Telugu Global
NEWS

అప్పుడు కమ్మలు, రెడ్లు...ఇప్పుడు కాపులు

అమలాపురం సంఘటన మెరుపు వ్యవహారం కాదు.ఇది కులపరమైన ‘అస్తిత్వ’ సంఘర్షణ! కారంచేడు, చుండూరు, పదిరికుప్పం, నీరుకొండ ఘటనలు ఈ అస్తిత్వ,ఆధిపత్య ధోరణులకు తొలి దశగా చెప్పుకోవాలి.తాజాగా కోనసీమలో జరిగిన తాజా హింసాకాండ రెండో దశగా భావించాలి. కారంచేడు,చుండూరు తదితర ఘటనలు దళితులను అణచివేసేందుకు ‘కమ్మ’, రెడ్డి సామాజికవర్గాలు జరిపిన ‘హింస’ గా రుజువయ్యాయి. మూడు,నాలుగు దశాబ్దాలలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.ఆంధ్రప్రదేశ్ లో అగ్రవర్ణాలుగా ఉన్న ‘కాపు’లు ఆర్ధికంగా,రాజకీయంగా బాగా బలపడ్డారు.కోనసీమ వంటి కొన్ని ప్రాంతాల్లో దళితులు కూడా […]

అప్పుడు కమ్మలు, రెడ్లు...ఇప్పుడు కాపులు
X

అమలాపురం సంఘటన మెరుపు వ్యవహారం కాదు.ఇది కులపరమైన ‘అస్తిత్వ’ సంఘర్షణ! కారంచేడు, చుండూరు, పదిరికుప్పం, నీరుకొండ ఘటనలు ఈ అస్తిత్వ,ఆధిపత్య ధోరణులకు తొలి దశగా చెప్పుకోవాలి.తాజాగా కోనసీమలో జరిగిన తాజా హింసాకాండ రెండో దశగా భావించాలి. కారంచేడు,చుండూరు తదితర ఘటనలు దళితులను అణచివేసేందుకు ‘కమ్మ’, రెడ్డి సామాజికవర్గాలు జరిపిన ‘హింస’ గా రుజువయ్యాయి.

మూడు,నాలుగు దశాబ్దాలలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.ఆంధ్రప్రదేశ్ లో అగ్రవర్ణాలుగా ఉన్న ‘కాపు’లు ఆర్ధికంగా,రాజకీయంగా బాగా బలపడ్డారు.కోనసీమ వంటి కొన్ని ప్రాంతాల్లో దళితులు కూడా సామాజిక,రాజకీయ,ఆర్ధిక రంగాల్లో పోటీ పడుతున్నారు.ఆ ప్రాంతాల్లో దళితులు ముఖ్యంగా ‘మాల’లు కాపులతో సమానంగా ఎదగడం,ఇంకా చెప్పాలంటే అంతకన్నా ఎక్కువగా అవకాశాలను అందిపుచ్చుకోవడం ఒక పరిణామం.ఆర్ధిక స్వావలంబన వల్ల దళితులు ‘కాపు’లకు దీటుగా తయారయ్యారు.దీంతో దళితులు తమను సవాలు చేస్తున్నట్టుగా ‘కాపు’లు అనుకుంటున్నారు. అందువల్ల కాపులు,దళితులకు మధ్య ‘ఆధిపత్య’పోరాటానికి బీజాలు పడ్డాయి.మూడు దశాబ్దాల క్రితమే ఇలాంటి వాతావరణం ఏర్పడింది. దశాబ్దం క్రితమే శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేట‌లో కాపులు దాడి చేసి ఐదుగురు మాలలను చంపేసిన‌ ఘటన మర్చిపోలేము.

దళితులు తమ చెప్పుచేతల్లో ఉండకుండా,చెప్పు కింద రాయిలా పడి ఉండకుండా ఆర్ధిక,రాజకీయ రంగాల్లో తమను అధిగమించి ముందుకువెళ్లడం ‘కాపు’లకు రుచించడం లేదు.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘కాపు’ సామాజికవర్గం వ్యవహారశైలి ,కృష్ణా – గుంటూరు జిల్లాల్లోని ‘కమ్మ’ సామాజికవర్గం వ్యవహారశైలికి ఎంతమాత్రం భిన్నంగా లేకపోవడాన్ని గమనించవచ్చు.అంటే కాపులు కూడా భూస్వామ్య,పెట్టుబడిదారీ లక్షణాలను ఒంట బట్టించుకున్నారు.కాగా సంపన్న వర్గాలుగా చరిత్రలో ఒకటి,రెండు కులాలు మాత్రమే కనిపించేవి.అయితే అనేక కారణాలతో,సామాజికంగా వేగంగా వస్తున్న పెనుమార్పులతో ‘సంపన్న’ వర్గాల సమీకరణలు మారిపోయాయి.అమలాపురం ఘర్షణలకు మూడు కారణాలు కనిపిస్తున్నవి. 1. దళితులు ఆర్ధిక,రాజకీయ రంగాల్లో నిలదొక్కుకోవడం.. 2.తమను నిర్లక్ష్యం చేస్తున్నారని,తమకు ప్రాధాన్యం కొరవడుతున్నదన్న ఆవేదనతో కాపులు రగిలిపోవడం. 3.దళితులకు వ్యతిరేకంగా కాపు,శెట్టిబలిజలు జట్టు కట్టడం.నిజానికి కోనసీమలో బీసీలయిన శెట్టిబలిజలకు,కాపులకు ఎప్పుడూ పొసిగిన దాఖలాలు లేవు.రాజకీయంగా అయినా మరో రకంగా అయినా సరే ! కానీ అమలాపురం కేంద్రంగా ఏర్పడిన కోనసీమ జిల్లాకు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టడాన్ని సహించని కాపులు,శెట్టిబలిజలతో చేతులు కలిపినట్టు అర్ధమవుతున్నది.

