Telugu Global
NEWS

టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. యుద్ధం మొదలైనట్టే..

తెలంగాణలో కాంగ్రెస్ ని బీజేపీ దాదాపుగా డామినేట్ చేస్తోంది. కేవలం ముగ్గురంటే ముగ్గురు ఎమ్మెల్యేల బలమున్న బీజేపీ.. వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకుంటామంటోంది. తెలంగాణపై బీజేపీ అధినాయకత్వం కూడా ఫోకస్ పెంచింది. నెలరోజుల వ్యవధిలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. తెలంగాణలో పర్యటించారు. తాజాగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని మోదీ.. టీఆర్ఎస్ ను టార్గెట్ చేశారు. తెలంగాణలో తాము […]

trs-bjp
X

తెలంగాణలో కాంగ్రెస్ ని బీజేపీ దాదాపుగా డామినేట్ చేస్తోంది. కేవలం ముగ్గురంటే ముగ్గురు ఎమ్మెల్యేల బలమున్న బీజేపీ.. వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకుంటామంటోంది. తెలంగాణపై బీజేపీ అధినాయకత్వం కూడా ఫోకస్ పెంచింది. నెలరోజుల వ్యవధిలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. తెలంగాణలో పర్యటించారు. తాజాగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని మోదీ.. టీఆర్ఎస్ ను టార్గెట్ చేశారు. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. కుటుంబ పార్టీల పాలనకు చరమగీతం పాడాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

రెచ్చగొట్టే వ్యాఖ్యలతో అధికారం వస్తుందా..?

టీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో మత కల్లోలాలు దాదాపు అదుపులో ఉన్నాయనే చెప్పాలి. అయితే బీజేపీ మాత్రం ఎప్పటికప్పుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఇక్కడ అలజడి సృష్టించాలనే ఆలోచనలో ఉంది. తాము అధికారంలోకి వస్తే మైనార్టీలకు ఉన్న రిజర్వేషన్లు తొలగిస్తామన్నారు అమిత్ షా. ఎంఐఎం సపోర్ట్ తోనే తెలంగాణపై టీఆర్ఎస్ పెత్తనం చలాయిస్తోందని మండిపడ్డారు. ప్రధాని మోదీ కూడా తెలంగాణ బీజేపీ పోరాటాలపై సంతృప్తి వ్యక్తం చేయడంతో.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోని మసీదులన్నిటినీ తవ్వేస్తామని, సమాధులు కనపడితే వాటిని ముస్లింలకే వదిలేస్తామని, శివలింగాలు కనపడితే హిందువులు స్వాధీనం చేసుకుంటారని చెప్పారు బండి సంజయ్. ఇలాంటి వ్యాఖ్యలతో రాజకీయ లాభం ఉంటుందని అంచనా వేయలేం కానీ.. బీజేపీ అధికారంలోకి రావడానికి హిందూత్వాన్నే నమ్ముకోవడం విశేషం.

కాంగ్రెస్ పని గల్లంతేనా..?

2018 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ 19 స్థానాలు గెలుచుకుంది. అయితే ఇప్పుడు కేవలం ఆరుగురు మాత్రమే కాంగ్రెస్ లో మిగిలారు. మిగతావారంతా టీఆర్ఎస్ లోకి ఫిరాయించారు. 2018 ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒకే ఒక్క సీటు గెలుచుకుంది. అయితే రెండు బై ఎలక్షన్లలో తమ అభ్యర్థులను గెలిపించుకుని మూడు స్థానాలకు ఎగబాకింది. కాంగ్రెస్ క్రమక్రమంగా బలహీనపడుతుంటే, బీజేపీ బలం పెంచుకుంటోంది. రాహుల్ గాంధీ సభలతో కాంగ్రెస్ హడావిడి సృష్టిస్తున్నా కూడా.. ప్రస్తుతం తెలంగాణలో పోటీ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగానే ఉంది.

బీజేపీది మేకపోతు గాంభీర్యమేనా..?

సింగిల్ సీట్ నుంచి మూడు సీట్లకు అసెంబ్లీలో తమ బలం పెంచుకున్న బీజేపీ.. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ కి చెమటలు పట్టించింది. అయితే రాష్ట్రంలో అధికారంలోకి రావడం మాత్రం వారికి కష్టసాధ్యమేనని చెప్పాలి. ఇప్పుడు టీఆర్ఎస్ తో బీజేపీకి కొత్త చిక్కొచ్చిపడింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధమయ్యారు. దేశవ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెసేతర కూటమికోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలను కలుస్తూ.. మంతనాలు సాగిస్తున్నారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీని ఇరుకున పెట్టాలనే ఆలోచనతో కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ని తెలంగాణలో నిలువరించడంతోపాటు, దేశవ్యాప్తంగా కేసీఆర్ హవాని ఎదుర్కోవడం కూడా బీజేపీకి తలనొప్పిగా మారింది. అందుకే వారు తెలంగాణపై ఎక్కువ దృష్టిపెట్టారు. కేసీఆర్ ఆలోచనలు తెలంగాణకై పరిమితం అయ్యేలా వ్యూహ రచన చేస్తున్నారు.

Next Story