Telugu Global
NEWS

'రెడ్డి' అంటే.. కులమా ! పౌరుషమా !!

రెడ్డి అంటే కులం కాదు, పౌరుషం, త్యాగం అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖల మంట ఇప్పుడప్పుడే చల్లారేలా లేదు. ఆ పార్టీలోని ఎస్.సీ,బీసీలే కాకుండా రెడ్డి నాయకులు కూడా రేవంత్ పై విరుచుకుపడుతున్నారు. ఇలాంటి పరిస్థితి కోసమే, రేవంత్ ను ఇరుకున పెట్టడం కోసమే కొంతమంది కాచుకొని ఉన్నారు.అట్లా కాచుకున్న వారిలో కొందరు తెర ముందు,మరికొందరు తెర వెనుక కనిపిస్తున్నారు.” నా వ్యాఖ్యలను వక్రీకరించారు. బిసి,ఎస్.సీ,ఎస్.టిల సంక్షే మానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది. […]

రెడ్డి అంటే.. కులమా ! పౌరుషమా !!
X

రెడ్డి అంటే కులం కాదు, పౌరుషం, త్యాగం అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖల మంట ఇప్పుడప్పుడే చల్లారేలా లేదు. ఆ పార్టీలోని ఎస్.సీ,బీసీలే కాకుండా రెడ్డి నాయకులు కూడా రేవంత్ పై విరుచుకుపడుతున్నారు. ఇలాంటి పరిస్థితి కోసమే, రేవంత్ ను ఇరుకున పెట్టడం కోసమే కొంతమంది కాచుకొని ఉన్నారు.అట్లా కాచుకున్న వారిలో కొందరు తెర ముందు,మరికొందరు తెర వెనుక కనిపిస్తున్నారు.” నా వ్యాఖ్యలను వక్రీకరించారు. బిసి,ఎస్.సీ,ఎస్.టిల సంక్షే మానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది. సోషల్ ఇంజనీరింగ్ ను రక్షించాలన్నది కాంగ్రెస్ ధ్యేయం.” అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.కానీ జరగవలసిన నష్టం జరిగిపోయింది. పార్టీ లోని ఆయన ప్రత్యర్థుల కళ్ళలో ఆనందం కనిపిస్తోంది.

రేవంత్ ఉద్దేశాలపై ఎవరికీ స్పష్టత లేదు.కానీ ఆయన పథకం ప్రకారమే ఈ నిప్పును రాజేసినట్టు కనిపిస్తుంది.తన ఎజండా అమలులో భాగంగానే ‘రెడ్డి’ కులాన్ని ఆకాశానికెత్తారని,అన్ని రాజకీయపక్షాలలో ఉన్న రెడ్లను సమీకృతం చేయాలన్న టార్గెట్ తోనే ఇలా మాట్లాడారని కొన్ని విశ్లేషణలు సాగుతున్నవి.

తెలంగాణలో రెడ్డి వర్సెస్ వెలమ రాజకీయాలు కొత్తవి కావు.రేవంత్ వ్యాఖ్యలతోనే అవి తెరపైకి రాలేదు.తెలంగాణ రాజకీయమంతా ఈ రెండు అగ్రకులాల కేంద్రంగా సాగుతున్న సంగతి రహస్యమేమీ కాదు. అయితే ఇందులో ఒక కులం ఒక ప్రాంతీయపార్టీని నడిపిస్తుండగా, ఇంకో కులం మరొక జాతీయపార్టీకి రాష్ట్రంలో సారధ్యం వహిస్తోంది. రెడ్డి,వెలమ,కమ్మ వంటి అగ్రకులాల జనాభా శాతం ఎంత?ఈ కులాలకే రాజ్యాధికారం ఎందుకు లభిస్తోంది ? వంటి అంశాలు మేధో చర్చకు మాత్రమే పనికొస్తాయి. పోలింగ్ బూత్ స్థాయిలో ఓటర్ల మనోభావాలు, ఎన్నికల సమయంలో వారిని ప్రభావితం చేసే అంశాలు, పార్టీల ఓటు బ్యాంకు రాజకీయాలకు సంబంధించిన సమస్యలు వేరు.సరిగ్గా ఎన్నికలు సమీపించే వేళ అప్పటికప్పుడు ‘చెలరేగే’ కొన్ని భావోద్వేగ ఘటనలు మొత్తం ఫలితాలనే తారు మారు చేయవచ్చు.