జిల్లాల పునర్వవస్థీరకణ సందర్భంగా అల్లూరి సీతారామరాజు, సత్యసాయి,అన్నమయ్య వంటి ప్రముఖుల పేర్లు జిల్లాలకు పెట్టారు. ప్రకాశం, పొట్టి శ్రీరాములు, వైఎస్సార్ జిల్లాలు అవే పేర్లతో కొనసాగుతున్నాయి. కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలన్న డిమాండ్ ను అన్ని రాజకీయపక్షాలు సమర్థించాయి. కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా అంబేడ్కర్ పేరు పెట్టలేదు.కానీ కొద్ది రోజుల్లోనే ‘అంబేద్కర్ కోనసీమ’ జిల్లాగా నామకరణం చేస్తూ వచ్చిన నోటిఫికేషన్ పెను వివాదంగా మారింది. ఆ వివాదం మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లను తగులబెట్టే వరకూ,జిల్లా కలెక్టరేట్,ఎస్పీ ఆఫీసులపై దాడి చేసే వరకూ వెళ్లింది.కోనసీమ రక్త సీమగా మారడం ఆశ్చర్యకరమైన ఘటన. మంటల్లో కాలిపోతున్న అమలాపురం.ఆ రోజు ఎన్నో గగుర్పొడిచే సన్నివేశాలు.

మూడు,నాలుగు కులాలకు చెందిన జనాభా దాదాపు సమానంగా ఉన్నది.ఆర్థికంగా, రాజకీయంగా పట్టు కోసం ఆయా కులాల మధ్య పోటీ చాలా కాలంగా కనిపిస్తోంది.వేగంగా మారిపోయిన సామాజిక,ఆర్థిక స్వరూపమే కోనసీమలో వివాదాలకు మూలం.కాగా కోనసీమకు కుల ఘర్షణల చరిత్ర ఉంది.ఎనిమిదేండ్ల కిందట డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలను ధ్వంసం చేసినప్పుడు కోనసీమ కలవరపడింది.మాలల నుంచి పినిపే విశ్వరూప్,శెట్టిబలిజ నుంచి వేణుగోపాలకృష్ణ జగన్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు.

అమలాపురం జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలన్న డిమాండ్ తో దీక్షలు, ర్యాలీలు జరిగాయి. వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు,ప్రజా సంఘాలు వాటిలో పాల్గొన్నాయి. జనసేన పార్టీ దీక్షలు చేపట్టింది. అధికార వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు నేరుగా సీఎంకి వినతిపత్రం సమర్పించారు.కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని తాళ్లరేవులో ఇటీవలే జరిగిన సభలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌ను బలపరుస్తున్నట్టు బీజేపీ కూడా ప్రకటించింది.

అంబేద్కర్ పేరు పెట్టడం పట్ల ప్రజల్లో ‘విభజన’ ఏర్పడింది. దానిని సకాలంలో గుర్తించకపోవడం ప్రభుత్వ వైఫల్యం. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఘర్షణల అణచివేతలో జాప్యమే భారీ విధ్వంసానికి,హింసకు కారణమైంది. సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చిన ‘ఛలో అమలాపురం’ ప్రచారం వెనుక ‘ప్రణాళిక’ను గుర్తించడంలో ఇంటిలిజెన్స్ అధికారయంత్రాంగం దారుణంగా విఫలమైంది.హింసాకాండను ఉక్కుపాదంతో అణచివేయలేకపోవడం వెనుక కొన్ని ‘ఆదేశాలు’ ఉన్నాయన్న సమాచారం ఉన్నది.అల్లర్లకు పాల్పడిన వాండ్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తే ‘కాల్పుల’దాకా వెళ్లేదని, దాంతో అంబేద్కర్ భావజాల వ్యతిరేక శక్తులు,జగన్ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు జేయాలనుకుంటున్న ప్రత్యర్థుల మనోవాంఛ నెరవేరుతుందని అధికారపార్టీ వైసీపీ నాయకులు భావించారేమో ! మొత్తం ఘటనలు వ్యూహాత్మకంగా,ప్రణాళికా బద్దంగా జరిగాయని ఎలాంటి పరిశోధన చేయకుండానే నిర్ధారణకు రావచ్చు.అప్పటికప్పుడు ఆవేశంతో జరిగిన విధ్వంసం కాదని నిస్సందేహంగా చెప్పవచ్చు.కోనసీమలో కులాల మధ్య సాగుతున్న ‘ఆధిపత్య’పోరు ఇలా బద్దలవుతుందని ఎవరూ ఊహించలేదు.

First Published:  26 May 2022 4:22 AM GMT
Next Story