగా… తెలంగాణలోనూ ఎన్టీఆర్‌ ట్రస్ట్ భవన్‌ను అద్దెకు ఇచ్చే పరిస్థితి తెచ్చేశారు.

మరి నారా లోకేష్ చెబుతున్న దాని ప్రకారం.. చంద్రబాబు ఇంకా పైకి అయినా వెళ్లాలి, లేదా కిందకైనా దిగాలి, లేదా బ్రేక్ తీసుకోవాలి. ఇంకా పైకి అంటే అంతర్జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించడం సాధ్యం కాదు. కిందకు దింపడం అంటే అవమానించినట్టు అవుతుంది. మరి తండ్రిగారు కొద్దికాలం బ్రేక్ తీసుకోండి అని లోకేష్ చెప్పగలరా?. పైగా యువకుడైన నారా లోకేష్‌ వీలైనంత వరకు మరింత ముందుకెళ్లాలి, ఉన్నత పదవుల్లోకి ప్రమోట్ అవాలి.. అలా కాకుండా జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాకే బ్రేక్ తీసుకుంటే ఎలా?.

టీడీపీ వాస్తవ పరిస్థితి ఏమిటంటే.. గీతలు గీసుకుని రాజకీయం చేసేంత వెసులుబాటు ఆ పార్టీకి ప్రస్తుతం లేదు. టీడీపీ వచ్చే ఎన్నికల్లో మునిగినా, తేలినా.. అది చంద్రబాబు చేతుల మీదుగానే జరగాల్సిన అనివార్య పరిస్థితి. కాబట్టి నారా లోకేష్ చేసిన రెండు ప్రతిపాదనలు అమలు కష్టమే. లోకేష్ మాత్రం స్వీయప్రకటనకు కట్టుబడి పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శిగా మిగిలే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ పదవికాలం కూడా వచ్చే ఏడాది మార్చితో ముగుస్తోంది.

First Published:  28 May 2022 12:15 AM GMT
Next Story