దేశ జనాభాలో సగానికిపైగా బీసీ కులాల వాళ్ళే.కానీ రాజ్యాధికారం వాళ్లకు రాదు.అందుకు కారణం వాండ్లలో అనైక్యత.బిసిల్లోనే కొన్ని కులాలు ‘క్రీమీ లేయర్’గా ఉన్నవి.కాపు,గౌడ,యాదవ్ తదితర కులాల మనుషులు అగ్రవర్ణాలతో పోటీ పడుతున్నారు. వ్యవసాయం,రియల్ ఎస్టేట్, ఎక్సయిజ్ , పరిశ్రమలు, సినిమాలు, కాంట్రాక్టులు,రాజకీయాల్లో.. ‘ఆధిపత్యం’ సంపాదించేం దుకు రేసులో పరుగెడుతున్నారు.షెడ్యూల్డ్ కులాల్లోనూ సేమ్ టు సేమ్. ఎస్సీలలో ‘క్రీమీలేయర్’గా ఉన్న ‘మాల’లు అన్ని అవకాశాలను తన్నుకుపోతున్న సందర్భాలను, సంఘటనలను చూస్తూ ఉన్నాం. అందుకే ‘మాదిగ’ల పోరాటాలు జరుగుతున్నవి.

అయితే బీసీలు, ఎస్.సీ.లలో దశాబ్దాలుగా నాటుకుపోయిన ‘బానిస’ మనస్తత్వం వల్ల కావచ్చు, లేదా సంకల్పబలం లేకపోవడం వల్ల కావచ్చు, ఆత్మవిశ్వాసం కొరత కావచ్చు,పిరికితనం కావచ్చు,పిసినారితనం కావచ్చు.. ఎంత సంపదను కూడబెట్టు కున్నా,అగ్రకులాలతో పోటీగా వనరులను కబళించినా,రాజకీయ రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగినా సాధారణంగా వాళ్ళు అగ్రకుల నాయకత్వం ఆధిపత్యాన్ని ఆమోదిస్తూ వస్తున్నారు. అగ్రకుల నాయకుల ‘నీడ’లో అనుచరులుగా ఉండిపోవడానికే పరిమితమవుతున్నారు. సొంతంగా బలపడాలని గానీ,బలగాలను తయారు చేసుకోవాలని గానీ వారు సిద్ధపడడం లేదు. తామెందుకు ముఖ్యమంత్రి పదవిని దక్కించుకోకూడదన్న ఆలోచన లేకపోవడం, అలాంటి ఆలోచనలు, ఆకాంక్షలు ఉన్నా అవి నెరవేరవేమోనన్న భయంతోనూ ‘అగ్రకులాల’కు జై కొడుతున్నారు.

సాధారణంగా ఎన్నికల సమయంలో బీసీల రాజ్యాధికారం అంశం చర్చకు వస్తుంది.టీవీ చానళ్లలో డిబేట్లు వేడిగా,వాడిగా జరుగుతాయి.ఎన్నికలు ముగిశాక ‘రాజ్యాధికారం’ డిమాండ్ కనుమరుగ వుతుంది.దేశంలో రాజ్యాధికారంలో ఉన్న వ్యక్తులు ఎవరు ? వారి సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ నేపథ్యం ఏమిటి? కులాల ప్రాతిపదికన జనాభా శాతం ఎంత? అనుభవిస్తున్న పదవుల శాతం ఎంత? ఈ ప్రశ్నలకు జవాబులన్నీ ప్రజలకు తెలియనిది కాదు.కానీ ‘నిర్ణయాధికారం’ సామాన్య ఓటర్ల చేతుల్లో లేదు.’సామాజిక న్యాయం’ ఎజండాతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మెగాస్టార్ చిరంజీవి ‘ప్రజారాజ్యం’ పార్టీ ఎంతకాలం మనుగడలో ఉన్నదో మనకు తెలుసు.పార్టీని నడపలేక చేతులెత్తేసి కాంగ్రెస్ పార్టీలో ‘ప్రజారాజ్యం’ను విలీనం చేసిన సందర్భం ఒక ట్రాజెడీ ! చిరంజీవి అలాగే ‘ ఓర్పు – నేర్పు ‘తో రాజకీయాల్లో కొనసాగితే ఎట్లా ఉండేదో !!

ఇదివరకే ఎవరైనా వేసిన దారిలో నడవడం చాలా సౌకర్యంగానూ,సుఖంగానూ ఉంటుంది.కొత్తగా రహదారిని నిర్మించడం చాలా కష్టం.ఎలాంటి ఒడిదుడుకులనైనా,కష్ట నష్టాలనైనా ఎదుర్కోగల ధైర్యసాహసాలు ఉన్నవాళ్లు,సంకల్ప బలం మెండుగా ఉన్నవాళ్లు, తెగువ చూపగల వారు అలాంటి పని చేయగలరు. ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేసే వ్యూహమూ, ఎత్తుగడలు పుష్కలంగా ఉన్నవారు మాత్రమే ఒక ‘కొత్త వంతెన’ను నిర్మించగలరు.అలాంటి వారిలో ఒక కేసీఆర్,ఒక జగన్,మమతా బెనర్జీ వంటి నాయకులను చూడవచ్చు. అందరూ నడచిన దారిలో నడవకుండా సొంత బలాన్ని,బలగాలను కూడగట్టుకొని రాష్ట్రాలలో ‘రాజ్యాధికారం’సాధించిన వారుగా చరిత్రలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని కేసీఆర్ వంటి వారే నమోదు చేసుగోగలరు.

