Telugu Global
NEWS

భళా! భారత కుర్రాళ్లు.. ఆసియాకప్ హాకీ గోల్‌ల‌ సునామీ

జకార్తా వేదికగా జరుగుతున్న 2022 ఆసియాకప్ హాకీటోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ సంచలన విజయం సాధించింది. మిశ్రమఫలితాలతో నాకౌట్ రౌండ్ ఆశల్ని క్లిష్టంగా మార్చుకొన్న భారత యువజట్టు గ్రూప్-ఏ లీగ్ నుంచి సూపర్ -4 సమరానికి అర్హత సంపాదించింది. ఆతిథ్య ఇండోనీషియాపై భారత్ సాధించిన అతిపెద్ద విజయంతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్ర్రమించక తప్పలేదు. లక్ష్యం 15.. సాధించినవి 16 గోల్స్.. ఆసియా పురుషుల హాకీలో అత్యుత్తమజట్లు తలపడుతున్న 2022 ఆసియాకప్ టోర్నీలో భారత్ […]

asia cup hockey
X

జకార్తా వేదికగా జరుగుతున్న 2022 ఆసియాకప్ హాకీటోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ సంచలన విజయం సాధించింది. మిశ్రమఫలితాలతో నాకౌట్ రౌండ్ ఆశల్ని క్లిష్టంగా మార్చుకొన్న భారత యువజట్టు గ్రూప్-ఏ లీగ్ నుంచి సూపర్ -4 సమరానికి అర్హత సంపాదించింది. ఆతిథ్య ఇండోనీషియాపై భారత్ సాధించిన అతిపెద్ద విజయంతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్ర్రమించక తప్పలేదు.

లక్ష్యం 15.. సాధించినవి 16 గోల్స్..
ఆసియా పురుషుల హాకీలో అత్యుత్తమజట్లు తలపడుతున్న 2022 ఆసియాకప్ టోర్నీలో భారత్ ఎక్కువమంది యువఆటగాళ్లతో..సర్దార్ సింగ్ చీఫ్ కోచ్ గా బరిలోకి దిగింది. జపాన్, పాకిస్థాన్, ఇండోనీసియా ప్రత్యర్థులుగా ఉన్న గ్రూప్- ఏ లీగ్ మొదటి రెండురౌండ్ల మ్యాచ్ ల్లో భారత్ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో ముగిసిన తొలి మ్యాచ్ ను 1-1తో డ్రాగా సరిపెట్టుకొన్న భారత్ కు..రెండో రౌండ్లో జపాన్ చేతిలో 2-5 గోల్స్ భారీ ఓటమి ఎదురయ్యింది. దీంతో .నాలుగుజట్ల సూపర్-4 రౌండ్ కు అర్హత సాధించాలంటే భారత్ తన ఆఖరి గ్రూప్ పోరులో ఇండోనీసియాను 15-0 గోల్స్ తేడాతో ఓడించి తీరాల్సి ఉంది. 14 గోల్స్ తో నెగ్గినా టోర్నీ నుంచి నిష్క్ర్రమించక తప్పదు.

గోల్స్ వర్షం..
ఆసియా హాకీలో పసికూనగా పేరున్న ఆతిథ్య ఇండోనీసియాతో జరిగిన ఏకపక్ష పోరులో భారత కుర్రాళ్లు చెలరేగిపోయారు. కసిగా ఆడి గోల్ ల పండుగ చేసుకొన్నారు. ఆట మొదటి భాగానికే 6-0 గోల్స్ ఆధిక్యంలో నిలిచిన భారత్..రెండో భాగంలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 10 గోల్స్ సాధించడం ద్వారా 16-0 గోల్స్ తో అతిపెద్ద విజయం నమోదు చేసింది. భారత ఆటగాళ్లలో డిస్పాన్ టిర్కే, అబారన్ సుదేవ్ మెరుపుదాడులతో గోల్ ల వర్షం కురిపించారు. డిస్పాన్ టిర్కే 5 గోల్స్, సుదేవ్ 3 గోల్స్, సునీల్, పవన్ రాజ్ బీర్, కార్తీ సెల్వమ్ తలో రెండు గోల్స్, ఉత్తమ్ సింగ్, నీలం సంజీవ్ చెరో గోలు సాధించారు.

ఒకే దెబ్బకు రెండు పిట్టలు..
అంతకుముందు జపాన్ తో జరిగిన ఆఖరిరౌండ్ మ్యాచ్ లో పాకిస్థాన్ 2-3 గోల్స్ తేడాతో ఓటమి పొందటం ద్వారా 4 పాయింట్లతో భారత్ తో సమఉజ్జీగా నిలిచింది. గ్రూప్-ఏలో జపాన్ మూడుకు మూడుమ్యాచ్ లు నెగ్గడం ద్వారా టాపర్ గా సూపర్-4 రౌండ్ చేరితే..గ్రూప్ లో రెండోస్థానం కోసం భారత్, పాక్ తలపడ్డాయి.
పాక్ ను అధిగమించాలంటే భారత్ తన గ్రూపు ఆఖరిమ్యాచ్ లో నెగ్గటమే కాదు..15 గోల్స్ సాధించితీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇండోనీసియాతో పోరులో భారత కుర్రాళ్లు అసాధారణంగా రాణించడం ద్వారా ఆసియాకప్ చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేయగలిగారు. భారత్ ఈ విజయం ద్వారా గోల్స్ సగటున పాక్ ను అధిగమించి నాకౌట్ రౌండ్ కు చేరుకోగలిగింది. అంతర్జాతీయ హాకీలో భారత కుర్రాళ్లు సాధించిన అతిపెద్ద విజయాలలో 16-0 గోల్స్ విజయం కూడా ఒకటిగా మిగిలిపోతుంది. సూపర్ -4 రౌండ్లో జపాన్, కొరియా, మలేసియా, భారతజట్లు తలపడనున్నాయి.

First Published:  26 May 2022 11:48 PM GMT
Next Story