Telugu Global
NEWS

చేపమందు.. ఇక గత చరిత్రేనా..?

ఆస్తమా రోగులకు చేపమందు పంపిణీ గత చరిత్రగా మిగిలిపోతుందా..? వరుసగా మూడో ఏడాది కూడా చేపమందు పంపిణీ ఆపివేయడానికి కారణం ఏంటి..? కరోనా ప్రభావం తగ్గినా ఈ ఏడాది చేపమందుని ఎందుకు పంపిణీ చేయడంలేదు..? గతంలో చేపమందు పంపిణీని జనవిజ్ఞాన వేదిక పలుమార్లు కోర్టుల్లో సవాలు చేసింది. ఆ తర్వాత కోర్టు అనుమతితో పేరు మార్చి చేప ప్రసాదంగా దీన్ని పంపిణీ చేస్తున్నారు. మానవ హక్కుల కమిషన్ కూడా గతంలో అభ్యంతరాలు తెలపగా ఎప్పటికప్పుడు అనుమతి తీసుకుని […]

Fish_Medicine_for_Asthma
X

ఆస్తమా రోగులకు చేపమందు పంపిణీ గత చరిత్రగా మిగిలిపోతుందా..? వరుసగా మూడో ఏడాది కూడా చేపమందు పంపిణీ ఆపివేయడానికి కారణం ఏంటి..? కరోనా ప్రభావం తగ్గినా ఈ ఏడాది చేపమందుని ఎందుకు పంపిణీ చేయడంలేదు..? గతంలో చేపమందు పంపిణీని జనవిజ్ఞాన వేదిక పలుమార్లు కోర్టుల్లో సవాలు చేసింది. ఆ తర్వాత కోర్టు అనుమతితో పేరు మార్చి చేప ప్రసాదంగా దీన్ని పంపిణీ చేస్తున్నారు.

మానవ హక్కుల కమిషన్ కూడా గతంలో అభ్యంతరాలు తెలపగా ఎప్పటికప్పుడు అనుమతి తీసుకుని చేపమందు పంపిణీ చేస్తోంది బత్తిన కుటుంబం. చేపమందు కాస్తా తర్వాత చేప ప్రసాదంగా మారింది. దీనిలో ఔషధ గుణాలున్నాయనే ప్రచారం ఆపేసి.. ఆయుర్వేద ప్రసాదంగా పంపిణీ చేస్తున్నారు. అయితే రెండేళ్లుగా కరోనా వల్ల చేప ప్రసాదం పంపిణీ ఆగిపోయింది. మూడో ఏడాది కూడా బత్తిన కుటుంబం దీన్ని పంపిణీ చేయలేమని చెప్పింది. కరోనా ఆంక్షల కారణంగా పంపిణీ ఆపివేస్తున్నట్టు ప్రకటించింది.

ప్రతి ఏడాదీ మృగశిర కార్తె సందర్భంగా తెలంగాణలోని బత్తిన కుటుంబం చేప ప్రసాదం పంపిణీ చేసేది. ఆయుర్వేద మందుతోపాటు పాలపిండి, ఇంగువ, బెల్లం, పసుపు వంటి సహజ సిద్ధమైన పదార్థాలను దీని తయారీలో వాడతారు. ఈ ప్రసాదాన్ని కొరమీను చేప నోటిలో ఉంచి..

దాన్ని రోగులతో మింగిస్తారు. బతికి ఉన్న చేప పిల్లను మింగడం ప్రమాదకరమని, అది గొంతులో అడ్డుపడితే ఉబ్బసం నయమవడం అటుంచి, కొత్త సమస్యలు పుట్టుకొస్తాయని జనవిజ్ఞానవేదిక వారు గతంలో ఆందోళనకు దిగారు. పైగా చేప ప్రసాదం పంపిణీ రోజున ప్రతి ఏడాది రద్దీ నెలకొంటుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో దీన్ని ఉచితంగా పంపిణీ చేసేవారు. బతికి ఉన్న చేప పిల్లలను మాత్రం రోగులే తమతోపాటు తెచ్చుకోవాల్సి ఉండేది.

దాదాపు 150ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ చేప ప్రసాదం పంపిణీ ఇప్పుడు పూర్తిగా ఆగిపోయే పరిస్థితి నెలకొన్నదని అర్థమవుతోంది. రెండేళ్లుగా కరోనా వల్ల పంపిణీ ఆపేశారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొని ఉన్నా కూడా చేప ప్రసాదంపై వస్తున్న విమర్శల కారణంగా బత్తిన కుటుంబం పంపిణీకి సుముఖంగా లేనట్టు తెలుస్తోంది.

కొవిడ్ ఆంక్షల కారణంగా ఈ ఏడాది కూడా చేప ప్రసాదం పంపిణీ చేయడంలేదని వారు ప్రకటించడం గమనార్హం. నిజంగానే కొవిడ్ ఆంక్షలు కారణమా, లేక వారిపై ఒత్తిడి ఉందా, ఇతరత్రా విమర్శల కారణంగా వారు వెనకడుగు వేశారా అనేది తేలాల్సి ఉంది. ఈ ఏడాది చేప ప్రసాదం తయారు చేయడంలేదని రోగులెవరూ దీనికోసం హైదరాబాద్ రావొద్దని నిర్వాహకులు బత్తిన గౌరీశంకర్ స్పష్టం చేశారు.

మొత్తమ్మీద ఏడాదికేడాది చేప ప్రసాదానికి ఉన్న క్రేజ్ బాగా తగ్గిపోవడం, కరోనా ఆంక్షలు, విమర్శల నేపథ్యంలో.. చేప ప్రసాదం పంపిణీ ఈ ఏడాది కూడా ఆగిపోయింది.

First Published:  25 May 2022 1:54 AM GMT
Next Story