బీసీ మేధావులు,రాజకీయ నాయకులు, ప్రొఫెసర్లు, కవులు, కళాకారులు, రచయితలు, బీసీ సంఘాల్లోని కులపెద్దలు, విద్యార్థులు ఏమి చేస్తున్నట్టు? బహుజన రాజ్యాధికారం కోసం ఎస్సి,ఎస్టీ,బీసీ,మైనారిటీలను కలుపుకొనిపోగల ఒక భావజాలాన్ని ఎందుకు తయారుచేయలేక పోతున్నారు? ఒక రోడ్ మ్యాపును ఎందుకు రూపొందించుకోలేకపోతున్నారు? ‘ ఓట్లు మావి సీట్లు మీకా ‘ అనే బలమైన నినాదంతో వచ్చిన బహుజన సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేసింది.కానీ తర్వాత ఆ పార్టీ కుడా ‘ అధికారం’ కోసం అగ్రవర్ణాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ఆ పార్టీ తన సైద్ధాంతిక మూలాలను తుంగలో తొక్కడం మరొక విషాదం!!

కాగా రెడ్డి కులానికి చెందిన టీపీసీసీ చీఫ్ రేవంత్ తన మనసులో మాటను బయటపెట్టారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ‘రెడ్డి’ సామాజికవర్గానికే దక్కాలన్నది ఆయన అభిలాష.నేరుగా చెప్పాలంటే తాను ముఖ్యమంత్రి కావాలన్నది రేవంత్ ఆకాంక్ష! అధికారం కోసమే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నా,ఆ వాదనల్లో డొల్లతనం ఏమున్నది?అధికారం కోసమే రేవంత్ పావులు కదుపుతున్నారు.సక్సెస్ రేటు ఎంత ఉంటున్నది వేరే చర్చ. అన్ని రాజకీయ పక్షాలలో ఉన్న ‘రెడ్ల’ను ఆయన ఆకర్షిస్తున్నారు. తనకంటూ ఒక ఒరవడిని,ఒక పంథాను నిర్మించుకునే ప్రయత్నాల్లో రేవంత్ రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డి ‘నేర చరిత్ర’ గురించి చెదురుమదురుగా ప్రత్యర్థులు మాట్లాడుతూ ఉంటారు.అయితే ఇలాంటి ప్రచారం ‘వర్కవుట్’ కాదు. నేర చరితులను, మొండివాళ్లను మాత్రమే ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నట్టు ఎన్నికల రాజకీయాల చరిత్ర చెబుతోంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 10 మంది ముఖ్యమంత్రులు రెడ్డి కులస్థులేనన్నది రేవంత్ చెప్పకపోయినా అందరికీ తెలిసిన చరిత్రే.రెడ్లను కాంగ్రెస్ ఆకర్షిస్తోంది.కాంగ్రెస్ ను రెడ్లే కాపాడుకుంటూ వస్తున్నారు.ఆ పార్టీలో రెడ్లకు లభిస్తున్న ప్రాధాన్యం మరో కులానికి,మరో జాతికీ లభించడం లేదన్నది సత్యం.ఇందుకు అనేక చారిత్రక కారణాలున్నవి. కులం పేరు చెప్పుకుని కొందరు రాజ్యాన్ని ఏలాలని భావిస్తున్నట్టు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే హుజురాబాద్ ఉపఎన్నిక సందర్భంగా బీసీ నాయకుడు ఈటల రాజేందర్ ను ఓడించడంలో భాగంగా ఆ నియోజకవర్గంలో ‘రెడ్లను సంఘటితం’ చేయడానికి తాను చేసిన ప్రయత్నాలను పల్లా అంత తొందరగా మరచిపోతే ఎలా? వ్యూహాత్మకంగా రెడ్డి సామాజికవర్గాన్ని పూర్తిగా కాంగ్రెస్‌కు అనుకూలంగా మార్చడమే కాకుండ వెలమల పెత్తనం ఏమిటన్న అభిప్రాయం కల్పించడానికి టీపీసీసీ అధ్యక్షుడు ప్రయత్నిస్తున్నారు.

కాగా ”బడుగుల, బలహీన వర్గాల మనోభావాలు దెబ్బతీసేలా పీసీసీ అధ్యక్ష హోదాలో మాట్లాడడం తగదు. పీసీసీ అధ్యక్షుడిగా మీకు పర్సనల్, ప్రవేట్, పబ్లిక్ అంటూ ఏమీ ఉండదు. మీరు ఎక్కడ మాట్లాడినా, ఏ వ్యాఖ్యలు చేసినా వాటిని పీసీసీ అధ్యక్షుడు మాటలుగానే మీడియా, ప్రజలు గుర్తిస్తారు. మీరు మాట్లాడే ప్రతి మాటను ఆలోచనతో కూడా ఉండాలి. మీరు చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే అన్ని వర్గాల్లో వ్యతిరేకత వస్తోంది. దీనిని నివారించడానికి మీరు వెనువెంటనే పత్రికా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇవ్వడంతో పాటు, అధినాయకత్వానికి విధేయత ప్రకటించాలి. పార్టీలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాల్లో ఏర్పడ ఆందోళనను గందరగోళాన్ని నివృత్తి చేయాలి” అని రేవంత్ కు హితబోధ చేస్తూ టీపీసీసీ ప్రచారకమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ అమెరికా న్యూ జెర్సీ నుంచి ఒక లేఖను బహిరంగంగా విడుదల చేశారు.

బహిరంగ లేఖ ద్వారా మధుయాష్కీ ఏమి సాధించదలుచుకున్నారు? ‘‘మా రెడ్లకిందనే పనిచేయాలి.. రెడ్లకు మాత్రమే రాజ్యాధికారం, మాకు మాత్రమే సత్తా ఉంది’’ అంటూ రేవంత్ మాట్లాడారని రాహుల్ గాంధీకి సన్నిహితునిగా గుర్తింపు పొందిన మాజీ ఎంపీ మధుయాష్కీ తీవ్రంగా ఆక్షేపించారు. మధుయాష్కీ అమెరికాలో ఏమి చేస్తున్నారని ఎవరూ అడగరు? ఎందుకంటే ఆయన అక్కడే ఎక్కువ సమయం గడుపుతారని, కాంగ్రెస్ లో ‘పార్ట్ టైమ్’ కార్యకలాపాలు నడిపిస్తుంటారని ఉన్న ప్రచారమే!

విద్యాధికుడు, అమెరికాలో న్యాయవాద వృత్తిని కొనసాగిస్తూ, సంపన్నుడుగా మారిన మధుయాష్కీ 2004 లో ‘పారాచూట్’ రాజకీయ నాయకునిగా రావడం,లోక్ సభకు ఎన్నిక కావడం తెలియనిది కాదు.ఆ తర్వాత ఏఐసీసీ పదవులూ లభించాయి. రాహుల్ గాంధీ ‘కోటరీ’ మనిషిగానూ ముద్ర వేసుకున్నారు.కానీ ఆయన ఒక విఫల రాజకీయ నాయకుడు.ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పట్టు సాధించలేకపోయారు.బీసీలకు చెందిన మధుయాష్కీ ‘ఫుల్ టైం’రాజకీయాలు నడపగలిగితే,అవసరమైన సందర్భాల్లో డబ్బు వంటి వనరులను ఖర్చు పెట్టగలిగితే ఆయనకే పీసీసీ సారధ్యం లభించి ఉండేది కదా ! అప్పుడు ఆయన ఆధ్వర్యంలోనే ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిస్తే ముఖ్యమంత్రి పదవి మధుయాష్కీని వెతుక్కుంటూ వస్తుంది కదా ! ”మీ వ్యాఖ్యలపై దళితులు,బీసీలలో అలజడి మొదలైంది. ఆ వర్గాలు అట్టుడికి పోతున్నాయి.” అని రేవంత్ ను ఉద్దేశించి మధుయాష్కీ అన్నారు. కానీ తానే కాంగ్రెస్ లో క్రియాశీల భూమిక పోషించాలని మధుయాష్కీ ఎందుకనుకోరు? రేవంత్ కు పోటీగా లేదా సమాంతరంగా పనిచేస్తే దళితులు, బలహీనవర్గాలు, మైనారిటీలను ఆకట్టు కోవచ్చు. మరి సమస్య ఏమిటి? చొరవ లేదా ? డబ్బు లేదా ?ధైర్యం లేదా ?

అందువల్ల మంచి అయినా,చెడు అయినా నిరంతరం రేవంత్ రెడ్డి వార్తల్లో ఉంటున్నారు. ఆయన దూకుడు లేదా దుందుడుకు స్వభావం వల్ల ఆ పార్టీ నుంచి బీజేపీలో వలసలకు బ్రేకు పడిన మాట నిజం !!

ALSO READ: టమోటాలు చీప్ గా ఇస్తాం సార్.. మరి మా సంగతేంటి?

First Published:  27 May 2022 3:38 AM GMT
Next Story